ధనం
పరుల పైన అసూయా తనకంటే ఎక్కువ సంపద ఉందని
తోటి స్నేహితుల పైన ద్వేషం తనకన్నా మార్కులు ఎక్కువ వచ్చాయని.
తోడబుట్టిన వారి పైన కోపాలు ఆస్తులు ఎక్కువ పంచుకున్నారు అని
తల్లి పై ఆక్రోశం తనకన్నా తమ్ముడిని ముద్దు చేస్తుందని
తండ్రి పై కోపం అన్నను బాగా చదివించారని
ఎవరికో ఆస్తులు ఉన్నాయని, మరెవరో వేరే దేశం వెళ్తున్నారని,
వాడు అన్నిటిలో ముందున్నాడు అని, తాము లేమని
వాడి కన్నా ఎక్కువ సంపాదించాలని భార్య బిడ్డలను వదిలి
దూర దేశాలకు వలసలు వెళ్తూ ఉన్న ఊరును, కన్నవారిని మరిచి
కాసులకై రెక్కలు ముక్కలు చేసుకుంటూ జీవితం అంటే
డబ్బే ప్రధానంగా, డబ్బే లోకంగా బతికే బతుకు ఒక బతుకేనా
తన తల్లిదండ్రుల ప్రేమ, తన పిల్లల బోసి నవ్వులు
తన భార్య చూపించే ఆదరణ ఇవన్నీ వదిలేసి
క్షణ భంగురమైన జీవితం కోసం ఎన్నో వందల మైళ్లు
ప్రయాణించి, డబ్బు సంపాదించే తరుణం లో
యంత్రాల నడుమ ప్రాణాలు పోగొట్టుకున్న వారెందరో…
– భవ్య చారు