మౌఖిక పరీక్ష

మౌఖిక పరీక్ష

(ఒక ప్రముఖ ప్రజాదరణ పొందిన దిన పత్రిక విలేఖరి జానకమ్మ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతడు ఏమి అడిగాడు? ఆమె ఎలా స్పందించింది)

విలేఖరి:- నమస్కారం, జానకమ్మ గారు. మీ ఈ 65 ఏళ్ళ జీవితం ఎలా సాగింది అనుకుంటున్నారు? మీకు తృప్తి కరంగానే అనిపిస్తోందా?

జానకమ్మ:- నమస్కారం, బాబు. తృప్తికరంగా ఎవరి జీవితాలు సాగవు. ఒడిదుడుకులు అందరమూ ఎదురుకోవాల్సిందే ….! నాకూ, అవి తప్ప లేదు.

విలేఖరి:- బాగా చెప్పారు. మీ ముఖంపై ఆ చిరునవ్వు చూస్తుంటే ముచ్చటగా ఉంది, అమ్మ. మీరు అందరిలా కష్టాలు పడినట్టు అనిపించట్లేదు.

జానకమ్మ:- బహుశా నువ్వు నన్ను క్రితం లో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం నేను తృప్తిగా నవ్వుతున్నాను. ఇకపై కూడా ఈ మందహాసము ఇలానే చెరిగిపోకుండా ఉంటుంది.

విలేఖరి:- చాలా సంతోషం, అమ్మ. అంటే మీరు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఏం అంటారు మీరు?

జానకమ్మ:- ఇబ్బందులు పడిన మాట ముమ్మాటికీ నిజం, బాబు.

విలేఖరి:- చెప్పండి, అమ్మ. ఎవరు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టారు?

జానకమ్మ:- మా కుటుంబ సభ్యులు…… ఆహా, కాదులేండి!

విలేఖరి:- అమ్మ మీరు ఏదో చెప్పడానికి సందేహిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చెప్పండమ్మా ఏమీ దాచుకోకుండా…!

జానకమ్మ:- ఆహా, అలాంటిదేమీ లేదు, బాబు. సర్వ సాధారణంగా ఓ గృహిణిగా తల్లిగా అందరూ ఎలాంటి ఇబ్బందులు పడతారో నేను కూడా అలానే ఇబ్బందిపడ్డాను.

అయినా ఇప్పుడు నేను ఎవరి గురించి అయినా మాట్లాడినా అంతగా బాగుండదు, బాబు. ఇన్ని రోజులు దిగమింగి బతికాను, కానీ, ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు.

విలేఖరి:- మీరు ఏమన్నారో అర్థం కాలేదు అంటే ఇప్పుడు మీకు ఏ ఇబ్బందులు లేవంటారా?

జానకమ్మ:- అవును బాబు. ఇప్పుడు నేను హాయిగా నా హృదయాంతరాళాల్లో నుంచి నవ్వుతున్నాను. నా కళ్ళల్లో నా మాటల్లో, పరిపూర్ణమైన ఆనందం వ్యక్తమవుతోంది.

విలేఖరి:- అమ్మ మీకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు.. మీతో వారి నడవడి ఈ మార్పుకి కారణమా?

జానకమ్మ:- అవును బాబు ఇప్పుడు వాళ్ళ లో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. డబ్బులు బాగా సమకూరాయి. తరుచు విహారయాత్రలకు అంటూ వెళుతుంటారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే…. నిన్నటి నుంచి మాత్రం వాళ్ళ ఆనందానికి పట్టపగ్గలు లేవు. వారి సాధారణ జీవిత నౌక, ఉన్నపళంగా ఒక మల్టీ క్రూయిజ్ గా మారిపోయింది. నాకేమీ బాధ లేదు నాయనా. వారి సుఖమే నేను కోరుకునేది.

(అంతిమయాత్ర వాహనంలో జానకమ్మగారిని స్మశాన వాటికకి తీసుకొని వెళ్లారు ఆమె ముగ్గురు కొడుకులు. ఆమె ఆత్మ శరీరం నుండి వేరు పడింది.

రెండు రోజుల క్రితం, రోడ్డు ప్రమాదంలో మరణించిన, ఒక ప్రముఖ దిన పత్రిక విలేఖరి యొక్క ఆత్మ చేసిన ఇంటర్వ్యూ ఇది.)

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *