కాంతార లో “భూతకోలం” వెనుక ఉన్న అసలు కథ ఏంటి?

కాంతార లో “భూతకోలం” వెనుక ఉన్న అసలు కథ ఏంటి?

కాంతార దేశాన్ని అంతా తన వైపు చూసేలా చేసింది. ఈ సినిమాని 16 కోట్లతో నిర్మించారు. ఇప్పుడు ఆ సినిమా 250 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను మీరు అందరూ చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి ధియేటర్ కి వెళ్లి చూడండి ఈ సినిమాతో చరిత్రను సృష్టించారు అని చెప్పవచ్చు.

ఇందులో ప్రతీ సన్నివేశం ప్రతీ మలుపు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా కోలం వేసే సీన్లు, అప్పుడు వచ్చే హంటింగ్ బీజీయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో చూపించిన సాంప్రదాయ పద్ధతులు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించాయి.

అందుకే ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గది భూత కోలం ఈ భూత కోలం అంటే ఏమిటి? ఇది ఎందుకు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ భూత కోలం అనేది ఒక సాంప్రదాయ నృత్యం ఇది కర్ణాటకలోని తుళునాడు, వెలనాడులో చాలా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి ప్రజలు ఈ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష కూడా తుళు భాష.

మామూలుగా భూతం అంటే మనం దయ్యం, పిశాచి అని అనుకుంటాము. కానీ భూత కోలం అంటే తుళు భాషలో దేవుడు చేసే కోలం అని అర్థం కోలం అంటే నృత్యం. స్వయంగా దేవుడే మనిషిలో పూని ఈ నృత్యాన్ని చేస్తాడు అని అక్కడి ప్రజలు నమ్ముతారు.

ఈ సాంప్రదాయం నృత్యం ఎప్పుడు ఏక్కడ ఎలా పుట్టిందో తెలియదు కానీ, 500 ఏళ్ల క్రితం నుండి ఉంది అని ఒక అంచనా వేశారు శాస్త్రజ్ఞులు. అక్కడి ప్రజలు దేవుడు తమ బాగోగులు చూస్తూ తమను నీడలా కాపాడుతూ తమను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడని చాలా బలంగా నమ్ముతారు.

అలాగే ఈ కోలావేశం వేసుకున్న వ్యక్తి ఒంట్లోకి దేవుడు ఆవహించి అక్కడ ఉన్న సమస్యలు కుటుంబ సమస్యలు అన్ని తీరుస్తాడని అక్కడున్న ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకే ఆ వేషం వేసుకున్న వ్యక్తిని పవిత్రంగా పూజించుకుంటారు.

కుటుంబ సమస్యలు కానీ, గొడవలు కానీ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటికి తీర్పులు చెబుతూ ఉంటారు. ఆ తీర్పులు ఎలా ఉన్నా ఆ వేశం వేసుకున్న వ్యక్తిని దేవుడిలా భావిస్తారు కాబట్టి ఆ వ్యక్తి చెప్పింది తప్పక ఆచరిస్తారు.

అయితే ఈ వేషం వేసుకునే వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారు. అలా ఒకే కుటుంబంలో తరతరాలుగా ఈ వేషం వేసుకునే ఆనవాయితీ ఉంటుంది. అయితే కాంతార సినిమాలో రెండు దేవుళ్ళని చూపిస్తారు. ఒకటి పంజుర్లీ, ఇంకొకటి గులిగా.

ఎల్లో కలర్ పెయింట్ వేసుకున్న వ్యక్తులకి పూనే దేవుడిని పంజుర్లీ అని చివర్లో హీరోకి పూనే దేవుడిని గులిగ అని అంటారు. గులిగ ఎక్కువగా భయంకరంగా రూపం వేసుకున్న వ్యక్తులకి పూనుతాడు. అయితే పంజుర్లీ అంటే వరాహం యొక్క ఆత్మ అని అర్థం.

పూర్వకాలంలో తుళునాడు లో అడవి పందులు పంటలను నాశనం చేసేవి. అందుకని ప్రజలు వాటి ఆత్మలకు పూజలు చేసేవారు. చరిత్ర ప్రకారం పార్వతీదేవి దగ్గర ఒక అడవి పంది ఉండేది. ఆ అడవి పంది అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం కానీ ఆ అడవి పంది చాలా చిలిపిది దాంతో ఆ అడవి పంది కైలాసంలో ఉన్న ఉద్యానవనాన్ని మొత్తం నాశనం చేసేది.

దాంతో శివుడికి కోపం వచ్చి ఆ అడవి పందిని చంపేస్తాడు. ఇష్టమైన వరాహాన్ని శివుడు చంపేశాడు కాబట్టి పార్వతీదేవికి కోపం వస్తుంది. ఆ సమయంలో శివుడు పార్వతి కోపాన్ని ఉపశమింప చేయడానికి దాని ఆత్మను అంటే అడవి పంది యొక్క ఆత్మను తిరిగి భూమి పైకి పంపిస్తూ భూమి మీద ఉన్న మనుషుల సమస్యలు తీర్చమని పంపిస్తాడు శివుడు.

ఆ అడవి పంది భూమి పైకి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీరుస్తూ వారిని బాగా చూసుకుంటూ ఉంటుంది.

ఇక గులిగ విషయానికి వస్తే ఇది శివుడులోని ఒక అంశం అని తుళునాడు ప్రజలు నమ్ముతారు. అయితే పురాణాల ప్రకారం పార్వతీదేవి శివునికి బూడిద తీసుకొని వస్తుంది ఆ బూడిదలో ఒక రాయి ఉంటుంది. శివుడు ఆ రాయిని భూమి పైకి విసురుతాడు. అది నేలపై పడగానే గులిగలాగా మారుతుంది.

విష్ణుమూర్తికి సేవ చేయాల్సిన గులిగ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతని ప్రవర్తన చూసిన విష్ణుమూర్తి నెలవుల సంఖ్య అనే స్త్రీ గర్భాన జన్మించమని శపిస్తాడు. నెలవుల సంఖ్య అనే మహిళ గర్భంలో ఉన్న గులిగ తొమ్మిది నెలలప్పుడు నేను బయటకు ఎలా రావాలని ఆమెని అడుగుతాడు.

దానికి ఆమె అందరిలాగే నువ్వు కూడా రా అని చెప్తుంది కానీ గులిగ మాత్రం ఆమె చెప్పింది వినకుండా కడుపు చీల్చుకొని బయటకి వస్తాడు బయటకు రాగానే గులిగకు చాలా ఆకలి వేస్తుంది. దాంతో అతను కనిపించిందల్లా తింటూ ఉంటాడు.

చివరికి చెరువులో ఉన్న చాపలని అన్నిటినీ తినేస్తాడు. అయినా కూడా అతని ఆకలి తీరదు. చివరికి ఏనుగు గుర్రం యొక్క రక్తం కూడా ఇస్తారు. అయినా ఆకలి తీరదు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చిటికెన వేలు ఇస్తాడు అప్పుడు గులిగ ఆకలి తీరుతుంది.

ఒకానొక సమయంలో పంజుర్లీకి, గులిగకి భీకర యుద్ధం జరుగుతుంది. ఈ భూమి నాదంటే నాదని విపరీతంగా కొట్టుకుంటూ ఉంటారు. వీరి యుద్ధం చూసిన ఏడుగురు జలదుర్గలు వచ్చి వాళ్ళని ఉపశమింప చేస్తారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ములలా ఉండమని చెప్తారు.

అప్పటినుంచి పంజుర్లీ ఆ భూమికి కాపలాగా ఉంటాడు. ఇక గులిగ అక్కడ పాలకుడిగా ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ ఉంటాడు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి గులిగని ఒక్కోలా పూజిస్తూ ఉంటారు.

ఈ భూత కోలంలో దేవుడిని పిలవాలి అనుకున్న వారు. వారికి సంబంధించిన రంగులను వస్త్రాలను పువ్వులను ధరిస్తారు మొహానికి పసుపు రంగును పూసుకున్న వారిని పంజుర్లీ ఆవహిస్తుంది. భయంకరంగా నలుపు ఎరుపు రంగులను పూసుకున్న వారిని గులిగా ఆవహిస్తుంది.

ఇలా ఒకే కుటుంబానికి సంబంధించి ఒకరి తర్వాత ఒకరు ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తుళునాడు ప్రజల సాంప్రదాయ దేవుడి నృత్యాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తూ ఉంటారు. ఇదండీ కాంతార సినిమాలో మనకు చూపిన భూతకోలం వెనుక ఉన్న అసలు కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *