హోలీ

హోలీ

ప్రతీ సంవత్సరం యావద్భారత దేశంలో “ఫాల్గుణ మాసం పూర్ణిమ” తిథినాడు అత్యంత ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు.

ఈ పండుగ వసంతఋతువు ఆగమనాన్ని తెలుయజేస్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు “హొలిక” అనే రాక్షసిని చంపిన దినంగా ఈ “హోలీ” పండుగ చేసుకుంటారట.

దీనినే ఇంకా కాముని పున్నమిగా, డోలికోత్సవముగా, ఫాల్గుణోత్సవముగా, వివిధ నామాలతో వ్యవహరిస్తూ ఉంటారు. “హోలీ” అంటే ముందుగా అందరికి రంగులే గుర్తుకు వస్తాయి. 

ఈ హోలీ పండుగ గూర్చి విభిన్నమైన గాథలు కనిపిస్తున్నాయి. “శ్రీ బలరామ కృష్ణుని” ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రవచనం. అందువల్ల బెంగాలు రాష్ట్రమందు ఈ రోజు శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలోవేసి ఊపుచూ “డోలికోత్సవాన్ని” జరుపుకుంటారు.

‘దక్షయజ్ఞ’ సమయమందు అగ్నికి ఆత్మాహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు వారు పార్వతి అను నామధేయముచేస్తారు.

ఇలా ఉండగా! సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపో దీక్షలో నిమగ్నమై ఉంటాడు. అట్టి స్వామికి పరమేశ్వరునిపై భక్తి భావముతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది.

దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము చేయదలచి అందులకు మన్మధుని ఆశ్రయిస్తారు. మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధిగా యెంచి అంగీకరిస్తాడు.

‘పార్వతీదేవీ’ పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయముగా యెంచుకుని పరమేశ్వరునిపై పూలబాణం వేస్తాడు మన్మధుడు.

ఆ విధంగా ఆత్మధ్యానంలో ఉన్న పరమశివుని మనసును కామవికారాలకు గురిచేసి “పార్వతీ పరమేశ్వరుల” కళ్యాణానికి కారణ భూతుడవుతాడు మన్మధుడు.

అలా కృతకృత్యుడైన మన్మధుని దేవతలు అందరు అభినందిస్తారు. కానీ పరమశివుడు ఆత్మ ధ్యానంలో ఉన్న తాను కామవికారాలకు ఎలా లోను అయ్యానా అని దివ్యదృష్టితో చూచి ‘కాముకుడైన’ మన్మధుని మూడవ నేత్రము తెరిచి భస్మంచేస్తాడు.

అనంతరం రతీదేవీ పార్వతీ పరమేశ్వరులను “పతిభిక్ష” పెట్టమని వివిధ రీతుల వేడుకుంటుంది. సర్వ మంగళ స్వరూపిణి అయిన పార్వతి ఈశ్వరుని మెప్పించి ‘రతీదేవి’కి మన్మధుడు అశరీరరూపంతో సజీవుడై ఉండునట్లు మాంగల్యభాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ కావున దీనిని “కాముని పున్నమిగా” జరుపుకుంటూ ఉంటారు.

మరియు పూర్వం “హొలిక” అను రాక్షసి రఘుమహారాజు చంపినట్లు ఉన్న గాథతో పాటుగా మరియొకటి ప్రాచుర్యము పొందినది.

“హొలిక” అను రాక్షసి రోజుకు ఒక చంటిబిడ్డను తింటూ ఒక గ్రామవాసులందరికి గర్భశోకాన్ని కలిగించేదట. ఇలా ఉండగా ఒక రోజు ఒక ముదుసలి మనవడి వంతు వచ్చిందట!

అది గమనించిన ఆ వృద్ధురాలు “హొలిక” అను రాక్షసి బారి నుండి తన మనవడితోపాటు గ్రామస్తుల గర్భశోక బాధను నివారించుటకొరకై ఆ గ్రామ సమీపమందు తపోదీక్షలో ఉన్న ఒక మహిమాన్వితుడైన మహర్షిని శరణువేడుకొంటుంది.

అందుకా ఋషి తల్లీ! నీవు అందులకు చింతించవలదు. ఆ రాక్షసి ఒక శాపగ్రస్తురాలు, ఎవరైనా ఆ రాక్షసిని నోటికిరాని దుర్భాషలతో తిట్టిన యెడల దానికి వెంటనే ఆయుక్షీణమై మరణిస్తుందని, రేపు గ్రామస్తులను అందరిని పోగుచేసి ఆవిధముగా చేయమని తరుణోపాయం చెప్పినాడు.

దానితో ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో గ్రామంలోనికి వెళ్ళి ఋషి తరుణోపాయం గ్రామస్తులందరికీ చెప్పి, ఆ రాక్షసి మరుసటి రోజు గ్రామమునకు వచ్చు సమయానికి గ్రామస్తులందరిచేత అనరాని దుర్భాషలతో తిట్టిస్తుంది.

ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత “హొలి” రాక్షసి కుప్పకూలిపోయి మరణిస్తుంది. దానితో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగుచేసి ఆ చితిమంటలో “హొలిరాక్షసిని” కాల్చివేసి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు.

నాటి నుండి హొలి పండుగ వస్తోంది అంటే పిల్లలు పిడకలు, దుంగలు ప్రోగుచేసి మంటలు వేసే ఆచారం ఏర్పడింది అని చెప్తారు. చైత్ర పాడ్యమినాడు పితృదేవతలను సంతృప్తిపరచి, హొలికా భూమికి నమస్కరిస్తే సర్వదుఃఖాలు తొలగుతాయని విశ్వసిస్తారు.

చిన్న, పెద్ద, ఆడ, మగ, తారతమ్యం లేకుండా రంగులు పులుముకుంటూ వసంతాలు చల్లుకుంటూ ఆనంద డోలికలో తేలియాడుతుంటారు. అట్టి ఈ హొలి పండుగను జరుపుకుని మనమంతా మానసిక ఆనందంతో, ఆయురారోగ్యాలతో వెలుగొందుదాం.

– దేవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *