ఇంకెన్నాళ్ళు
మంచి సంబంధం తల్లి అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, నిన్ను బాగా చూసుకుంటారు. నీకేం కష్టాలు ఉండవు, మామగారు రిటైర్డ్ జడ్జ్, అత్తగారు ప్రొఫెసర్, ఆడపడుచు డాక్టర్, వాళ్ళ మామగారు అత్తగారు కూడా లాయర్స్ ఇక నీకు కాబోయే భర్త ఒక లాయర్, ఇంత మంచి సంబంధం నిన్ను వెతుకుతూ వచ్చిన సంబంధం ఒప్పుకో తల్లి అన్నారు నారాయణ రావు గారు.
అవునమ్మ వాళ్ళు చాలా స్తితిమంతులు దేనికి కొదవలేదు. పైగా అందరూ అన్ని తెలిసిన వాళ్ళు నీకు ఏ లోటు ఉండదు. కావాలి అంటే నువ్వు పెళ్లి అయ్యాక కూడా చదువుకోవచ్చు, ఏమంటావు అంటూ కూతురు జవాబు కోసం చూడసాగింది సుజాతమ్మ.
తల్లిదండ్రులు ఇంతగా చెప్తుంటే అన్ని బాగానే కనిపించసాగాయి అనూషకు. నిజమే, అందరూ చదువుకున్న వాళ్ళే అంతా బాగుంది. అతను కూడా అందంగా హీరోలా ఉన్నాడు. ఫోటో లో ఇలా ఉంటే నిజంగా ఇంకెంత బాగుంటాడు అని అనుకుంటూ ఏదో ఫంక్షన్ లో చూసి ఇష్టపడి వచ్చిన సంబంధం ఇది కాదనుకుంటే మళ్లీ మంచిది రాదేమో.
సరే పెళ్లి అయ్యాక చదువుకోవాలి అనుకుంటే చదువుకోవచ్చు అంటున్నారు కదా, అలాగే చదవాలి, ఒక నిర్ణయానికి వచ్చినట్టు గా సరే అమ్మా మీ ఇష్టం అన్నది అనూష. అనూష నిర్ణయాన్ని విన్న దంపతులు ఇద్దరూ అవునా తల్లి నిజమే కదా మళ్లీ ఏ మార్పు ఉండదు కదా అన్నారు సంతోషం గొంతులో ద్వనిస్తూ ఉండగా…
అవును అమ్మ నిజమే మీరు ఏది చేసినా నా మంచికే కదా చేస్తారు. అందుకే మీ ఇష్టం అమ్మా, నా మంచి కోరి చెప్తున్న మాటను నేను ఎలా కాదు అంటాను, కానీ ఒకటి నేను పెళ్లి అయ్యాక చదువుకోవాలి అదొక్కటి వాళ్లకు చెప్పండి ముందుగానే ఏమంటారు అంది.
అంతే కదా చెప్తానులే తల్లి, అయినా వాళ్ళు వద్దు అనరు అనే నమ్మకం ఉంది. నాకు అన్నారు సత్యనారాయణ గారు. అలా అయితే నాకు ఇష్టమే నాన్నగారు అంటూ లోపలికి వెళ్ళింది అనూష.
సత్యనారాయణ రావు గారు సుజాతమ్మల ఏకైక కూతురు అనూష. రావు గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. ఒక్క కూతుర్ని బాగానే చదివిస్తున్నారు. ఇప్పుడు అనూష డిగ్రీ చదువుతుంది. అనూష అందంగా ఉంటుంది చలాకీగా ఉంటుంది.
అందరితో కలిసిపోతుంది. ఆ చలకి తనమే తనకు ఇప్పుడు మంచి సంబంధం వెతుక్కుంటూ మరీ వచ్చింది. దాంతో రావు గారు చాలా సంబర పడ్డారు. తమ తర్వాత కుతురు జీవితం ఎలానో అని అనుకుంటూన్న వారికి ఇది మంచి అవకాశం లాగా రావడం తో వెంటనే పెళ్లికి ఒప్పుకున్నారు.
కూతురు అయినిoట్లో అన్నంలో పడబోతోంది అనే సంతోషం వాళ్లను నిలవకుండా చేస్తుంది.
***
అన్నయ్య గారు హాల్లో ఆ వినిపిస్తుంది అండి ఆ అమ్మాయి ఒప్పుకుంది మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందాం అన్నారు ఫోన్ లో రావు గారు. అవతలి నుండి ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది బావగారు, ఆ రోజే పెట్టుకుందాం అన్నారు మనోహర్ రావు గారు.
అయ్యో ఇంత త్వరగా అంటే ఎలా అండి మేము అందరికీ చెప్పుకోవాలి కదా అన్నారు సత్యనారాయణగారు. అయ్యో మేము మాత్రం చెప్పమా అండి ఫోన్ లు ఉన్నాయి కదా ఫోన్ లో అందరికి చెప్పండి.
మన అనుకున్నవాళ్ళు వస్తారు పెళ్లికి అందర్నీ పిలుస్తాం కదా ఇంకెందుకు ఆలోచన అన్నారు. దానికి రావు గారు అవును లేండి, ఈ మధ్య ఫోన్ లోనే అన్ని అవుతున్నాయి కదా సరే అంటూ ఫోన్ పెట్టేసి హడావుడిగా అందరికీ పనులు పురమాయించారు.
అనుకున్నట్టే ఒక పంక్షన్ హాల్లో అనూషకి, అరవింద్ కి బంధువుల సమక్షం లో నిశ్చితార్థం జరిగింది. అనూష అదృష్టానికి ఆమె స్నేహితులు అసూయ చెందారు. బంధువులు కూడా రావు గారికి దొరికిన ఆస్థి పరుడు అయిన అల్లున్ని చూసి కుళ్ళుకున్నారు. రావు గారు పొంగిపోయారు. సుజాతమ్మ అల్లుడి గొప్పదనం గురించి అందరికీ చెప్పుకుంది గర్వంగా…
నిశ్చితార్దంలో రావు గారు యాభై లక్షల కట్నం, ఉంగరాలు, అల్లుడికి మంచి కారు ఇచ్చారు. పెళ్లి లో మిగిలిన కట్నం ఇస్తాను అంటూ చెప్పారు. మరి అంత ఆస్తి పాస్తులు ఉన్న అల్లుడు అంటే కోటి కు తక్కువ కాకుండా పెట్టాలి కదా అని గుసగుసలు పోయారు బంధువులు.
ఎంగేజ్మెంట్ అయిన వారం లోనే పెళ్లి ముహూర్తం రావడంతో ఊపిరి సలపని పనుల్లో బిజీగా అయ్యారు. పెళ్లి కూడా అట్టహాసంగా ఆడంబరంగా జరిపించారు. వియ్యాల వారి నుండి మాట రాకుండా అన్ని విధాలుగా చూసుకున్నారు.
వెజ్, నాన్ వెజ్ తో రకరకాల వంటలతో హాలు ఘుమఘుమలు అడింది. వచ్చిన వాళ్ళు ఆ వంటల గురించి నెల రోజుల దాకా మర్చిపోలేక పోయారు. పెళ్లి అంటే అదని అలా ఎవరు చేయలేదని కొందరు అంటే ఆ డబ్బున్న వాడు ఏది చేసినా బాగానే ఉంటుంది అంటూ గిట్టని వారు మూతి విరిచారు.
ఏది ఏమైనా పెళ్లి మాత్రం జరిగిపోయింది. అనూష అత్తారింటికి వెళ్ళింది.
*********
అను, అను నువ్వు చదువుకుంటూ ఉంటే మరీ నన్ను ఎవరు చూసుకుంటారు అను? నాకు ఇంట్లో ఉండి నేను రాగానే చిరునవ్వుతో ఎదురు వచ్చే భార్య అంటే, నా అను అంటే చాలా ఇష్టం తెలుసా… నేను నీ నవ్వును చూడగానే చాలా రిలీఫ్ గా ఫీలవుతాను.
కానీ, నువ్వు చదువుకుంటే కాలేజీ నుండి అలసిపోయి వస్తావు నికు రెస్ట్ ఉండదు నాకు రెస్ట్ ఉండదు కదా… కాబట్టి ఇక నిర్ణయం నీదే అను అన్నాడు ప్రేమగా అరవింద్. అయ్యో దానికేం అండి మీ ఇష్టమే నా ఇష్టం మీరు కోరిన మొదటి కోరిక కదా అంది అనూష.
సర్లే థాంక్స్ అను అంటూ తన కౌగిలిలో బంధించాడు. అబ్బా అంటూనే ఒదిగి పోయింది అను గువ్వలాగ…
అబ్బా అను తొందరగా రెడీ అవ్వు. అక్కడ అక్క ఎదురుచూస్తూ ఉంటుంది. పద పద అన్నాడు. అబ్బా ఒక్క నిమిషం అండి వస్తున్నా అంటూ పాప ను భుజంపై వేసుకుని బయటకు వచ్చిన అను తో ఇదెందుకు? ఆయా దగ్గర ఉంచు పద ఇచ్చేయ్యి అన్నాడు.
అరవింద్ అదేంటండి? పాప పాల కోసం ఏడుస్తుంది అనగానే ఒక్క గంటనే లే చాలా తొందరగా వచ్చేదాం, కావాలంటే ఆయా బయట పాలు పడుతుంది అంటూ ఆయాకు పాపను ఇచ్చేసి ఆయా జాగ్రత్త అని చెప్పి అను చేయి పట్టుకుని లాక్కు వెళ్ళాడు అరవింద్.
అను బిత్తర పోయింది. పాప కడుపులో ఉన్నప్పుడు అరవింద్ ఎంతో మురిసిపోయాడు వారసుడు పుటబోతున్నడు అని సంతోష పడ్డాడు. కానీ పాప పుట్టే సరికి చిన్న బోయాడు. కానీ బయటకు మాత్రం సంతోషంగా నటించాడు. అయినా తన భర్త అలాంటి వాడు కాదు అనుకుంది అనూష.
మళ్లీ ఎప్పుడూ పాప గురించి కూడా చెడుగా మాట్లాడలేదు. వద్దు అని అనలేదు దాంతో అనూష అరవింద్ ని చాలా నమ్మింది. కడుపుతో ఉండగా చాలా ప్రేమగా చూసుకున్నాడు అరవింద్. ఇప్పుడు మళ్లీ రెండో నెల ఈసారి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు.
ఇప్పుడు తన ఆడపడుచు అరవింద్ అక్కగారు అయిన జ్యోతి డాక్టర్ కాబట్టి తన దగ్గరే చెక్ అప్ కి వెళ్తుంది. మొదటి సారి కూడా తనే డెలివరీ చేసింది. మంచి హస్తవాసి అనే పేరుంది ఆవిడకు. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళారు.
*****
ఏమ్మా మరదలు పిల్లా.. అప్పుడే మళ్లీ వచ్చావు ఎన్నో నెల? అడిగింది జ్యోతి నవ్వుతూ… నన్నేం చెయ్యమంటారు అంతా మీ తమ్ముడు నిర్వాకం అంది తను కూడా నవ్వుతూ… అక్కా మంచిగా చూడు, తను చాలా నీరసంగా ఉంటుంది.
ఏంటో ఏమో తిను అంటే తినదు అన్నాడు. అరవింద్ ఏం లేదు నువ్వు గాబరా పడకు నేను ఉన్నా కదా అంటూ లోపలికి తీసుకుని వెళ్లి చెక్ చేసింది.
అంతా బాగానే ఉంది మరి తమ్ముడు ఏంటి కంగారు పడుతున్నారు అనుకుంటూ బయటకు వచ్చి ఏంట్రా సంగతి అనట్టు బొమ్మలు ఎగరేసింది. చెప్తాను అన్నట్టుగా చూసి, అక్కడే అక్కకు మెసేజ్ చేసాడు అరవింద్.
అక్క నాకు మగ పిల్లాడు కావాలి, ఇప్పుడు స్కాన్ చేస్తే తెలుస్తుందా ఎవరు అనేది అనగానే లేదురా తెలియదు ఇంకొక నెల అగాలి అని రిప్లై ఇచ్చింది జ్యోతి. అక్కా నాకు, నాన్నకు అమ్మకు మగ పిల్లాడు కావాలని కోరికగా ఉంది.
మొదటి కాన్పులో పుడతాడు అనుకున్నా కానీ ఇది ఆడపిల్లని కన్నది. నాకు ఈ సారి మగ పిల్లాడి కావాలి ఏం చేయమంటావు అన్నాడు. ఇంకో నెల ఆగు తర్వాత ఆలోచిద్దాం అంటూ రిప్లై ఇచ్చింది జ్యోతి. ఇంతలో చీర సర్దుకుని వస్తూ ఏంటి ఇద్దరు ఫోన్ లో బిజీ అయ్యారు అంది అనూష.
లేదు లేమ్మా ఏదో ముఖ్యమైన విషయం అని అంటూ కవర్ చేసుకుంది జ్యోతి. సరే వదిన ఎలా ఉంది లోపల బేబీ అనగానే అంతా బాగానే ఉందమ్మా కానీ నువ్వు నీరసంగా ఉన్నావు బాగా తినాలి అంటూ మందులు రాసి ఇచ్చింది జ్యోతి. అవి తీసుకున్న తర్వాత వస్తాం వదినగారు అంటూ చెప్పి, బయటకు నడిచారు ఇద్దరూ.
పాపం తమ్ముడు వారసుడు కావాలి అంటున్నాడు ఎలాగైనా వాడికి వారసుడు వచ్చేలా చేయాలి అనుకుంది జ్యోతి తను ఒక ఆడపిల్ల అని మరిచి… చూస్తూ వుండగానే నెల రోజులు గడిచి పోయాయి. మళ్ళీ అక్క దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అరవింద్.
ఈసారి అక్క స్కాన్ చేసింది ఆడపిల్ల అని తెలిసింది కానీ ఈ విషయం చెప్పలేదు అనూషకు. కానీ, అరవింద్ కు మెసేజ్ చేసింది. దాంతో అరవింద్ మొఖం మాడ్చుకుని భర్తను చూస్తూ…. అదేంటి వదిన మీ తమ్ముడు అలా ఉన్నాడు అనగానే జ్యోతి అదేం లేదు అను ఒక చిన్న ప్రాబ్లం అంది విచారంగా…
అవునా ఎంటి వదిన అది ఏమయ్యింది? అంటూ గబారగ అడిగింది. ఏం లేదమ్మా లోపల బిడ్డ అవకరంగ ఉంది ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఇంకా కష్టం అవుతుంది. పుట్టిన పిల్లలు మంచిగా పుట్టాలి మీకు సమస్య రాకుండా ఉంటుంది ఏమంటారు అంది జ్యోతి.
మీరే చెప్పండి వదిన ఏం చేయమని అంటారు నాకు ఏం అర్దం కావడం లేదు అంది అనూష నీరసంగా… ఏముందమ్మా దాన్ని తీసేయడం మంచిది. కానీ, ఇక్కడ అబార్షన్ చేయడం చట్ట రిత్యనేరం కాబట్టి మీరు మరెక్కడికి అయినా వెళ్లి తియించుకోడం మంచిది అనగానే ఏంటండీ మీరు ఏం మాట్లాడరు అంది అనూష.
ఏం చేయమంటావు చెప్పు? నీకే ఆరోగ్యం బాగా లేదు వెళ్లి అబార్షన్ చేయించుదాం అన్నాడు అరవింద్. అయితే ఎక్కడ చేయించాలి వదిన, ఇక్కడ నేరం అని అన్నారు కదా, ఒక్క మాట చెప్పండి నిజంగా కడుపులో బిడ్డ కు సమస్య ఉందా? అది మనం బాగు చేయలేమా అంటూ ఆశగా అడిగింది అనూష.
లేదమ్మా నేను చెప్పింది నిజమే, కావాలి అంటే నా పై మీకు నమ్మకం లేకుంటే వేరే దగ్గరికి వెళ్లి చెక్ చేసుకోండి అంది నిష్టూరంగా. అయ్యో వదిన అలా కాదు మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ నా కడుపులో బిడ్డను చంపుకోవలి అంటే బాధగా ఉంది. అందుకే అడిగాను అంది అనూష కళ్ళలో నీరు కదులుతూ ఉండగా…
చూడమ్మా పుట్టాక ముందే బాధ పడుతున్నావు, పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూస్తూ ఇంకెంత బాధ పడతావు. అందుకే అమ్మ మేము నీ క్షేమం ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అంటూ దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడుస్తూ నేను కూడా ఆడ దాన్నే కాదమ్మా అంటూ సర్ది చెప్పింది జ్యోతి.
దాంతో వాళ్లను నమ్మిన అనూష, సరే వదిన మీ ఇష్టం. నాలుగు రోజులు బాధ పడతాను అంతే కదా అంటూ భాధతో తల దించుకుంది. జ్యోతి అరవింద్ థంబ్స్ చుపించుకున్నారు. బాధ పడకు అను పద వెళ్దాం అని అంటూ తీసుకుని వెళ్ళాడు అరవింద్.
*****
అక్కా రేపే ప్రయాణం మేము బ్యాంకాక్ వెళ్తున్నాం. చెప్పినట్టే చేశావు నీ మేలు మరిచిపోలేను అన్నాడు అక్కతో ఫోన్ లో అరవింద్. దానికేం కానీ అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. తనకు చెప్పాను చేయమని అలాగే హార్మోన్స్ పెరిగేలా ఇంజెక్షన్ కూడా ఇస్తారు. నీ పెళ్ళాం కు అనుమానం రాకుండా చూసుకునే బాధ్యత నీదే అంది జ్యోతి.
సరే అక్కా థాంక్యూ మరి ఉంటాను వెళ్ళాక ఫోన్ చేస్తా అన్నాడు అరవింద్. హా సరే రా అంటూ ఫోన్ కట్ చేసింది జ్యోతి. తెల్లారి ఇద్దరూ బ్యాంకాక్ కి వెళ్ళారు. అక్కడ అనూష కు అవాకరం ఉన్న బిడ్డను చంపుకోవడం ఇష్టం లేకపోయినా తను బాధగానే ఒప్పుకుని, గుండె రాయి చేసుకుని బెడ్ మీద పడుకుంది.
గంట తర్వాత నీరసంగా కడుపు ఖాళీగా అయ్యింది. గుండెల్లోంచి దుఖం పొంగి పోరులింది. మనసు బాధ తో నిండింది. అరవింద్ మాత్రం ఏం పట్టనట్టుగా ఉన్నాడు. కొంచం కూడా అతనికి బాధ లేదు. అవును ఎందుకు ఉంటుంది కోరిక పుట్టినప్పుడు మాత్రమే తన శరీరం గుర్తుకు వస్తుంది.
అదయ్యక ఇంకేం గుర్తు ఉండవు అతను కడుపులో మోసే వాడా, ప్రేమంటే తెలుసా, రక్త మాంసాలు ఇచ్చే వాడా, బాధను అనుభవించే వాడా?
శరీరం చాలా నీరసంగా అయ్యింది. నొప్పి తట్టుకోలేక పోతుంది. లోపలున్న పిండాన్ని మొత్తం తీసేశారు చిన్న ప్రాణి ని కత్తులతో, కట్టేరాలతో ఒక్కొక్క అవయవాన్ని కట్ చేస్తూ ముందు కాళ్ళు తర్వాత చేతులు కట్ చేశారు.
చాలా నొప్పిగానూ, బాధ గానూ ఉంది. ఈ బాధ తనకు తెలుసు అతనికి ఏం తెలుసు, అందుకే ఏమీ బాధ లేకుండా కూర్చున్నాడు. అబార్షన్ అయ్యాక రెండో రోజు హోటల్ కి వచ్చారు. అదే రాత్రి అరవింద్ అనూష తో సెక్స్ కోసం ప్రయతించబోయాడు.
కానీ అనూష నొప్పిగా ఉందని అన్నా కూడా లేదు మళ్లీ మనం పిల్లల కోసం ప్రయత్నించాలి అంటూ బలవంతంగా తనతో కలిశాడు. ఇదొక నొప్పి అనుకుంటే దానికి తోడు ఇంకొక నొప్పి శరీరం బండ బారింది. ఎందుకు నన్ను అర్దం చేసుకోడు?
పిల్లలు అంటే అంతా ఇష్టం అయితే కొన్నాళ్ళు అగవచ్చు కదా, తానేమైన కాదు అంటుందా? కొంచం అయినా రెస్ట్ ఇవ్వకుండా అలా చేయడం వల్ల తెల్లారి పొద్దున్నే బ్లీడింగ్ మొదలు అయ్యింది. అది చూసి కంగారు పడి మళ్లీ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ డాక్టర్ చూసి కొప్పడడం తో ఇక ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు అరవింద్.
తిరిగి ఇండియాకి వచ్చారు వచ్చిన మూడో రోజు నుండి మళ్లీ మొదలు పెట్టాడు. ఒక్క సారి అంటూ కలుస్తూనే ఉన్నాడు ఫలితంగా అరోనెలలో మళ్లీ ప్రగ్నెంట్ అయ్యింది విషయం తెలిసిన జ్యోతి ఇంటికి వచ్చి ఏవో బలానికి అంటూ ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది.
ఎందుకు అంటే నువ్వు బలంగా లేవు కాబట్టి ఇస్తున్నాం అంటూ అరవింద్ నోరు నొక్కాడు. కనీసం అమ్మ దగ్గరికి వెళ్లి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా పంపలేదు.
*****
అక్కా, బాబు ఎలా ఉన్నాడు. బాబే కదా అన్నాడు అరవింద్. లేదు రా మళ్లీ పాపనే అంది జ్యోతి స్కాన్ రిపోర్ట్ పక్కకు పెడుతూ… అవునా ఇప్పుడు ఎలా అక్కా ఈ దరిద్రపుది ఆడపిల్లల్ని కంటుంది. ఇది మూడోది మళ్లీ అబార్షన్ కి వెళ్ళాలి అంటే దానికి అనుమానం రావొచ్చు ఎలా అన్నాడు అరవింద్.
దానికి ఒక ఉపాయం ఉందిరా ఒక ఇంజెక్షన్ చేస్తాను, దాంతో కడుపు పోతుంది. ఇంకా వయసు ఉందిగా ఇద్దరికీ మళ్లీ ప్రయత్నం చేయండి నువ్వు అన్నట్టుగానే అది దరిద్రమే మరి దాన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటావా అంది జ్యోతి.
పెళ్లి చేసుకోవచ్చు కానీ, దీనికి భరణం ఇవ్వాలి కదా అదే కాస్త కష్టం చూద్దాం ఇంకొక సారి అన్నాడు అరవింద్. ఏమోరా నీ ఇష్టం కానీ తనకు అనుమానం రాకుండా చూసుకో అంది జ్యోతి ఇంజెక్షన్ రెడీ చేస్తూ… సరే అక్క నువ్వు ఇంజెక్షన్ చెయ్యి అంటూ బయటకు నడిచాడు అరవింద్.
*******
చూడమ్మా అనూష, నువ్వు కన్నది ఆడపిల్ల దాన్ని చదివించాలి దానికి అన్ని విధాల పెట్టాలి అంటే మా ఆస్తులు అమ్ముకోవలి కాబట్టి నువ్వొక పని చెయ్యి… మీ నాన్నను అడిగి, ఒక కోటి రూపాయలు పాప పేరు పైన డిపాజిట్ చేయమని చెప్పు.
లేదా, కోటి కి తక్కువ కాకుండా షేర్స్ లాంటివి ఇచ్చినా, కాంప్లెక్స్ కట్టించినా పర్లేదు, ఇప్పటి నుండి నీకు ఆడపిల్ల పుట్టిన ప్రతి సారి వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని చెప్పు ఏమంటావు ఇది బాగానే ఉంది కదా అన్నారు మనోహర్ రావు గారు.
అదేంటి మామయ్యా అలా అంటారు నాకు ఆడపిల్ల పుడితే వాళ్లేం చేస్తారు వాళ్ళు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంది అనూష. ఏంటమ్మా మామ గారు అనే గౌరవం లేకుండా ఎంటా మాటలు? సిగ్గు లేదా మాట్లాడడానికి అంది అత్తగారు.
అవును అనూష ఏంటి ఆ మాటలు నాన్న గారు ఏది చెప్పినా మన కోసమే కదా అయినా మీ వాళ్లకు నువ్వు తప్ప ఇంకెవరూ ఉన్నారు పెట్టడానికి ఏం మాయ రోగం అన్నాడు అరవింద్.
అదే అండి ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను అండి సిగ్గులేకండా ఉండడానికి వాళ్ళు ఎందుకు ఇస్తారు? మనకు పుట్టేవారికి వాళ్ళు ఎందుకు ఇస్తారు? అయినా, నాన్నకు ఈ మధ్య బిజినెస్ లో లాస్ అయ్యింది.
ఒక్కగానొక్క కూతురు ను నేను వాళ్లను ఆదుకోవాలి కానీ, అడగడం ఏంటి మీ అబ్బాయికి పుట్టేవారు మీ వారసులు అవుతారు మీరే ఖర్చు పెట్టాలి కదా అంది అనూష.
ఒరేయి అరవింద్ నీ పెళ్ళాం నీతులు చెప్తుంది రా… నువ్వు చూసుకుంటావా, నేను చూసుకోనా అన్నాడు మనోహర్. మీరెందుకు లే నాన్న, నేను ఉన్నా కదా అంటూ అను లోపలికి నడు అన్నాడు అరవింద్.
ఎందుకు వెళ్ళాలి అండి? మీరు అడగమన్నట్టు నేను నాన్న నీ అడగను, మీ నాన్నగారు తప్పుగా మాట్లాడుతున్నారు. పిల్లలను ఇద్దరం కలిసే కంటాం కదా… నా తప్పేం ఉంది అంది గట్టిగా అనూష.
ఏయ్ నొర్ముయ్, నన్ను నాన్న నే తిడతావా? నీకెంత ధైర్యం? అంటూ బెల్ట్ తీసి చావబాదారు అనూష ని. తన్ను రా దాన్ని వెధవ ముండ, ఆడపిల్లని కన్నది కాక సోది చెప్తుంది అంది తల్లి. రెచ్చిపోయి మరి కొట్టాడు అరవింద్.
వద్దండీ, కొట్టకండి అంటూ ఏడ్చింది అనూష. అయినా చావగొట్టి గదిలో వేశాడు. తను కోర్టుకు వెళ్లకుండా వారం రోజులు అనూషను అనుభవిస్తూ, కొడుతూనే ఉన్నాడు. రోజులు గడిచే కొద్ది అనూష జీవితం మరీ దుర్భరంగా తయారయ్యింది.
మగ పిల్లాడు పుట్టాలి అంటూ అత్తగారు పూజలు చేయించడం, ఉపవాసాల పేరిట తిండి పెట్టకుండా మాడుస్తూ, హార్మోన్స్ ఇంజెక్షన్ యిస్తూ కడుపు వచ్చినప్పుడల్లా స్కాన్ చేసి చూస్తూ ఆడపిల్ల అనగానే అబార్షన్ చేయిస్తూ పన్నెండేళ్ళు అనూష ను ఒక యంత్రంలా చూసారు. టార్చర్ పెట్టారు.
తల్లిదండ్రులు వచ్చినా, అనూష వెళ్లాలి అనుకున్నా కూడా పంపలేదు. అనూషతో నేను బాగున్నాను అని చెప్పించారు. తనకి ఆరోగ్యం క్షీణించింది. ఎనిమిది అబార్షన్ లతో చాలా నీరసంగా తయారయ్యింది. ఆ పరిస్థితిలో ఇంట్లో పని కూడా చేయించడం మొదలు పెట్టారు.
అవన్నీ చేస్తూ అరవింద్ కోరికకు బలి అవుతూ, తన ఆరోగ్యం బాగా లేకపోయినా అతని కోరిక తీరుస్తూ, అతనికి మొగ పిల్లాడిని కని ఇవ్వాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పుడూ తనకు కడుపు వచ్చిన ఆడపిల్ల అని తెలిసేది.
నిజానికి ఆమె కు తెలియకుండా హార్మోన్స్ ఇంజెక్షన్ లు ఇచ్చారు. కొన్నాళ్ళ తరువాత ఆమెకు అనుమానం వచ్చి నిజం తెలుసుకుంది.
ఇంత చదువుకున్న వీళ్ళు కూడా బిడ్డను కనడంలో మగాడి పాత్రే కీలకం అని ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఆ ఆలోచనే వాళ్లకు రాలేదు. తప్పంతా అనూషదే అన్నట్టుగా మాట్లాడడం తననే శత్రువులా చూడడం.
తన శరీరం మీద ప్రయోగాలు చేయడం, హార్మోన్స్ ఇంజెక్షన్ లు అంటూ పొడవడం శరీరం అంతా స్పర్శ లేకుండా తయారు అయ్యింది. ఈ పన్నెండు ఏళ్లలో దాదాపు పదహారు వేల ఇంజక్షన్ లు ఇచ్చి ఉంటారు.
కానీ, తనకు మగ బిడ్డ పుట్ట లేదు. మంచి సంబంధం అంటూ అందరూ చదువుకున్న వాళ్లు అంటూ తన తల్లిదండ్రులు ఇచ్చి చేశారు. కనీసం చదువుకున్నా కూడా బయటకు వెళ్లి బతికేది. కానీ, తీయని మాటలతో తనను చదవకుండా చేశాడు. ఇప్పుడు తన మాట తో, తన మనస్సుతో నిమిత్తం లేకుండా ఆటలు ఆడుకుంటున్నారు.
ఇంకెన్నాళ్ళు ఇలా బాధలు పడాలి? లేదు ఇక నేను ఈ బాధలు పడలేను, ఎలాగైనా ఇక్కడి నుండి బయట పడాలి అనుకుంది అనూష.
చాలా రోజుల తర్వాత అనుకున్నట్టుగానే ఇంట్లో వంట చేస్తున్న సమయం లో ఎవరు లేనిది చూసి పని మనిషి సాయం తో బయట పడింది. ఈ విషయం లో చాలా రోజులుగా అనూష పడుతున్న బాధలు చూసిన పని మనిషి తనకు సాయం చేసింది.
అనూష తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పింది. వాళ్లకు సిగ్గు పడకుండా అన్ని విషయాలు చెప్పి, ఇంజక్షన్ లు చేసిన చోటు చూపించింది. అవన్నీ చూసి తండ్రి బాధ పడితే తల్లి కన్నీరు పెట్టుకుంది. ఏం చేయాలి అని ఆలోచించారు .
అనూష కేసు పెడతాను అంది. కానీ తల్లి వద్దు విడాకులు తీసుకో అంటే తండ్రి మాత్రం ఇలాగ ఇంకొక ఆడపిల్ల బలి కావద్దు అంటూ కూతురిని తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్లాడు.
సాక్ష్యాలు అన్ని అరవింద్ కు వ్యతిరేకంగా ఉండడంతో పోలీసులు అతన్ని, అతన్ని పేరెంట్స్ ని అరెస్ట్ చేశారు. అనూష తన పాప తో తల్లిదండ్రుల దగ్గరికి చేరింది.
అత్త ప్రొఫెసర్, మామగారు జడ్జ్, ఆడపడుచు డాక్టర్, భర్త లాయర్ అయినా మూర్ఖంగా ప్రవర్తిస్తూ మగ పిల్లాడు కావాలి అంటూ తామూ అడవాళ్ళమే అని మరిచిపోయి ఇంకొక ఆడపిల్ల తో అమానుషంగా ప్రవర్తించి, ఆడదానికి ఆడదే శత్రువు అనే మాటను సార్థకం చేశారు.
చదువుకు, ప్రవర్తనకు సంబంధం లేదని నిరూపించారు. మగ సంస్కార హినులు ఇంకా ఎక్కువగా తిట్టాలనుకున్నా కానీ సంస్కారం అడ్డుగా వస్తుంది…
ఇది నిజంగా జరిగిన కథ. మన మధ్యలో జరిగిన కథ ఇలాంటి చదువుకున్న వాళ్లను ఏమని అనాలో అర్దం కావడం లేదు.
బిడ్డ పుట్టడానికి ఇద్దరు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్క అడపిల్లదే తప్పు అని వేలెత్తి చూపే ముందు వాడు కూడా టెస్ట్ చేయించుకోవాలి కదా, ఇలాంటి చెత్త వెధవలు మన చుట్టూరా ఉన్నారు.
మంచి కుటుంబం, ఆస్తి బాగా ఉందని కాకుండా కాస్త సభ్యత, సంస్కారం ఉన్న వారికి మీ ఆడపిల్లను ఇవ్వండి. ఆమెకు ఏదైనా సమస్య ఉందేమో కనుక్కుంటూ ఉండండి. అనూష తల్లిదండ్రులు ముందే కళ్ళు తెరిచి ఉంటే ఇన్నాళ్లు తను బాధ పడేది కాదు కదా…
ఇదొక్కటే కాదు ఇలా చాలా జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఆడవాళ్ళు కాస్త ధైర్యం తెచ్చుకుని మీకు సమస్య ఉంటే నలుగురికి చెప్పండి, ఇంకెన్నాళ్ళు భరిస్తారు?
బయటకు రండి, వచ్చి పోరాడండి కానీ పిరికిగా అందులోనే మగ్గిపోకండి… అందుకే ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళగానే చేతులు దులుపుకోకుండా కాస్త కన్నేసి ఉంచండి. తను సాయం కోరి వస్తె కాదనకుండా ఆదుకోండి… ఆడపిల్ల ను గుండెల్లో దాచుకొండి.. దారి చూపండి..
– భవ్య చారు