అత్యాశలు
సామర్ధ్యం గుర్తించక భ్రమలోనే బ్రతికేస్తూ…
ప్రగల్భాల కబురులెన్నొ అలవోకగ పలికేస్తూ…
అందరాని తీరాలను అవహేళన చేసేస్తూ…
అంతా నీ గొప్పేయని అహంకరించి విర్రవీగుతూ….
పెద్దరికము చిన్నరికపు అంతరాలు మరిచేస్తూ…
మాటల మాటున దాగిన పొగరును చూపిస్తూ…
అత్యాసల పరుగులలో సహనమన్నది కోల్పోతూ…
ఉరుకుల పరుగులు పెట్టేవు ఏ తీరాలకి చేరాలని….
భయమును భక్తినివిడనాడి చరించేవు…
సులభపు దారులు వెతికి అడ్డగోలుగ తిరిగేవు…
సత్యము ధర్మమ్ములు మరచిపోయినావు…
సత్యము కాకలేక కన్నులున్న అంధుడయినావు…
పగటిపూట కలలు కంటు కల్లలోన బ్రతుకుతు ఉన్నావు..
అత్యాశల దారుల్లో ఒంటరివై పయనిస్తున్నావు…
ఎండిన చెట్టుమాదిరి బంధువులెరుగని ఏకాకివైనావు…
గాలిమేడలెన్నొకట్టి చివరకు చతికిలబడినావు…
ప్రకృతి నిను నడుపునని..
సంస్కృతి నీ ఆరోగ్యమునకని…
సంప్రదాయము నిను భవితలొ నిలుపునని…
అత్యాసయె అగ్నికణమై నిను సాంతము దహించేయునని…
తెలుసుకుని మసలుకుంటు కనులు తెరువు మానవుడా!
– ఉమామహేశ్వరి యాళ్ళ