నా అక్షరాలు
నా అక్షరాలు
తిలక్ వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు కావు!
నా అక్షరాలు కాళిదాసు నాలుకపై లిఖించిన
బీజాక్షరాలు కావు!
నా అక్షరాలు పేదరికంలో నక నకలాడే
పేదరాసిపెద్దమ్మలు!
నా అక్షరాలు కోస్తాంధ్ర తుఫాను వరదలు
నా అక్షరాలు తెలంగాణ బతుకమ్మ గొబ్బెమ్మలు
నా అక్షరాలు రాయలసీమ కరువు ప్రాంతాలు
నా అక్షరాలు బడుగు బలహీన వర్గాలు
నా అక్షరాలు జానెడు పొట్టకోసం ఊరుదాటి
వెళ్లిపోయే వలసకూలీలు!
నా అక్షరాలు వానచుక్క కోసం ఆకాశంలో
మబ్బులను ఆశగా చూస్తూ…
వరుణదేవుణ్ణి ప్రార్ధించే రైతులు!
నా అక్షరాలు నిరుపేద ఇళ్లల్లో పంచభక్షపరమన్నాలు
నా అక్షరాలు చిన్నారిచేతుల్లో మట్టిపలకపై
దిద్దబడిన ఓనమాలు!
నా అక్షరాలు శ్రామిక చేతుల్లో ఆకలిపద్యం పాడే
గడ్డపార గునపాలు
నా అక్షరాలు గుండెధైర్యంతో ఉపొంగే ఉద్యమ
విప్లవ కాగడాలు
నా అక్షరాలు శ్రమసౌందర్యంలో నుంచి మెరిసి
చెమటచుక్కలుగా రాలిన ఆణిముత్యాలు
– గురువర్ధన్ రెడ్డి