ఆరాధన
అదో చిన్న గ్రామము. బొగ్గు పొయ్యిలపై వంట చేసే సాంప్రదాయము. అప్పటికింకా గ్యాస్ పరిచయం కాలేదు. అందుకే జనాలకి గాసిప్స్ ఆలవాటు కాలేదు. అలమరికలు లేకుండా మాట్లాడేసుకునేవారు.
ఇప్పుడు మనకి ఆకాశం అంటే ఒక్కటే కాని ఉదయం పూట మాకు రెండు ఆకాశాలు దర్శనము ఇచ్చేవి. ఒకటి దైవికమైనది. రెండోది మానవికమైనది. ఉదయాన్నే కొన్ని వందల ఇండ్లలో వాకిట్లో బొగ్గు పొయ్యిలు పెట్టేవారు.
మా చిన్నారి జీవితాలకి ఆ చిన్నారి ఆకాశం మాకు ఇప్పటికీ తీపి గుర్తుగా ఉండిపోయింది. మా తండ్రి గారిది ప్రభుత్వ ఉద్యోగం. వారు కేటాయించి ఇండ్లలోనే ఉండాలి. అన్ని ఒకే మాదిరిగా రైలు బోగీల్లా విచిత్రంగా కనబడేవి.
నేను, నా తమ్ముడు జంట కవులం, చిలిపి చేష్టలకి చిరునామా మా ఇల్లు, కర్ర బిళ్ళ ఆడుతూ, రాయమల్లమ్మ అనే ఒక ఆవిడది గుండు పగలగొట్టాం. ఆమెదే అదృష్టమో ఈ సంఘటనకి ముందు రోజు గుండు కొట్టించుకుని తిరుపతి నుంచి వచ్చింది.
క్షణాల్లో ఆమె గుండు బుస, బుస వుల్కలా ఉబ్బిపోయింది. కోపంతో ఆమె పొయ్యిలా మారింది. గుండు మీద పుల్కా షెఫ్ సహాయం లేకుండానే ఉవ్వెత్తున ఉబ్బి తాజాగా కనిపించింది.
రోజులు భారంగా గడచేవి ఆ రోజుల్లో, వినోదానికి టీ.వీ.లు కూడా లేవు. టి.వి. పెట్టించుకోవాలంటే, తాటి చెట్టు పొడవైన ఆంటీనా పెట్టాలి. ఈలోపు మేము తాటి చెట్టంత ఐపోయాము.
మా పెరట్లో గులాబీలు, కనకాంబరాలు, బంతి పూసేవి. వీటితోపాటు గోంగూరవి లేత పసుపుపచ్చని పూలు కూడా పూస్తుండేవి. ఏ రోజూ వాటిపై దృష్టిపడని మాకు, క్రమంగా వాటిని ‘ఆరాధించడం’ మొదలు పెట్టాము.
అంటే అందానికి ఆకర్షితులమయ్యాం. మా ఇంటి పక్కనే ఒక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉండేది. సుమారు 10-30 గంటలకి వారికి విరామ సమయం.
గల, గల మంటూ వారు మా ఇళ్ళవైపు ఒచ్చేసేవారు. వారి చుట్టాల ఇళ్ళలో కాసేపు గడిపి, మళ్ళీ వెనుదిరిగేవారు. మేమిద్దరం శుక్రవారం కోసం ఎదరు చూస్తూ ఉండే వాళ్ళం.
మిగిలిన రోజుల్లో అమ్మాయిలు తలకి నూనెలు పట్టించేసి పువ్వులు లేని మొక్కల్లా కనిపించేవారు. శుక్రవారం రోజు మాత్రం పూలు విరబూసిన మొక్కల్లా అందంగా కనబడేవారు.
ఆ రోజు శుక్రవారం. మా తమ్ముడు నా దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. “ఒరేయ్. ఆన్నయ్యా…. ! నా మనసులో మాట చెప్తున్నాను.
మన పెరట్లో పూసిన ఒక గులాబీని నేను బండి రోడ్డు పైన పెట్టి (ఇంటి ముందే రోడ్డు ఉండేది లేండి) దాని పైన ఉంచుతాను దాన్ని ఏ అమ్మాయి తీసుకుంటుందో ఆమెకి మన ఇంటిపై దృష్టి ఎక్కువ అని నమ్ముతాము.” అని అన్నాడు.
ఇదేదో కర్రా బిళ్ళ కన్నా బావుందన్పించింది. వెంటనే సరే, అన్నాను. సమయం 10-20 అయ్యింది. మెల్లిగా అమ్మాయిలు అందమైన కురులతో ఇళ్ళవైపు రావడం మొదలు పెట్టారు.
అనుకున్న విధంగా మా తమ్ముడు ఒక నిగ, నిగ లాడే గులాబీని బండిపైన పెట్టి వచ్చాడు. మాలో ఆతురత శిఖరస్థాయికి చేరింది.
యే అమ్మాయికి ఉండదండీ శుక్రవారం తలలో “రోజా” పెట్టుకోవాలని. మేమిద్దరం ఏదో మాట్లాడుకునేలోపు ఒక్క పుదుటన పదిమంది అమ్మాయిలు ఆ పువ్వునందుకోడానికి వచ్చారు.
ఆ కుదుపులాటలో రెక్కలు ఊడి కింద పడ్డాయి. విప్పిన గొడుగులా ఉన్న ఆ పువ్వు. మూసిన గొడుగులా సీటుపై గాలికి కదుల్తూ కనిపించింది.
మరుసటిరోజు ఆ ప్రయత్నం నేను కూడా చేద్దామని అనుకున్నాను. పోటీ తట్టుకోవడం పది మంది మనస్సులో తిష్ట వేయడం ఎందుకని మానుకున్నాను.
ఆ గుంపులో ఎవరు రాధలో, ఎవరు ఆరాధనలో మాకు ఇప్పటికీ తెలియదు. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడు అమ్మాయిల కన్నా, “మేము మా గ్రామాన్ని ఆరాధిస్తున్నామేమో”, అనిపిస్తుంది.
మా చెయ్యి చాచే దూరంలో ఉన్న మా మానవిక, “ఆకాశం” ఉన్నదాంట్లో తృప్తిగా బ్రతుకు అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది.
– వాసు