మాటిచ్చాను

మాటిచ్చాను

మబ్బులన్నీ భేటీ అయాయి
మనుషుల మనసుల మల్లే!
మల్లెలను చినుకుల్లా రాల్చాయి
కునుకు పానుపును సాఫు చేశామని
భ్రమ పడుతున్నాయి!

పహరా కాస్తూ రాత్రి
మనసు తలుపులను
తెరిచింది !
జ్ఞాపకాలను దులిపి
చిలిపిగా నవ్వినా
గతం గాయమై సలుపుతోంది!

కలహం, ప్రణయాల చిరునామాల
కాలం కిసుక్కుమంటోంది!
జారిపోయే క్షణాలను దాచుకోక
గతం రహదారులకు బాధను పూస్తావే అని చికాకు పడుతోంది !

ఉలిక్కిపడి బుద్ధినో కొలిక్కి తెచ్చాను!
వర్తమానం రుచికి
గతం తీపిని జతచేయాలనుకుని
చినుకు మల్లెలను దోసిట పోశాను !

మబ్బుల భేటీకి మనోయానం చేసి
మన్నించమన్నాను!
కునుకు పానుపు పై
భవిష్యత్తు కలలు పరచి
గతం గులాబీలతో అలంకరిస్తానని మాటిచ్చాను!

– సి. యస్. రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *