జీవన్ముక్తుడు – కథానిక
ఆదివారం కావటం వలన మియాపూర్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. సీనియర్ సిటిజన్లందరూ ఒకచోట నిలబడ్డారు సీనియర్ సిటిజన్ సీటు కోసం. సీతారాముడు ఎప్పటిలానే హడావిడిగా వచ్చాడు. సెక్యూరిటీ స్టాఫ్ విజిల్ వేస్తున్నారు వెనక్కి జరగండంటూ…. శీతకాలం బద్ధకాన్ని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడులా ఉన్నాడు సూరీడు. పరధ్యానంగా ఉన్న ఆకాశంలో వెలుగు రేఖలు మసకేశాయి.
సీతారాముడు సీనియర్ సిటిజన్ సీట్లో సెటిలయ్యాడు. పక్కనే నిజమైన సీనియర్ సిటిజన్లు ఇద్దరు కూచోనున్నారు. రమారమి డెబ్బైఐదుంటాయేమో వాళ్ళిద్దరికీ అనుకున్నాడు. పక్కవాడితో మాట్లాడేవాళ్ళకన్నా ఫోన్లో మాటాడేవాళ్లే ఎక్కువ. అదీ తారాస్థాయిలో మాట్లాడుతున్నారు. కొంతమంది వీడియోలు చూస్తున్నారు, కొంతమంది యాత్ గేమ్స్ లో మునిగి తేలుతున్నారు.
సీతారాముడు పక్కనున్న ఇద్దరూ మాత్రం నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. కుతూహలంగా చూశాడు వారివంక అనుకోకుండా సీతారాముడి చెవిలో వారి మాటలు వినిపించసాగాయి.
“శంకర్ ఇద్దరం ఎనభై దగ్గరకు వస్తున్నాము. ముందు నువ్వో, నేనే వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి.”
“ఎవరు వెళితేనేం రాజా.. తరవాత మనం ఉండనప్పుడు… నువ్వు మెచ్చుకున్నా, తిట్టినా తెలుస్తుందా”
“మీ ఆవిడతో ఎప్పుడన్నా మాట్లాడావా? వెళ్లిపోతే ఎలా ఉంటావని “
“అంత ఛాన్స్ లేదు. తనెప్పుడూ బిజీయే “
“ఇప్పుడు కూడానా “
“మరి నీ సంగతేెటి”
“ఆ విషయం మాట్లాడే ధైర్యం నాకు లేదు.. నా శరీరాన్ని ఏదయినా మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేయాలనుంది. వీలవుతుందా?”
“మీ ఇంట్లో ఒప్పుకుంటారా “
“ఒప్పుకోరు.. అందుకే దానికేదయినా ప్రొసీజర్ వుందేమో కనుక్కుందామని”
“చూద్దాం లే, వెళ్దాం పద..”
తరువాతి స్టేషను అమీర్ పేట్ అంటూ కనిపించక వినిపించే మధుర స్వరం వాళ్ళని అలెర్ట్ చేసింది. రెండో అతను మొదటతని భుజంపై చేయేశాడు. బహుశా ఓదార్పుగానేమో!
వాళ్ల మాటలు సీతారాముడు మీద చాలా ప్రభావం చూపాయి.
*********
ఇది జరిగిన నాలుగైదురోజులకేమో మిత్రుడు కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళాడు. సీతారాముడు, కృష్ణమూర్తి కుడి ఎడమల మార్గాల్లో సాగుతున్నా అది వారి స్నేహానికి అడ్డురాలేదు.
ఎస్.. బాస్.. ఆల్ ఓకే.. నవ్వుతూ అడిగాడు కృష్ణమూర్తి
“నువ్వు నవ్వుతూ అడిగినా నేను సీరియస్ గానే చెప్పాల్సి ఉంది.” సీతారాముడు మాటలో నవ్వు లేదు.
“రాముడూ వాట్ హేపెన్డ్” కృష్ణమూర్తి గొంతు అనునయంగా పలికింది.
నీకో విషయం చెప్పాలంటూ మెట్రో రైల్ లో విన్న సంభాషణంతా చెప్పాడు.
“ఇంతకీ నువ్వెందుకు డిస్ట్రబ్ అయ్యావో చెప్పు”
“చనిపోయాక మనమేమవుతాం అని నాకెప్పుడు ఓ అనుమానం పీడిస్తుంది”
“సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తావు. నీకెందుకా అనుమానం”
“పునర్జన్మ, ఆత్మ ఇవన్నీ నాకర్థం కాని విషయాలు..”
“ఆచారాలను పాటిస్తావు, ప్రవచనాలు వింటావు, స్వామీజీ లను దర్శిస్తావు”
“అవన్నీ ఇంట్లో వాళ్ల కోసం.. మా నాన్నగారి మీద గౌరవంతో చేస్తాను “
మొదటిసారి కృష్ణమూర్తి కి సీతారాముడంటే జాలి కలిగింది. కుటుంబం కోసం ఎంత చేస్తున్నాడు అనుకున్నాడు.
“నేను చెప్పానంటే నా నమ్మకాలు వేరు.. నా ఆలోచన వేరు.. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది”
“మెట్రో లో వాళ్ల మాటలు విన్నాక నాకో ఆలోచనొచ్చింది. నేనయినా ఆ పనెందుకు చేయకూడదనిపించింది. ఏదోరకంగా సమాజానికుపయోగపడతాను కదా అని అనిపిస్తోంది”
కృష్ణమూర్తి నిర్ఘాంతపోయాడు. జీర్ణించుకోలేక పోయాడు కూడా…. ఏం చెప్పాలో అర్థం కాలేదు తనకి.
నువు ఎమోషనల్ గా ఆలోచిస్తున్నావనిపిస్తుంది. నువ్వనుకున్నట్టు చేయాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ల పర్మిషన్ కావాలి. మీలాంటి సంప్రదాయ కుటుంబంలో అలాంటివి కుదరదు. కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా ఇన్నాళ్లూ ఎలా గౌరవిస్తూ వచ్చావో అదే కంటిన్యూ చేయి”
సీతారాముడుకి ఆ సమాధానం నచ్చకపోయిండొచ్చు. సంప్రదాయాన్ని వీడటం అంత సులభం కాదు. కుటుంబం ఎంతటి కుషన్ ఇస్తుందో, అంతగా సమాజమనే చట్రంలో బిగుసుకుపోయింటుంది. అది సీతారాముడు లాంటి ఉద్వేగపరులకు అర్థం కాదనుకున్నాడు కృష్ణమూర్తి. ఈ విషయాన్ని సీతారాముడు గ్రహించి ఉండకపోవచ్చు అని కూడా అనుకున్నాడు
– సి. యస్. రాంబాబు