బరువైన గుండె గాయం
సరిగ్గా చదువుపై మక్కువ చూపని తన గారాల కూతురికి తన తల్లి చెప్పింది ఇలా.. చిట్టి తల్లీ నువ్వు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి అని..
ఆ అమ్మాయి నాటి నుండి ఎంతో పట్టుదలతో చదువులో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ జీవితంలో నాకు స్థానం ఉంటుంది అనే నమ్మికతో ఉండగా.. పై చదువులు చదివించలేము అని తండ్రి మాట తూటలా తన గుండెల్లో గుచ్చుకుంది…
తండ్రికి తోడుగా తల్లి కూడా అవును అమ్మ నువ్వు ఇంకా పై చదువులు చదివితే అంత కన్న చదువుకున్న అబ్బాయిని తెచ్చి నీకూ పెళ్లి చేసే స్తోమత మాకూ లేదు బిడ్డ అని ఆ తల్లిదండ్రులు చెప్పటంతో ఆ అమ్మాయి గుండెకు ఎంతో భారంగా అనిపించింది..
పెళ్లి అయ్యాక నీ భర్త చదివిస్తే చదువుకో అంత వరకూ ఈ చదువు ప్రస్తావన ఎత్తకు బిడ్డ అని చెప్పటంతో ఆ అమ్మాయి గొంతు మూగబోయింది..
పెళ్లి అయ్యాక చదువుకుంటాను అంటే ఆ అత్తమమాలు ఏంటి చదివించడానికా నిన్న మా ఇంటి కోడలిగా తెచ్చుకున్నది అని అన్న మాటతో పూర్తిగా మౌనం అయింది ఆ అమ్మాయి…
తన భర్తని అడిగింది నన్ను ఎవరికి తెలియకుండా చదివించండి ఆ చదువు మన జీవితానికి కూడా ఉపయోగపడచ్చు అని.. అందుకు తన భర్త సమాధానం ఇంకో సారి చదువు చదువు అంటే నన్ను వదిలించుకోవాలి అని…
ఇక ఆ అమ్మాయి మనసు చచ్చిపోయింది…
చదువు గొప్పతనం చెప్పిన తన తల్లే సహాయం చేయలేదు ఇక మిగతా బంధాలు ఏం చేస్తాయి… జీవితంలో చదువు ఎంతో గొప్పది అని చెప్పి చదువు పై లేని మక్కువ కల్పించి భవిష్యత్తు పై ఆశలు పెంచుకొని తనకంటూ ఓ గుర్తింపు ఉండాలి అని ఆ అమ్మాయి గట్టిగా నమ్మిన తరువాత ఇలా బంధాలు తన కాళ్లకు సంకెళ్లు అయ్యి మనసులో ఆశలు ఆవిరై ప్రాణం ఉన్న శిల ఓ మర బొమ్మ అయింది..
– కళ