ధీర వనితలు
స్వాతంత్ర్య భారత దేశంలో మహిళలకు ఇచ్చే విలువ తక్కువే అయినా, కొందరు మహిళలు వాటిని అధిగమించి బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా మొల్ల నుండి నేటి తమిళ సై గారి వరకు పోరాడుతూ వచ్చిన వారే…. అయితే వారు ఈనాడు ఈ స్థానంలో ఉండడానికి చేసిన త్యాగాలు, ఎదుటివారు దాడి చేసినా తట్టుకుని నిలబడి మరీ తాము అనుకున్నది చేస్తూ, యువతులకు యువతకు ఆదర్శంగా నిలిచారు, నిలుస్తున్నారు.
ఒక్క వీరే కాదు మన ఇళ్ళలో ఉన్న అమ్మమ్మ, నాయనమ్మ నుండి అందరూ తమ హక్కుల కోసం పోరాడుతున్నవారే, ఇప్పటికీ కూడా ఇంట్లో మహిళల నిర్ణయాలు తీసుకోవడం లేదు అనేది బహిరంగ రహస్యం. కేవలం కాగితాలతో రాస్తున్నారు తప్ప నిజంగా ఏ ఇంట్లో ఏ మహిళకు గౌరవం లేదన్నది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.
అసలు విషయానికి వస్తే భారత దేశంలో మహిళలకు ఇచ్చే విలువ, గౌరవం, స్వేచ్చ విషయంలో ఎప్పటి నుండో విచక్షణ ఉన్నా కూడా కొందరు పెద్దలు గురజాడ, బాలగంగాధర్ తిలక్, ఇలాంటి వారికన్నా ముందే రాజుల కాలంలో మొల్ల వంటి వారికి కొంత స్వేచ్ఛని ఇచ్చారు. దాని వల్లే రామాయణం తనదైన శైలిలో రాయగలిగారు. అలాగే నాట్య కళలో కూడా ఆరితేరిన వారు, రాజ్యాన్ని కాపాడడం కోసం రుద్రమదేవి లాంటి వారికి స్వేచ్చ లభించింది.
కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నవ నాగరిక సమాజంలో, అంతరిక్షం లోకి వెళ్తున్న ఈ దశలో, మహిళా విచక్షణ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మన కళ్ళ ముందే అదే తమిళసై గారికి జరుగుతున్న విషయం. వారు ఎన్నో రకాలుగా శ్రమని ఓర్చుకుని ఈ స్థితికి వచ్చి ఉంటారో, ఎలాంటి వారి వల్ల సమస్యలు ఎదుర్కొని ఉన్నా ఇలాంటి విషయం వారికి ఎక్కడా ఎదురై ఉండకపోవచ్చు.
వారి పని వారు చేస్తూ, రాజ్యాగబద్ధంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అయినా కూడా ప్రభుత్వం వారి పై వివక్ష చూపుతూ, వారికి తగు రీతిలో గౌరవం అనేది ఇవ్వకుండా చేస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ పాటించకుండా, వారి పిలుపుకు స్పందించకుండా, వారిని ఇతర కార్యక్రమాలకు పిలవకుండా , తక్కువ చేస్తూ, ఒక మహిళ అని కూడా చూడకుండా వారిని అవమానించడం భారత దేశానికే అవమానం.
భారత దేశంలో మహిళలకు గొప్ప స్థానం ఇస్తూ నదులకు పేర్లు పెట్టుకుని అన్నపూర్ణగా కొలిచే మన భారతదేశంలో ఒక మహిళకు ఇలా అవమానం జరగడం నిజంగా సిగ్గుచేటు. అయినా వారు అన్నిటినీ తట్టుకుంటూ తాను చేసే పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో మనం ఆవిడను అభినందించాల్సిందే….
రాజ్యాంగం ద్వారా మనుషులకు స్వేచ్ఛ వచ్చిందనేది ఎంత నిజమో ఈ ఒక్క సంఘటన వల్ల బయటపడుతుంది అనేది గమనిస్తే చాలు. కనీసం సాటి మనిషిగా కూడా గుర్తించకుండా అవమానించడం మన భారతదేశంలో జరుగుతున్న హింస. ఇది మహిళలందరూ గుర్తించాల్సిన నిజం. దీనిని అరికట్టాల్సింది కూడా మనమే… మహిళలంతా వారికి అండగా నిలిచి వారికి ఇచ్చే విలువను వారికిద్దాం. తోటి మహిళగా గుర్తించి వారిని గెలిపించే బాధ్యత మన మీదనే ఉంది. మహిళలు అంతా ఏకమై పలు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లతో #తమిళసైమేడంజిందాబాద్ అని ట్రెండ్ చేస్తూ, వారికి ఇవ్వాల్సిన స్వేచ్చ, కనీస గౌరవాన్ని తెలియచేయాలి అనేది నా ఆలోచన. దీని పై మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా మీ అభిప్రాయం తెలుపండి.
ఒక ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు. అలాంటి మహాలక్ష్మి కంట కన్నీరు రాకుండా చూసుకుందాం.
– భవ్య చారు