చిలిపి పనులు

చిలిపి పనులు

ఏంటి నిద్ర రావడం లేదా అడిగింది అమ్మ. లేదమ్మా రావడం లేదు. నిద్ర రాకున్నా కళ్ళు మూసుకో అదే వస్తుంది. లేకపోతే రేపు అక్కడ నిద్ర పోతావు.

నీ ఇష్టం ఇక అంటూ బెదిరించింది ప్రేమగా, అవును పడుకోవాలి లేదంటే తెల్లారి సంతోషంగా ఉండలేను అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నా అయినా నిద్ర రాదే, రేపెలా వెళ్తానో, ఎలా మాట్లాడాలో, ఎలా గుర్తు పట్టాలో, అసలు నన్ను గుర్తు పడతారా లేదా అనే లక్ష ప్రశ్నల మధ్య నిద్ర అనే చిన్న విషయం మరుగున పడింది.

అంతకు ముందు ఏం బట్టలు వేసుకోవాలి, ఏం చెప్పులు వేసుకోవాలి అంటూ హడావుడి పడుతూ అన్నీ సిద్దం చేసుకునే సరికి పదకొండు, అయ్యింది. ఆ తర్వాత మొదలైంది అసలు ఆలోచన ఎలా మాట్లాడాలి అనుకుంటూ గుండెల్లో ఉన్న సంతోషం కళ్ళలో కనిపిస్తుంటే కళ్ళు మూతలు పడకుండా ఆలోచనలు గతం వైపు పరుగులు తీశాయి.

చిన్నానాటి మిత్రుల రూపురేఖలు, ఆడుకున్న ఆటలు, చేసిన చిలిపి పనులు, రేగు పళ్ళు కొనుక్కుని క్లాసులో దొంగతనంగా తినడాలు, ఇంటర్వెల్ లో నాన్న దగ్గర డబ్బులు కోసం స్టాఫ్ రూమ్ ముందు పచార్లు చేయడం, గీతా ఐస్ క్రీమ్ కొనుక్కొని స్నేహితులకు చూపిస్తూ ఆశ పెడుతూ తినడం, అవకాయ బద్దను కడుక్కుని జేబులో వేసుకుని క్లాస్ రూం లో కొంచం కొంచం కొరుక్కుంటూ తినడం.

పరీక్షల కోసం పోటీలు పడి చదవడం, చలికాలం లో స్కూల్ ముందున్న చెట్ల నీడలో క్లాసులు వినడం. స్లీప్ టెస్ట్ రాస్తూ మట్టిలో ముగ్గులు వేయడం, ముందున్న స్నేహితురాలిని జవాబు చెప్పమంటూ రాళ్ళు విసిరేయడం. బాత్ రూం లేక స్కూల్ పక్కన ఉన్న ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమిలాడడం.

పక్క ఊరి నుండి వచ్చిన స్నేహితుల డబ్బాలలో ఏముందని చూసి, డబ్బా ను ఉపాధ్యాయులు చూడకుండా తినడం. విరామం అవ్వగానే తొక్కుడు బిళ్ళ, కచ్చకాయలు ఆడుకోవడం, కచ్చకాయల కోసం మంచి మంచి రాళ్ళు వెతకడం. నలుగురం నాలుగు డబ్బులు వేసుకుని జామకాయలు కొనుక్కుని ఊరిస్తూ తినడం. బోరింగ్ దగ్గర ఒకరి తర్వాత ఒకరం నీళ్ళు తాగడం.

మూసిన కనురెప్పల చాటున ఎన్నో జ్ఞాపకాలు ముసురుకోగా అలారం శబ్దం ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది. లేచి సమయం చూసాను. అయిదు అవుతుంది. కళ్ళు బరువెక్కాయి. నిద్ర లేక పోయినా మెలుకువ తెచ్చుకుంటూ గబగబా లేచి తయారయ్యాను.

ఆరుగంటలకు ఇంట్లోంచి బస్ స్టాప్ కి వచ్చాను. రెండు నిమిషాల నిరీక్షణ తర్వాత బస్ రావడం తో ఎక్కి కూర్చున్నా, రెండు నిమిషాలు రెండు యుగాలుగా మారినట్టు అనిపించింది.

ముందు సీట్లో ఒకావిడ కూర్చుంది అవిడను చూడగానే తానేనా కాదా అనే మీమాంసలో నేను దిగే స్టేజ్ వచ్చింది. తాను కూడా అదే స్టాప్ లో దిగడం తో తానే అని నిర్ధారించుకుని పలకరించాను.

ఆశ్చర్యం. తానే అవును తానే నా స్నేహితురాళ్ళలో ఒకరు అలా ఇద్దరం మరో బస్ ఎక్కాము. ఇద్దరం కబుర్ల లో పడిపోతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంతో సాగుతుండగా మరో స్టాప్ లో ఇంకొక హితురాలు కలిసింది దాంతో మా సంతోషం రెట్టింపు అయ్యింది.

ముగ్గురం మళ్లీ మరో బస్ కోసం నిరీక్షణ చేస్తూ కబుర్ల తో ముందుకు సాగిపోయాము. అలా వెళ్తుంటే కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది. అదిగో దగ్గరయ్యే కొద్దీ గుండెల్లో సంతోషం మనసులో ఒక రకమైన ఉద్వేగం వచ్చింది, వచ్చేసింది అదిగో అక్కడ కనిపించేదే మమల్ని చిన్నప్పటి నుండి భరించిన పాఠశాల అవును పాఠశాలనే.

చాలా యేళ్ళ తర్వాత అందరం ఆత్మీయ సమ్మేళనం కోసం వెళ్ళాము. తర్వాత ఒక్కొక్కరు గా వచ్చారు. చిన్నప్పటి మొహాలు గుర్తు పట్టలేక పోయాను. ఎవరికి వారు తామేవరు ఏం చేస్తున్నారు అంటూ పరిచయ వాక్యాలు చేసుకున్నాం.

అందరం సుఖదుఃఖాలను పంచుకున్నం. నేనెన్నో మాట్లాడాలని అనుకున్నాను. కానీ సంతోషం లో గొంతు మూగబోయింది. అప్పటి గురువులను గౌరవిస్తూ, సన్మానించుకున్నాం. అప్పటి బాల్య స్మృతులను గుర్తుచేసుకుంటూ కలిసి భోజనాలు చేసాము.

తర్వాత అందరం సంతోషంతో ఆట పాటలతో సందడి చేసాము. సమయం దగ్గర పడడం వల్ల హృదయం అంత బాధతో నిండి పోయింది. కన్నీళ్లు ఉగ్గబట్టుకుని ఒకరికొకరం ఓదార్చుకున్నాం.

మా తరగతి గది వరకూ వెళ్లి ఎవరేవరం ఎన్ని చిలిపి పనులు చేసింది గుర్తుచేసుకుంటూ అన్ని చరవాణి లో భద్రపరిచి, ఇక వీడ్కోలు నేస్తాలు అంటూ చెలులకు సెలవిస్తూ, మళ్లీ కలవాలని బాసలు చేసుకుంటూ, మనసు నిండా సంతోషం తో తిరుగు ప్రయాణం అయ్యాము.

అప్పటికీ, ఇప్పటికీ, ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అయినా సృష్టిలో తియ్యనిది, మాయనిది, మాసి పోనిది, సంపదలు ఎన్ని ఉన్నా తరగనిది, ఎందరు బంధువులు ఉన్నా వెలకట్టలేనిది. పేద, ధనిక తేడా లేనిది, ఆపదలో ఆదుకునేది, నాలుగు మంచి మాటలు నేర్పేది, చెడు ను దూరం చేసేది.

ఏమార్చనిది, ఎడబాటు లేనిది, పిలిస్తే పలికేది, అన్ని కాలాలలో ఆదుకునేది, వంద మంది కన్నా ఒక్క మిత్రుడు ఉన్నా చాలు అనిపించేది, మనల్ని మంచి బాటలో నడిపించేది స్నేహం ఒక్కటే.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *