డార్విన్ జీవ పరిణామక్రమ సిద్ధాంతం
నా పుట్టుక ఆనవాళ్లను నేను
మర్చిపోవాల్సిందేనా…
మతం పునాదుల మీద ఏర్పడ్డ
కులసమూహ నివాసాల్లో నేను
మగ్గిపోవాల్సిందేనా…
కొన్ని కోటానుకోట్ల లక్షల
సంవత్సరాల
పుట్టుపూర్వోత్తరాలను శోధించి
సాధించగలిగిన నేను…
రాబోవు ప్రళయాలను ముందుగానే
పసిగట్టగలిగిన నేను…
చెంత చేరిన రోగాలను పురిటిలోనే
మట్టుపెట్ట గలిగిన నేను…
విశ్వ విష వలయాలును చేదిస్తు
విశ్వాంతరాలపై ప్రయాణిస్తున్న
నేను…
చీకటి,రాతీ, ప్రాచీన, మధ్యయుగాల
అంతరాల – అవరోధాలను దాటి
ఆధునిక సమాజంలోకి
అడుగుపెట్టిన నేను…
మళ్లీ ఆ చీకటి ప్రపంచంలోకి
పరుగులు తీయాల్సిందేనా…
అబద్ధపు అక్షరాల చేత
వక్రీకరించబడ్డ చరిత్ర నుండి
నా జన్మ రహస్యం ఎక్కడ ఉందో
అని వెతుక్కోవాల్సిందేనా…
డార్విన్ జీవ పరిణామక్రమ
సిద్ధాంతాలను
పక్కకు నెట్టిన నేను…
మతమౌడ్యపు భక్తిలోపడి
భజనలు చేయాల్సిందేనా…
గాఢాంధకార అనాగరిక సమాజం
నుండి నవనాగరికత వెలుగులు
విరజిమ్మే విజ్ఞాన కాంతిరేఖల వైపు
నడిచిన నేను…
చీకటి యుగం వైపు మళ్ళీ నేను
తిరోగమనించ వలసిందేనా…
విశ్వం రహస్యమును,
జీవం పుట్టుకను,
జీవరాశుల మనుగడను
విశ్లేషించి వివరించిన నేను…
విచక్షణ కోల్పోయిన జీవిలాగా
వింతలు, విడ్డూరాలు అంటూ
అబూత కల్పనకు ఆజ్యం
పోయాల్సిందేనా…
తెలివితో, మాటలతో, చేతలతో
సమస్త విశ్వ మండలాన్ని
నిర్మించుకున్న నేను…
గొంతెత్తి ప్రశ్నించలేని ముగాజీవిగా మరిపోవలిసిందేనా…
మీరు పన్నిన కుట్రల కుతంత్రాలతో
నా భవిష్యత్తు తరాలు ఆగమవుతు అంతమవబోతున్నాయి.
(పాఠ్యపుస్తకాల నుంచి డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని తొలగించిన సందర్భంగా తిరిగి మళ్లీ యధావిధిగా పాఠ్యపుస్తకాలలో చేర్చాలని)
(నేను = మనిషి)
-బొమ్మెన రాజ్ కుమార్
కవిత పాఠకులను ఆలోచింపజేస్తోంది