దరి
ఆ దరిని ఆగిపోయావేం నేస్తమా?
రా ఈ దరికి వచ్చిచూడు
ఆ దరికి ఈ దరి ఎంత దూరమో?
ఈదరికి ఆ దరీఅంతే దూరం
ఒకే గదిలో ఇమిడి
ఆప్యాయతల నడుమ
అందరూ కలిసి ఆవకాయతో తిని
తృప్తి పొంది హాయిగా నిదురించే
నిజమగు ఐశ్వర్యవంతుడైన
రైతు కుటుంబం చూడ
ఈ దరికి రావోయి
స్వచ్ఛమైన పిల్లగాలులు పీల్చుతూ
చిత్రమైన మట్టి వాసన ఆస్వాదిస్తూ
పల్లె పక్షుల సంగీతాల నడుమ
నిన్ను నీవు మైమరిచే క్షేత్రమైన
పల్లెటూరున్న ఈ దరిని చూడరావోయి
కృత్రిమ గాలి నిండిన గదిలో
ఒక్కొక్కరుగా ఉంటూ
ఎవరికి వారే యమునా తీరై
మమకారపు మాధుర్యం
మచ్చుకైన తెలియక
అదే జీవితమనుకుని
మరమనిషి లాగా జీవించకు..
నీటి బుడగ జీవితాన్ని
స్నేహమయం చేసుకో
అసలైన సంతోషం
బ్రతుకులోన నింపుకో
ఎప్పుడూ ఎడతెగక ప్రవహించే
జీవనవాహినికి ప్రేమవంతెనవేసి
మమతల తీరం చేరుకో స్నేహమా!
– సలాది భాగ్యలక్ష్మి