ఛిద్రమైన బతుకు బండి
రెండు వేల ఇరవై
విజన్ ట్వంటీ ట్వంటీ
అందరి విజన్ మార్చింది
బ్రతుకులు ఛిద్రం చేసింది
బతుకు బండిదారితప్పింది
బతికున్న శవమైన జీవితాలు
ఎవరెలా బ్రతికారో
ఆ బ్రతుకులు మారిపోయి
పూర్తిగా గమ్యం తప్పాయి
ముఖ్యంగా విద్యారంగం
చదివిన చదువులు కూడు పెట్టక
విధి వంచితులైన
బతకలేనిబడిపంతుళ్ళు
పూలమ్మిన చోట కట్టెలమ్మినట్లు
డిగ్నిటీ ఆఫ్ లేబర్ బోధన కాదు
నేడు ఆచరణలో చూపుతున్నారు.
బతుకు బళ్ళు గమ్యం తప్పి
దిక్కులేని దారులలో
దిశలేని పయనం చేస్తూ
కుటుంబ బాధ్యతలను
బరువు పరువులను మోస్తూ
చదివిన చదువుకు
చేసే పనులకి పొంతనలేనంతగా
బతుకు బండి గతి తప్పింది
సహనానికి మారు రూపులా
ఓటమెరుగని జీవితంకోసం
అలుపెరుగని పయనం చేస్తూ
సిమెంటు పని చేసే పిహ్చ్ డీ డాక్టర్
చెప్పులు అమ్ముకునే లెక్కల మాస్టర్
ఇలా చెప్పుకుపోతే భవిష్యత్తేదీ
విద్యార్ధులకి విద్యని బోధించేదెవరు
అలుపెరుగని పయనమనాలా
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనాలా
విధి వంచితులనాలా
ప్రభుత్వాలకి పట్టని బడుగులనాలా
ఒక టీచర్ బెల్ట్ షాపులు కాపలా కాయమనే
గొప్ప నిర్ణయం తీసుకునే ప్రభుత్వ పాలనలో
ఇంతకుమించి గతి తప్పకూడదీ బతుకుబండి.
భవిష్యత్తరాలకేం చెప్పాలి
పతనమైన బోధన రంగం కోసం
చదివిన చదువులు చెట్టెక్కించి
పొట్ట చేత పట్టుకుని పోతున్న
భవిష్యత్తరాల మార్గదర్శులకోసం
మాకు పట్టదని అలసత్వం చూపబడిన
ప్రభుత్వ సాయం పొందలేని టీచర్లకోసం
బ్రతుకులు ఛిద్రమై జీవిస్తున్న
గతి తప్పిన జీవఛ్ఛవాలకోసం
ఏం చెప్పాలి ఎంత చెప్పాలి
కరోనా సృష్టించిన కరాళ నృత్యం కోసం
బలైపోయిన గురువులకోసం.
– ఉమామహేశ్వరి యాళ్ళ