కౌగిలి
ఈ కరోనా ప్రపంచాన్ని ఆపింది, ఎక్కడి వారిని అక్కడే ఉండేలా చేసింది కాలాన్ని ఆపేసింది. కన్నీటికి కారణం అయ్యింది. ఆకలి కేకలు పెట్టించింది కూలిలకు పని లేకుండా చేసింది.
వేల ఉద్యోగాలను తీసింది. రైళ్ళు, బస్సులు,ప్లేన్స్ ని ఆపింది. అన్ని సరిగ్గా ఉన్నా అవిటివారిని చేసింది, కళ్ళున్నా గుడ్డి వారిని చేసింది, కూలి చేసుకుని పొట్ట పోసుకునే వారికి అది కూడా దొరక్కుండా చేసింది.
ఉన్నవాడు, లేని వాడు, రాజకీయ నాయకుడు, డాక్టర్, సినిమా యాక్టర్, లాయర్, జర్నలిస్ట్, డ్రైవర్,పేద, గొప్ప అనే తేడా కనికరం ఏమి లేకుండా అందర్నీ అంటుకుని తన వారెవరో పరాయి వారెవరో తెలిసేలా చేసింది.
ఎంత ఆస్తులున్నా బంగారం భూములు ఉన్నా, ఖరీదైన బట్టలు వేసుకున్నా, చినిగిన చీర కట్టుకున్నా అందరికి కావలసింది చివరికి చేరేది కాటికే అని తెలిపింది. ప్రపంచాన్ని స్థంభింప చేసింది.
కాలం ఆగిపోయింది, సమయం కదలలేక పొయింది. వలస వచ్చిన వారికి నిలువ, నీడ లేకుండా పొయింది. ఎందరో మహాను భావుల్ని, రాజకీయ నాయకులని, స్వాతంత్ర సమరయోధుల్ని, ప్రజల మనుషులని తన తోనే తీసుకు పొయింది.
కరోనాకి మంచివారు, చెడ్డవారు, అనే తేడా లేవీ లేవు. ఈ కరోన కు దొరికిందే చాలు అనుకుంది. తీసుకుని వెళ్లిపోయింది.. ఉన్నదాంట్లో కలో గంజో తాగి బతికే వారికి అది కూడా దొరక కుండా చేసింది.
చావు రుచి చూపించింది, చావంటే భయం లేని వారికీ అదెలా ఉంటుందో దగ్గర ఉండి చూపించింది. ఎవరు పరాయి వారో ఎవరు ఆత్మియులో తెలియ చెప్పింది. ఎవరూ కడవరకు తోడూ రారని, చూపించే ప్రేమంతా బూటకం అని తెలిపింది.
అప్పటి దాక వెన్నంటే ఉన్న బంధువులు బంధువులు కాదని రాబంధువులని కేవలం డబ్బు కోసం స్వార్ధం కోసం ప్రేమని చూపించేవారని తెలియ చేసిన కరోన వేల మందిని బలి తీసుకుంది.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కన్న తల్లి అయినా, తాళి కట్టిన భర్తైన ప్రాణాల కంటే ఎక్కువ కాదని నిరూపించింది. కన్న వారిని వదిలేసేలా చేసింది. కడుపున పుట్టిన బిడ్డలు వదిలేసేలా చేసింది,.
ఆలిని పట్టించుకోకుండా చేసింది. తండ్రి కళ్ళ ముందు చనిపోతున్నా చూస్తూ ఉండేలా చేసింది, నలుగురు మోయనియకుండా చేసింది.
నలుగురి భుజాల మీద మోయని చావు ఒక చావేనా అనేలా చేసింది. నలుగురు చేరితే నాలుగు ప్రాణాలు తీస్తాను అన్నది. నాతో కలిసి సహజీవనం చేయండి అంటూ మెలిక పెట్టింది. వేల మంది ని నిరాశ్రయులను చేసింది కరోన ..
చేతుల శుభ్రత కే పీట వేసింది. వ్యక్తి గత శుభ్రత నేర్పింది, ఉన్నదాంట్లో సర్దుకు పొమ్మంది, ప్రేమను చూపించే వారి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసింది. కన్న వారికీ ఎవరు తన మంచిని కోరెవారేవరో చూపించింది.
తన కోసం ఏడ్చే వారెవరో తెలియ చెప్పింది. పెళ్ళిళ్ళు కాకుండా చేసింది. ముద్దు ముచ్చట్లు తీర్చుకోకుండా ఆపింది, ఫంక్షన్ హాల్లు మూత పడేలా చూసింది. పోలీసులకు పని చెప్పింది. వ్యాపారుల కడుపులు కాలేల చేసింది. దరిద్రపు కరోన, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుంటు పడేలా చేసింది…
మంచి ఆరోగ్యమే మహా భాగ్యం అని చూపించింది ఆరోగ్యం కోసం మంచి తిండి తినేలా చేసిoది, వ్యాపారులకు డబ్బు తెచ్చి పెట్టింది. కొందరిని బికారులని చేస్తే కొందరిని లక్షాధికారులను చేసింది.
ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పెంచేలా చేసింది. కుటుంబ బాధ్యతను నేర్పింది, కుటుంబం ఎంత అవసరమో చెప్పింది.
సమయం లేదంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన వారికీ కుటుంబ విలువను తెలియ చెప్పింది, తమ కోసం ఏడ్చే వారన్నారని తెలిసేలా చేసింది.
పిల్లలకు చదువు విలువ నేర్పింది. ఆటకెక్కిన చదువుల గురించి పిల్లల భవిష్యతు గురించి బెంగ పడేలా చేసింది. ఏళ్లుగా పాసు కానీ వారిని అదృష్టం వరించేలా చేసింది.
సినిమా తారలు అయినా తమ వరకు వస్తే ఎవరైనా ఒక్కటే, మానవులంతా సమానమే అని చాటి చెప్పింది. అందరితో మంచిగా ఉండాలని….
నలుగురికి సహాయం చేయాలనీ, నలుగురిని సంపాదించుకోవాలని, తల్లి దండ్రులని బాగా చూసుకోవాలని,స్నేహితులని, హితులని మర్చిపోవద్దని సూచించింది.
ఆన్లైన్ చదువులని ఇచ్చింది, ఆన్లైన్ లో ఉద్యోగాలు చేసేలా చేసింది. ఇంట్లో ఉండి ఆడవాళ్ళ కష్టాలను తెలిసేలా చేసింది. ఆడవారి విలువను పెంచింది.
నాకంటే దేవుడు గొప్ప కాదని నిరూపించిది కరోనా దేవుడు కూడా మానవుడే అన్నిటిని భరించాల్సిందే అని అంటూ దేవుడికే సవాలు విసిరింది.
దేవుడి పేరు తో జరుగుతున్న మోసాలను కొన్ని రోజులైనా ఆగేలా చేసింది, సృష్టిని సృష్టించిన వాడె తనని కాపాడుకోలేక పోయాడు. తన గుళ్ళు మూత పడిపోయిన ఏమి చేయలేక పోయాడు.
ఇంత అనర్దం జరుగుతున్నా ఏమి చేయలేని రాయి అయి పోయాడు. రాయిల్లో రాయిగా కలిసి పోయాడు. కొన్నాళ్ళు కళ్ళు మూసుకున్నాడు. చూసిన కరోనా విలయ తాండవం చేసింది.
వికట్టట్టహసం తో కొత్తగా తయారయ్యి బలం పుంజుకుని మళ్ళి విజ్రుమ్భించింది. ఈలోగా వరదలు తయారయ్యి భయంకరంగా భయాన్ని కలిగించాయి.
ఇల్లు కొట్టుకుపోయి, వాకిళ్ళు లేక కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి లేక, చలిలో వాన లో వచ్చేవి కట్టేలో, పాములో ఎక్కడ ఏముందో తెలియక ప్రజలంతా వణికి పోయారు.
భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఇప్పటికి ఇంకా దాన్నుండి బయటకు రాలేక పోయారు. చిన్నవారు, పెద్ద వారు, ముసలి, ముతక, పడుచు,పేద, గొప్ప అనే తారతమ్యాలు లేని కరోన వరదల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. ఎందరో నిరాశ్రయులు అయ్యారు…
పోయిన వారంతా మంచివారు వాళ్ళ తీపిగుర్తులం మేము అని అనుకోవాలా, లేదా మాకు అంటలేదని సంతోష పడాలో తెలియని స్థితిలో పోయిన వారందరికి వందనాలు చేయడం తప్ప ఏమి చేయలేం కాబట్టి…
ఇవ్వన్ని ఇప్పటికైనా పోయి మళ్ళి మనసారా, తృప్తిగా, హాయిగా, స్వేచ్చగా, స్వచ్చమైన గాలి పిలుస్తూ, స్నేహితులని మనసారా కౌగిలించుకునే రోజు తొందరలోనే రావాలని, మూతికి మాస్కు పెట్టుకోకుండా తిరిగే మంచి రోజు తొందరలోనే రావాలని, అందరికి మంచే చేయాలనీ, అంతా మంచే జరగాలని కోరుకుంటూ…
– భవ్య చారు
బావుంది, అభినందనలు