జీవజలమై పలకరించు
పూలు పరిమళించినట్లు
ఆలోచనలు వికసించాలి
మనసులో మాలిన్యాలు తొలిగితే
మానసం మందారమై విచ్చుకుంటుంది
స్వార్థం మేటలు వేసిన చోట
మంచితనం మేళవించి పూడికలు తీయాలి
ఆకలి దప్పుల డప్పుమోత చెవికి సోకేలా
నువ్వేమిటో నీకు తెలిసినంత ఇతరులకు తెలీదన్న ఎరుక పెరిగితే
పేదరికాన్ని అర్థం చేసుకునే
పరిపక్వత పరిఢవిల్లుతుంది
మనిషీ.. నీకు తెలియనివా ఇవి
మనసు తలుపులు మూసేశావు కదా
మంచితలపుల ప్రాణవాయువందక
ఉక్కిరిబిక్కిరి అవుతూ
ఉక్కుసంకెళ్ళలో మిగిలావు
కాలం కరవాలం వేటువేయక మానదు
కాస్త నిన్ను నువ్వు మిగుల్చుకోవాలంటే
పొడిబారిన హృదయంలో
దయార్ద్రతల జీవజలాన్ని చిలకరించు
చిగురించే ఆశతో చిలకలు వాలిన చెట్టవుతావు
నిను బేరీజు వేసేవారిని చిత్తు చేస్తావు
-సి.యస్.రాంబాబు