హితకారులు
సాయం సంధ్యవేళ కావస్తుంటే ఇంటి పెరట్లో కూర్చుని ముసిముసిగా నవ్వుకుంటున్నాడు సెలవులకోసమని బామ్మగారు ఊరు వచ్చిన ఎనిమిదవ తరగతి చదివే ఉమేష్. అరే ఉమా ఏం చేస్తున్నావురా అంటూ వచ్చింది బామ్మ. ఏం లేదు బామ్మా సాయం సంధ్యలో ఆ పక్షుల కువకువలు వింటుంటే మనసుకేదో తెలియని ఆనందం కదా బామ్మా అంటాడు.
అవునురా అబ్బీ! మన సంస్కృతీ సంప్రదాయాలలో పశుపక్ష్యాదులు కూడా భాగమే.. ఆ సంగతి తెలిపేందుకు మన ఇతిహాసాలలో కథలు కోకొల్లలుగా ఉన్నాయి. రామాయణంలో సీతమ్మవారిని కాపాడే ప్రయత్నం చేసిన దశరధుని స్నేహితుడైన జటాయువు. ఆ శ్రీహరికి వాహనంగా నిలిచిన గరుడుడు.
రామ రామ అంటూ సీతమ్మచే మాటలు నేర్చిన వాల్మీకి కుటీరంలోని చిలుకలు.. ఇలా అనేక ఉదంతాలున్నాయి అంటూ వివరిస్తుంది. మనలో భాగంగా ఉభయ సంధ్యల్లోనూ వాటి కువకువలతో చక్కగా పలకరిస్తాయి కదా బామ్మా అంటాడు ఉమేష్.
అవును రా ఉమా… పచ్చని ప్రకృతితో అలరారే మన ఊర్లలో చెట్లన్నీ వాటికి ఆవాసాలే… రైతు ఇంట పశువులెలానో… పక్షులు అంతే స్థాంనం పొందాయి. ప్రతి ఇంటికీ వరి దుబ్బు వేళ్ళాడుతూ… ఆరు బయట నీటి తొట్టెలతో అలరారేవి ఆనాటి ఇళ్ళు. అంతేకాదు ఈ పక్షులు పశువులకి ఎంతగా సహకరిస్తాయో తెలుసా…
పశువులకి పక్షులు సాయం చేస్తాయా… అదేమిటి బామ్మా!??
అవునురా అబ్బాయ్ పశువులు విశ్రాంతి తీసుకుంటూ నెమరువేస్తున్నపుడు వాటి చెవులు, శరీరం పై ఉన్న క్రిమి కోటకాలను శుభ్రపరుస్తాయి. అంతే కాకుండా పళ్ళు లోపల ఇరుకున్న ఆహారం శుభ్రం చేస్తుంటాయి. అలానే పంటలకి పట్టిన చీడ పీడలనుండి చాలా శాతం అవే పంటని రక్షిస్తాయి.
ఇలా మనుషులకీ పశుపక్ష్యాదులకి అవినాభావ సంబంధం ఉందిరా అబ్బీ.. అవునా బామ్మా..! ఇక్కడ ఇన్ని పక్షుల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ బామ్మా మాకు మా సిటీలో ఎందుకని ఇన్ని పక్షులు కనబడవు? అదంతా కృత్రిమ ప్రకృతిరా అబ్బాయ్. కాంక్రీటు అరణ్యంలో మీరో మరమనుషుల్లా బ్రతుకీడుస్తుంటే.. ఇక వాటికి స్థానమెక్కడ మిగిలిందని కనిపిస్తాయి.
అభివృద్ధంటూ. కాలంతో పరుగులంటూ ముందుకు సాగుతున్నాం అనుకుంటూ వెనక్కి తిరిగి చూడట్లేదు. ఫలితంగా కాలుష్యపు కోరల్లో చిక్కి ఎంత నష్టం జరుగుతుందో… ఎన్ని ప్రాణులు తమ ఉనికిని కోల్పోతున్నాయో చెప్పడానికి వాటికి మనలా మాటలు రావుగా… వచ్చుంటే మనుషుల్లో మార్పు వచ్చునేమో అనిపిస్తుంటుంది.
నిజమే బామ్మా నువ్వంటుంటే నాకూ నిజమే అనిపిస్తుంది. మాకు క్లాస్ లో చెప్తారు మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి. భావి తరాలకి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుని ఇవ్వండని. కానీ అలా ఎందుకు అన్నారో నాకు ఇపుడు అర్ధమైంది. ఇకమీదట నేను మొక్కలు పెంచుతాను నా మిత్రులతోనూ చెప్తాను బామ్మా… అంటూ ఓ నిశ్చయమైన నిర్ణయం తీసుకున్నాడు ఉమేష్.
– ఉమామహేశ్వరి యాళ్ళ