ధరాభారం
పక్కింటివాళ్ళు ఏదో బాస్కెట్ అంట అక్కడినుంచి కూరగాయలు తెచ్చుకుంటున్నారు. చూడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అంది అమ్మ. మనం కూడా అలా తెచ్చుకుందామా అంటూ అడిగింది.సరే వాళ్ళు ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నారు ఎంత బిల్ అయిందో ఒకసారి అడగమ్మ అన్నాను నేను.అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్లి ధరల పట్టికను తీసుకొని వచ్చింది.ఇప్పుడు ఆ ధరల పట్టిక తీసుకొని చూడు అన్నాను
టమాట కేజీ 80
ఉల్లిగడ్డ కేజీ 60
ఉల్లిపాయ కేజీ 120
వంకాయ కేజీ 70
అంటూ మొత్తం ధరల పట్టికను చదివింది. అమ్మ ఇప్పుడు చెప్పు మొత్తం బిల్లు ఎంత అయింది అంటూ అడిగాను.మొత్తం కలిపి 2000 అంటూ కళ్ళు తేలేసింది అమ్మ. ఏమిటి కూరగాయలకు 2000 అది కూడా వారానికి సరిపోతాయి వాళ్ళు మనలాగే ఐదుగురు కదా అంది అమ్మ.
అవునమ్మా వాళ్ళ ఇంట్లో అందరూ పని చేస్తారు కాబట్టి తీరిక ఉండదు అందుకే ఇంటికి తెప్పించుకుంటారు. వాళ్లు కూరగాయల ధరలతో పాటు జీఎస్టీ ఇంటికి తెచ్చేయడానికి అయినా పెట్రోల్ ఖర్చు కూడా అందులో కలిపి వేస్తారు అందుకే వాళ్లకు అంత బిల్లు అయింది అన్నాను నేను మరి మనకు ఇంత కాదుగా అన్నారు అదెలా అంది అమ్మ.
ఎందుకంటే నేను వారం వారం అంగడికి వెళ్లి సరుకులు తీసుకొస్తాను కాబట్టి మనకు అంత ఎక్కువ అనిపించవు. అది కూడా చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చినవాళ్లు అమ్ముకుంటారు ఫ్రెష్వి తీసుకొని వస్తారు మనం బేరం చేసి తక్కువ ధరకు తీసుకుంటాం కాబట్టి 1000 రూపాయలలో మనకు అన్ని వచ్చేస్తాయి. వెయ్యి రూపాయలు అయినా వారానికి వెయ్యంటే నెలకు నాలుగు వేల రూపాయలు. మరి వాళ్లకి ఎన్ని అవుతాయి అంటూ లెక్కలు వేయసాగింది. వాళ్ళు కూడా వారానికి నాలుగు సార్లు తెప్పించుకుంటారు కూరగాయలు కాబట్టి ప్రతిసారి 2000 అంటే వారానికి 2000 అంటే నాలుగు వారాలకు 8000. మనకు అందులో సగం అవుతాయి అంటే 4000 మనం కూరగాయలకు ఖర్చు పెడుతున్నాం అన్నాను నేను.
మరి వాళ్ళు ఉప్పు పప్పులు కూడా తెప్పించుకుంటున్నారు అవి కూడా అంతేనా అంది అమ్మ. అవునమ్మా అవి కూడా అంతే వాళ్ళు జీఎస్టీ, కవర్లు, అలాగే పెట్రోల్ తో పాటు అన్ని ఖర్చులు వేసి ఎక్కువ డబ్బులు అడుగుతారు. అందరూ ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో బిజీగా ఉంటారు కాబట్టి వెళ్లి తెచ్చుకోవడానికి సమయం ఉండదు కాబట్టి అలా ఇంటికే తెప్పించుకుంటారు. మనం బయట పని చేసుకుని వచ్చినా ఏదో ఒక సమయంలో వెళ్లి తెచ్చుకుంటాం. ఎందుకంటే మనం ఖర్చు తగ్గించుకుంటాం. వాళ్ళు అవన్నీ చూడరు. సమయానికి అయిపోయిందా లేదా అనేదే చూస్తారు. కాబట్టి ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటారు. మన సంపాదనకు తగ్గట్టు మనం ఖర్చు పెట్టుకుంటాం. ఎవరి ఇష్టాలు వాళ్ళవి అన్నాను నేను.
అవును నువ్వు అంగడికి వెళ్ళిన ప్రతిసారి తక్కువ ధరకు తీసుకొస్తావు, కానీ మనం రైతుల శ్రమను కూడా గుర్తించాలి. ఇప్పటినుంచి నువ్వు బేరమాడకుండా వాళ్ళు ఎంత చెప్తే అంతకే తీసుకొచ్చేయ్ అంది అమ్మ. అలా కుదరదు మనం బేరమోడకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు. అయినా వాళ్లకు ఒక రూపాయి ఎక్కువగానే ఇస్తాను నేను. మనలాంటి వాళ్లు కూడా అంగడికి వెళ్లకుండా వేరే ఇలా తెప్పించుకుంటే వాళ్ల దగ్గర ఎవరు కొంటారు ,వాళ్లకు సరుకులు ఎలా అమ్ముడు అవుతాయి వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి అమ్ముకుంటున్నారు మధ్యలో దళారి చేతిలో మోసపోకుండా అమ్ముకుంటున్నారు. కాబట్టి వాళ్లకు కూడా ఎంతో కొంత మంచే జరుగుతుంది అంటూ సర్ది చెప్పాను.
అవును ఈమధ్య ధరలని కూడా ఎక్కువయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి, బస్సు టికెట్ల ధరలు కూడా పెరిగాయి, అలాగే అన్ని ధరలు పెరిగాయి, కరెంటు చార్జీలు కూడా పెరిగాయి, ఇలాంటి సమయంలో ఇంట్లో నలుగురం పని చేస్తేనే అన్ని విధాల బాగుంటుంది. ఇలా ధరలు పెంచి మధ్యతరగతి వాళ్ళని చంపుకు తింటున్నారు ఈ ధరలేమో గాని అటు కొనలేక, ఇటు తినలేక నలిగిపోతున్నాం అంటూ బాధపడింది అమ్మ.
అదంతా మనం చేసుకున్న పుణ్యమే. ఒక ఓటుతో ఐదేళ్లుగా ఐదేళ్ల మన జీవితాన్ని రాజకీయ నాయకుల చేతిలో పెట్టి ,మన చేతులారా ధరలు పెరిగేలా చేసుకున్నాం కాబట్టి భరించక తప్పదు బ్రతకాలి కదా అంటూ ఓదార్చాను.
నిజమే ధరలు ఎక్కువ కావడం వల్ల మధ్యతరగతి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. కక్కలేక, మింగలేక, తెచ్చుకోలేక, తినలేక జీవితాలు సాగిస్తున్న వారందరూ మన చుట్టూ ఉన్నారు. కొందరు తినడానికి బ్రతికితే మరికొందరు బ్రతకడానికి తింటున్నారు అనేది వాస్తవం.కథ ఇంకా వివరంగా రాయలేకపోయాను అందుకు మన్నించ ప్రార్థన. ఇది ఇప్పుడే నిజంగానే మా ఇంట్లోనే జరిగింది కాబట్టి చిన్నగా రాసాను.
-భవ్యచారు