మళ్ళీ జన్మిస్తా …

మళ్ళీ జన్మిస్తా …

వెచ్చని కిరణాల తాకిడితో
ఒళ్లు విరుచుకుంటూ సిగ్గుల
మోగ్గయి పోతూ, అతన్ని చూసి
మొగ్గలా ముడుచుకు పోతూ
అతన్ని కను చివరల నుండి ఓరగా చూస్తూ
రేయంతా చల్లని రెక్కల చాటున దాగినా
ఇప్పుడతని చూపుల తాకిడి అంతకంతకూ
ఎక్కువవుతుంటే, ముడుచుకున్న మొగ్గయిన
తాను విస్తరిస్తూ, రెక్కలు విచ్చుకున్న పక్షిలా
అతని చూపంతా తన శరీరం అంతా ప్రసరించాలనే ఆశతో
అతన్ని తన వైపుకు తిప్పుకోవాలనే తపనతో
తన వొళ్ళంతా కళ్ళతో అతన్నే చూస్తూ,
అతని చూపంతా మరొకరి వైపు తాకకుండా
తను చేసే ప్రయత్నమంతా చేజారి పోయి
చివరికి అతని చూపులు విశ్వమంతా వ్యాపించి
తనకు దక్కకుండా మరో చోటికి కదలడం తో
అతన్నాపలేక, మౌనంగా కన్నీరు కారుస్తూ
ఎవరికి చెప్పుకోవాలో తెలియక మధన పడుతూ
అతను దూరమవడం తో మరలి రా ప్రియా అంటూ
మౌన భాషలో పిలుస్తున్నా పలక, నిర్ధయగా వదిలి
పోతున్న అతన్ని చూస్తూ అతనే వెళ్ళాక ఇంకీ శరీరం
ఎవరికోసమంటూ తిరిగి ముడుచుకు పొయీ, ఇక
తనువు చాలించాలనుకుంటూ, తనకు తానే శిక్ష
వేసుకుంటూ, రాలిపడిందొక సుమాబాల…
మరో ఉదయ కాంతి కోసం ఎదురు చూస్తూ మళ్లీ
జన్మిస్తా నీ కోసమంటూ బాస చేసిందా క్షణానా…

– భవ్యాచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *