దీపావళి – చీకటి రాత్రి

దీపావళి – చీకటి రాత్రి

అమ్మను హాస్పిటల్ లో జాయిన్ చేశారు త్వరగా కావలి కి రా నువ్వు అని ఇంటి దగ్గర నుంచి ఫోన్…అంతే కళ్లలో సుడిగుండాలు, ఏమి అయ్యిందా అని… నన్ను నేను కంట్రోల్ చేసుకుని హాస్పిటల్ కు బయలుదేరాను.. కావలి లో బొల్లినేని డయాగ్నొస్టిక్ సెంటర్ లో స్కానింగ్ చేశారు…
గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉన్నాయి.. సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి అర్జెంటుగా ఆపరేషన్ అవసరం అయ్యేలా ఉంది అన్నారు.
డాక్టర్ పరమేశ్వర్ గారితో మాట్లాడితే టెంపరరీ రిలీఫ్ కోసం టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్లు వేశాము.. కానీ త్వరగా మంచి డాక్టర్ ను కన్సల్ట్ అవ్వండి అన్నారు.
అమ్మ కళ్లుమూసుకుని ఉంది కళ్ల చివర మాత్రం కన్నీటి చారలు. అలా బెడ్ పైన తనని చూసేసరికి ఆపుకోలేక కళ్లు కన్నీటి వర్షం కురిపించాయి.
నాకున్న ఒకే ఒక ధైర్యం అమ్మ తనే దూరమైతే భరించుకోలేను ఎలాగైనా అమ్మను కాపాడు కోవాలనుకున్నాను.
డాక్టర్ ను అడిగాను ఎంత వరకు ఖర్చు అవుతుంది సార్ అని. 2 లక్షల దాకా ఖర్చవుతుందన్నారు అంత డబ్బు ఎలా తేవాలి? అత్యవసరం ఏమి చేయాలో తోచని స్థితి అంతా కలిపిన నావద్ద ఓ పది. పదిహేను వేలు దాకా ఉన్నాయి… 
రేపు రాత్రికి ఆపరేషన్ చేయాలి అంటున్నారు డబ్బు ఎలా? ఎలా? ఒకటే ఆలోచనలు కావలసిన వాళ్లందరీనీ అడిగా లేదని తప్పించ్చుకునే వారు కొందరైతే ఉండి లేదన్నవారు ఎందరో…
ఇక బంధువులైతే పచ్చగా ఉన్నప్పుడు ఆహా ఓహో అన్నవాళ్లే కష్టమొచ్చిందంటే ఫోన్ లెత్తడమే మానేశారు…  
“డబ్బు దేముంది… ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. మనిషి ముఖ్యం అని అనుకునే నేను ఆ మనిషిని నిలబెట్టేది డబ్బేనా… అని ఒక్క క్షణం ఆలోచించేలా చేసింది కానీ ఏమీ చేయాలో తోచని పరిస్థితి”…
వెంటనే మా అమ్మ కట్టిన ఎల్ఐసి పాలిసి గుర్తుకు వచ్చి ఏజెంట్ రామి రెడ్డి గారికి ఫోన్ చేశాను. రేపు ఉదయం బాండ్ తీసుకొని ఆఫీస్ కి రా చూసి ఎంత వస్తోందో చెప్తాను అన్నారు.
మళ్ళీ మదిలో ఆలోచన పాలిసికి అంత కలిపినా యాభై వేలు కన్నా ఎక్కువ అయ్యేలా లేవు.. ఇంకా చాలా డబ్బులు కావాలి ఎలా చేయాలి అని ఆలోచనలో ఉన్నాను…
ఎలాగైనా అమ్మను కాపాడుకోవాలి అని పలురకాలుగా ఆలోచీంచుకుంటూ ఒక్కసారి కళ్లు మూసుకున్నాను…
తరువాత రోజు పొద్దున్నే ఎల్ఐసి పాలిసి లో లోన్ అమౌంట్ గా వచ్చిన నలభై వేలు తీసుకొని నా దగ్గర ఉన్న పదివేలు కి తోడు గా నా ఫ్రెండ్ హజరత్ ద్వారా తీసుకొన్న ముప్పై వేలు అప్పు మొత్తం అటు ఇటుగా ఎనభై వేలు ఉన్నాయి… 
మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాను. అమ్మ ఒక్కరే ఉన్నారు, హాస్పిటల్ లో తోడుగా ఎవరూ లేరు. “కొడుకు అయినా కూతురు అయినా నువ్వే రా నాకు” అనేది అమ్మ పలు సందర్భాలలో… 
అందుకేనేమో ఈ రోజు అమ్మకి ఓ ఆడ కూతురు గా చేయాల్సిన అన్ని పనులు నేను చేయాల్సి వచ్చినందుకు ఆ మాట ఎందుకు అనేదో అమ్మ అని ఇప్పుడు గుర్తు వచ్చింది..
మధ్యాహ్నం విజిట్ కి డాక్టర్ వచ్చారు ఆ టైం లో అమ్మకి అన్నం పెడుతున్న నన్ను చూసి, ఒక్క క్షణం ఆగి తన ఛాంబర్ కి రమ్మన్నట్లు సైగ చేసి వెళ్ళాడు.
మళ్ళీ టెన్షన్ ఏమి చెపుతారా అని అమ్మకి అన్నం తినిపిస్తూ ఉండగా చివర్లో వోమిథింగ్ అయ్యేలా ఉంది. నన్ను బాత్ రూం వరకు తీసుకెళ్ళరా అన్నది.
అంతలోపు నా దోసిలి నిండిపోయింది. పర్లేదు అమ్మ నేను వెళ్లి చేతులు కడుక్కొని వస్తాను లే నువ్వు కొంచెం అలా ఒక పక్కకి తిరిగి పడుకో అన్నాను.
ఎవరో సార్ అనే సరికి కళ్లు తెరిచాను. ఎదురుగా నర్స్, ఇక్కడ సైన్ పెట్టండి అంది. అయోమయంగా చూస్తూ… డబ్బు ఇంకా అరేంజ్ కాలేదు అన్నాను.
నర్స్, డాక్టర్ గారు డిశ్చార్జ్ చేయమన్నారు కావాలంటే ఓసారి మాట్లాడండీ అని వెళ్లిపోయింది. లోపలికి వెళ్ళగానే ఒక చిన్న చీటీ రాసి నా చేతిలో పెట్టాడు.
హైదరాబాద్ లో డాక్టర్ గంగాధర్ సార్ ఉంటారు వెళ్లి కలవండి. రేపు ఉదయం కల్లా అక్కడ ఉండండి సరిపోతుంది అన్నాడు.
గొంతులో నుంచి మాట రావడం లేదు. ధైర్యం తెచ్చుకొని మెల్లగా సార్ డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది సార్ అని మళ్ళీ అడిగాను.
నువ్వు ముందు సార్ ను కలువు ఆయన చెప్తారు ఎంత అనే విషయం. వెళ్ళేది NIMS హాస్పిటల్ కి Govt. Hospital అది అన్నారు.. … Govt. Hosptial ఆ ఎలా చూస్తారో ఏమో సార్ అక్కడ..
నువ్వు అధైర్య పడకుండా ముందు అక్కడికి వెళ్ళు మిగతాది నేను ఫోన్ లో మాట్లాడుతా అన్నారు… 
మగపిల్లాడివి కదా! ఆసుపత్రిలో మీ అమ్మకి తోడుగా ఒక ఆడమనిషి అవసరం ఉంటుంది తీసుకెళ్లండి అని చెప్పారు పక్కన ఉన్న నర్స్.. 
తెలిసిన వాళ్ళకి బంధువులకు ఫోన్ చేసి అడిగాను.. కొందరు రాలేము అని డైరెక్ట్ గా చెప్పారు.. కొందరు ఇంటి దగ్గర ఇబ్బంది, చేలో పని ఉంది, అన్నం కి ఇబ్బంది అవుతుంది ఇంటిలో వాళ్లకి మాకు వీలు కాదు నువ్వే ఎలాగో అలాగ తవుసు పడురా ఈసారి అన్నారు. ఆ క్షణంలో నా పరిస్థితి ఎలా ఉన్నదో అని ఇప్పుడు రాస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. 
“అమ్మ లేక పోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది”
అంటారు కదా.. కానీ ఆ బాధ్యత నా 13-14 సంవత్సరాల వయసులోనే తెలిసింది. ఇంత త్వరగా నా మీద ఇంత పెద్ద బాధ్యత పడుతుంది అని నాకు తెలియలేదు..  
అప్పుడే అర్థం అయ్యింది నాకు, “డబ్బు లేక పోతే బంధువుల నుంచి ఆత్మీయత అభిమానం ఉండదు” అని.
డబ్బులేక పోతేనేమి? బాధ్యత ఉంది. ఆత్మాభిమానం ఉంది. కష్ట పడి పనేచేసే గుణం ఉంది. అన్నిటికీ మించి ఎదుటి వారిపై గౌరవం ఉంది.
బ్రతుకు పోరాటం చేస్తున్న నాలో నేనే ధైర్యం చెప్పుకొంటూ హైదరాబాద్ కి వెళ్ళాము నేను అమ్మ. ఫస్ట్ టైం హైదరాబాద్ కి వెళ్ళడం.
దారిపొడవునా డ్రైవర్ ను అడుగుతూ వెళ్తున్నా, అన్న నిమ్స్ హాస్పిటల్ కి పోవాలి అక్కడ ఆపు అన్నా అని.. గేట్ ఎదురుగా మమ్మలని దించాడు.
అమ్మను చెయ్యి పట్టుకొని రోడ్ దాటించి హాస్పిటల్ లో ఒక పక్కన అమ్మను కూర్చో బెట్టి ఇడ్లీ తెచ్చి ఇచ్చాను.
అమ్మ తిన్నాక నేను పోయి డాక్టర్ ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు వస్తారో కనుక్కొని వస్తా ఇక్కడే ఉండు అమ్మ అని చెప్పి చేతిలో ఉన్న సంచి అమ్మకి తల దిండు గా పెట్టి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి వెళ్ళాను. 
చాలా మందిని కనుక్కొన్నాక చివరికి సార్ 10 గంటలకు వస్తారు అని చెప్పారు. ఆయన గది బయట వెయిట్ చేస్తున్నాను. ఇంతలో సార్ రావడం చేతిలో ఉన్న చీటీ బయట ఉన్న కాంపౌండర్ చేతికి ఇవ్వడం అమ్మను చూపించడం అన్ని చక చక అయ్యాయి.
స్కానింగ్ రిపోర్ట్స్ రేపు వస్తాయి అప్పటి వరకు వెయిట్ చెయ్యండి.  టాబ్లెట్స్, ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు కొంచెం పర్లేదు అని అమ్మ అన్నాక కాస్త మొహంలో మెరుపు వచ్చింది.
నైట్ ఎక్కడ ఉండాలి, ఎవరూ తెలియదు ఇక్కడ నాకు చీకటి పడుతుంది. హాస్పిటల్ బయట వేరే వాళ్ళు పరిచయం అయ్యారు.
వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లెమ్ తో అక్కడికి వచ్చారు అంట. వాళ్ల పక్కనే తెచుక్కొన బెడ్ షీట్ పరిచి ఆ రోజు రాత్రి హాస్పిటల్ అవరణం లో అక్కడే పడుకున్నాము.
ఉదయాన్నే రిపోర్ట్స్ రావడం డాక్టర్ గారు చూసి భయ పడాల్సిన పనిలేదులే. ఆపరేషన్ లేకుండా మెడిసిన్ తోనే నయం అయ్యేలా చూస్తాను అని ఆయన చెప్పడం తో…
ఎక్కువ ఆలోచించకండి అమ్మా నేను ఉన్నాను అని చెప్పి వెళ్లిపోతుంటే, “దేవుడు అన్నిచోట్లకు రాలేక ఇలాంటి వారిని పంపుతారేమో” అనుకుంటూ చేతులెత్తి మొక్కాను.
ఆ తర్వాత అమ్మను తీసుకుని ఓ 2 నెలలు ఊరెళ్లి కంటికి రెప్పలా చూసుకోవడంతో అమ్మ త్వరగానే కోలుకుంది. రెండు నెలల తరువాత ఇంకో సారి చెకప్ కోసం వెళ్ళాము.
నీ మనసు మంచిది మల్లికార్జునా, ఆ మంచి మనసే మీ అమ్మను కాపాడింది. త్వరలో మీకు మంచి రోజులు వస్తాయి (మా గురించి వివరాలు తెలుసుకున్నారు డాక్టర్ సార్) నువ్వు హ్యాపీ గా ఉంటే మీ అమ్మ కి త్వరగా నయం అవుతుంది అన్నారు.
“హైదరాబాద్ లో మేము ఆ రోజు హాస్పిటల్ లో గడిపిన రాత్రి దీపావళి పండుగ.. కానీ మాకు మాత్రం చీకటి రాత్రి”
ఇప్పటికీ ప్రతీ దీపావళికి ఈ విషయం నాకు ఒక్క సారి అయినా ఏదో ఒక సమయంలో గుర్తు వస్తుంది.
రోజులు మారాయి.. మనుషులు మాత్రం ఇంకా…….
-మల్లిఖార్జున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *