హృదయ దేవత
మబ్బులు కమ్మిన కారుచీకటి లాంటి నా జీవితం
ఆశ నిరాశలతో గమ్యం తెలియని బాటసారిలా
సాగుతున్న నా జీవన యాత్రలో….
కారు చీకట్లను చీల్చుతూ
జగతికి ఉషస్సులు పంచిన రవి కిరణంలా
నా జీవితంలోకి వేగుచుక్కలా
ప్రవేశించిన ఓ దృవతార….
నా వెన్నుతట్టి నేనున్నానంటూ
బతుకుపోరులో బాసటగా నిలిచి
సంసార నౌక సాఫీగా సాగించిన వేళా….
సరిగమల సయ్యాటలే కాదు
అప్పుడప్పుడు కారాలు మిరియాలు నూరిన
ఉరుములు మెరుపులు మెరిసిన
నిప్పులపై ఉప్పుల చిటపటల సవ్వడి సాగిన
కస్సుబుస్సుల కలహలేన్నైనా
పాలమీది పొంగులాంటి సన్నివేశాలే….
కష్టాలైనా నష్టాలైనా కలసి సాగడమే ధ్యేయంగా
మా జీవిత నౌకకు చుక్కానిలా మార్గనిర్దేశం చేస్తూ
నన్ను విజయ తీరాలవైపు నడిపించిన వేళా
జీవితం రంగుల హరివిల్లుల విరబూసిన వేళా
ఏలా దాచుకోను నా అనుభూతిని
ఏలా చెప్పను నా హృదయ స్పందనను…
ఈ ఆనందపు అనుభూతిని
నా హృదయంలో గుప్తంగా నిక్షిప్తమై
నా జీవిత చరమాంకం వరకు
పదిలంగా దాచుకోనా….
నన్ను భరిస్తు నా ఆనందానికి మూలమై
నాకు తోడునీడగా కష్టసుఖాల్లో మనసునమనసై
నాలో సగమై నన్ను తీర్చిదిద్దిన నా అర్ధాంగి కి
నా హృదయ దేవతకు
కృతజ్ఞతలు చెప్పడం మినహా….
మరు జన్మంటు ఉంటే నా హృదయ దేవతనే
సహ ధర్మచారినిగా కోరుకుంటూ….
ఈ జీవితం అంతా ఇలాగే
హయిగ తీయగా సాగిపోవాలని.
– అంకుష్