నా వెలుతురు
నా కంటిపాపవై జన్మించావు తల్లీ!
వరాల మూటలా నా భాగ్యం కూర్చగా
వేల కాంతులు ఒడినిండా నింపగా
ఏనాటి దానాల ఫలితమో నీ జననం
నా రాతని మార్చి లోకాన్ని వెలిగించావు
లేని ఆశలు నింపి భవితని మార్చావు
ఏమారిన మనసుకు ఓదార్పువై నిలిచావు
అన్నీ మరచి నీవే లోకమని తలపించావు
వేవేల కాంతుల్ని కనులలో నింపావు
బోసి నవ్వులు రువ్వుతూ బాధలు తీర్చావు
కష్టం మైమరపించే నీ నవ్వులు
నీకై బతకాలనే ఆశల్ని నింపి నిర్జీవమైన మనసుకు
ఆశల ఊపిరులూది చక్కని దరహాసాలు
కలకాలం వీడని బంధమై అల్లుకున్నాయి
వెగటుగా మారిన జీవితాన జవజీవాలు నింపాయి
వేల కిరణాల కాంతుల్ని మోసుకొచ్చాయి
నీ రాకతో లోకమే కొత్తగా మారి నిలిచాయి క్షణాలు
సరికొత్త ఉషోదయాలకి తెరతీస్తూ..
నవోదయపు వెలుగుల్ని నింపుతూ నా జీవితాన….
– ఉమామహేశ్వరి యాళ్ళ