దోశలు రెడీ
ఉదయమే టిఫిన్ చేద్దామని తన ఇంటి పక్కనే ఉన్న హోటల్ దగ్గరకు వెళ్ళాడు
ప్రసాద్. అక్కడ మసాలా దోశ
కావాలని హాటల్ ఓనరుతో చెప్పాడు. పెద్ద గిన్నెలో ఉన్న
పిండిని చేత్తోనే చిన్న గిన్నెలోకి
తీసాడు అతను. వామ్మో ఆ
చేయి మాత్రం కుళ్ళిపోయిన
వంకాయలా ఉంది. అలా
పిండిని తీసి పక్కన పెట్టి
చీపురుని అట్ల పెనంపై పెట్టి
ఇల్లు ఊడ్చినట్లు ఊడ్చాడు.
బహుశా అదే చీపురుతో ఇల్లు
ఊడ్చిఉంటాడు. అలా చీపురుతో రుద్దిన పెనంపై దోశ వేసాడు. ఆ తర్వాత గిన్నెలో
ఉన్న మసాలా ఆ దోశపై పరిచాడు. అలా పరిచేముందు ఆ మసాలా వాసన చూసాడు. బహుశా అది మొన్నటిదేమో.
ఆ తర్వాత దోశ చుట్టూ అయిల్ వేసాడు. ఆ ఆయిల్ మన బండిలో వేసే ఆయిల్ అంత నల్లగా ఉంది. అలా
మొత్తానికి దోశ వేసి ఒక
ప్లేటులో పెట్టి ఇచ్చాడు. ఆ
ప్లేటుకు పన్నెండు సొట్టలు ఉన్నాయి. అంటే దాని అర్ధం
చాలా గట్టిదన్న మాట. చట్నీ
మాత్రం చట్నీలో నీరు కలిపినట్లు కాకుండా నీటిలో
చట్నీ కలిపినంత పలచగా
ఉంది. మొత్తానికి ఇలాంటి
టిఫిన్ తినే బాచిలర్లు ఎంతో
మంది ఉన్నారు. అంతేకాదు
ఇంట్లో అన్నీ వండిపెట్టే పెళ్ళాం
ఉన్నాకూడా ఇలా బయట తినే
పెళ్ళైన ప్రసాదులూ ఉంటారు.
-వెంకట భానుప్రసాద్ చలసాని.