మార్పు
ఎంతో స్వార్ధం నిండిన అమ్మాయి అయినా తల్లి కాగానే దైవత్వం వస్తుంది.
ఈ మార్పు సహజంగా
జరుగుతుంది. ఇక్కడ
ఎవరూ,ఎవరికి,ఏమీ నేర్పించరు. ఇది ఒక
సహజమైన ప్రక్రియ.
జలజ చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగింది.
ఇంట్లో పని చేసే అవసరం
లేదు. వంట చేయటం రాదు అనటం కంటె నేర్చుకోలేదు
అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నేర్చుకోవాల్సిన
అవసరం లేదు. ఇంట్లో వంటవాళ్ళ,పనివాళ్ళ
సైన్యమే ఉంది మరి.
అలాంటి జలజకు
పెళ్ళైంది. భర్త తరఫు
వారు కూడా స్ధితిమంతులే.
కొన్నాళ్ళకు ఓడలు బళ్ళు
అయినట్లు పరిస్థితి మారింది.
ఆస్తి హరించుకు పోయింది.
అప్పటికి జలజకు ఇద్దరు
పిల్లలు. భర్త పెద్ద వ్యవహారం
తెలిసిన వ్యక్తి కాదు. ఒట్టి
అమాయకుడు. జలజే
తన కుటుంబాన్ని పోషించటం కోసం నడుం బిగించింది.
ఉన్న డబ్బులు పెట్టి వ్యాపారం
చేసింది. చదువుకున్న
చదువు ఆమెకు ఉపయోగపడింది. కష్టపడింది,చెమటోడ్చింది
ఆపై సక్సెస్ ఆమెను వరించింది. గొప్ప వ్యాపార
దక్షతగల మహిళగా ఆమెకు
పేరు వచ్చింది. వ్యాపారంతో
పాటు పిల్లల బాగోగులు అన్నీ
చూసేది. ఆ పిల్లలు పెరిగి
సమాజంలో గొప్ప వ్యక్తులు
అయ్యారు. జలజ వ్యాపారం
మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరించింది.
బళ్ళు మళ్ళీ ఓడలు అయ్యాయి. నిజంగా చెప్పాలంటే జలజకు ఏమీ తెలియదు. కుటుంబాన్ని కాపాడుకోవటం కోసమే
నడుం బిగించి ముందడుగు
వేసింది. అమ్మ అయినాకే ఆమెలో పరిపక్వత వచ్చింది.
పిల్లల కోసం ఏ త్యాగం చెయ్యటానికైనా సిద్ధం అయ్యింది. అలాంటి మహిళలు నేటి సమాజంలో కోకొల్లలు. వారందరికీ మాతృ
దినోత్సవ శుభాకాంక్షలు.
-వెంకట భానుప్రసాద్ చలసాని