వైకుంఠపాళి -కథ
“అమ్మా.. నేను హైదరాబాద్ పోదామనుకుంటున్నా.”
“ఎందుకురా.. శానా కర్చయితది.. ఇప్పుడవసరమా?”
“ఇక్కడ ఉద్యోగాలు దొరకటం లేదు కదా.. మనూరి మనోహర్ అక్కడే ఉన్నాడు.. అడిగితే రమ్మన్నాడు”
“వాడంటే సినిమా పిచ్చితో పోయాడు.. నీ కెందుకురా అయ్యా. ఇక్కడ నీకేం కష్టమొచ్చింది.. మీ అయ్య ఎప్పుడో ఇల్లొదిలేసి పోయాడు. నువ్వు కూడా ఎల్తానంటే ఎలారా అయ్యా? “
దీనంగా అడిగిన తల్లి ప్రశ్నకు ఓబులేసు దగ్గర సమాధానం లేదు. అలాగని అసలు విషయం చెప్పలేడు.
“అమ్మా ఆర్నెల్లు టైమివ్వు.. ఉద్యోగం దొరికితే సరే. లేకపోతే తిరిగొచ్చేస్తా” తల్లిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు.
“నీ ఇష్టం రా అయ్యా.. నీకిష్టమైన జొన్న రొట్టె,చేపల పులుసు ఎట్టాను. తిందువు దా ” కొడుకు ఎల్లిపోయినట్టే అనిపించింది కనకమ్మకు..
ఎమ్.బి.ఏ. చదివిన ఓబులేసుకు సినిమా అంటే వ్యామోహం. ఏదోకరోజు సినిమా ఫీల్డ్ లో సెటిలవటం అతని లైఫ్ యాంబిషన్. కలలు కనటంతో మాత్రమే కోరికలు తీరవని తెలిసిన నవతరం యువకుడు.
ఓబులేసు భావుకుడు. రాస్తాడు. బాగా చదువుతాడు. తన ఆలోచనలను బ్లాగ్ లో పంచుకుంటుంటాడు. ఎమ్.బి.ఏ. చదువుతో పాటు స్క్రీన్ ప్లే రాయటం కూడా నేర్చుకుంటున్నాడు. మనోహర్ ఇప్పుడిప్పుడే జూనియర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకుంటున్నాడు.
ఓబులేసు కు రెండేళ్ల సీనియర్. అతను ఓబులేసుకు నడిసంద్రాన ఉన్నవాడికి దూరతీరంలా తోస్తుంటాడు. మనోహర్ కూడా చిన్నప్పటినుంచి ఓబులేసు టాలెంట్ ను చూస్తూనే ఉన్నాడు.
ఒకరోజున ఫోన్ చేసి చదువయిపోయింది కదా హైదరాబాద్ వస్తావా అని అడగటంతో కొంచెం ఆశ మిణుకు మిణుకుమనసాగింది. ఉద్యోగ ప్రయత్నాలు, సినిమా ప్రయత్నాలు రెండూ చేసుకోవచ్చని ఆశ పడ్డాడు. అదేమాట తల్లికి చెప్పాడు. కొడుకు కోరిక కాదనలేక పోయింది..
ఇది నాలుగు నెలల నాటి కథ.
ఈ నాలుగు నెలల్లో ఓబులేసు చాలా నేర్చుకున్నాడు. మొదట్లో మనోహర్ వెంట వెళుతుండేవాడు. అవకాశాలు దొరుకుతుంటాయేమోనని. జూనియర్ ఆర్టిస్ట్ సప్లయిర్ తో ఉండే కష్టాలు చూసి నిరుత్సాహ పడ్డాడు.
దీనికే డల్ అయిపోతే ఎలా మిత్రమా అని బుజ్జగించాడు. ఈలోగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఒక ఫుడ్ డెలివరీ యాప్ లో డెలివరీ పార్టనర్ గా ఛాన్స్ దొరికింది. వెహికల్ ఉందా అంటే సైకిల్ ఉందన్న ఆప్షన్ ఇచ్చాడు. అదికూడా మనోహర్ ది.
“ఏంటి ఓబూ, డెలివరీ బాయ్ గా వెళతావా” ఆశ్చర్యపడుతూ అడిగాడు మనోహర్. నీ స్ట్రగుల్ చూస్తుంటే ముందర నాకేదయినా చిన్న ఉద్యోగమయినా ఉండాలని అవసరమయింది. నువ్వెలాగూ వాడటం లేదు కాబట్టి నీ సైకిల్ ఇవ్వు చాలు” ఓబులేసు రిక్వెస్ట్ కు నిశ్చింతగా వాడుకో అంటూ భుజం తట్టాడు మనోహర్.
మూడునెలల పాటు సైకిల్ పై తిరుగుతూ ఆర్డర్లు డెలివరీ చేస్తుంటే అపార్ట్మెంట్ సెక్యూరిటీ వాళ్ళు జాలిగా చూసేవాళ్ళు. ఏందన్నా ఇట్ల తిరుగుతున్నావంటూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళు..
ఆర్డర్లు డెలివరీ చేస్తుంటే రకరకాల మనుషులను చూసేవాడు. నిలబెట్టే ఏంతెచ్చాడో చెక్ చేసుకునే వాళ్ళు, లేటయిందని రుసరుసలాడేవాళ్ళు, జాలితో టిప్ ఇచ్చే వాళ్ళు, కొట్లాడుకుంటూ తలుపుతీసేవాళ్ళు.. ఇవన్నీ చూశాక ఇంటింటి భాగోతం అని చిన్న వీడియో స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు.
అతనికి ఆ లొకాలిటీ అలవాటయిపోయింది. కొంతమందిప్పుడు గుర్తు పడుతున్నారు. ఓబులేసు సైకిల్ పై ఆర్డర్లు డెలివరీ చేయటం చూసిన కొందరు “సైకిలేసు” అని నిక్ నేమ్ పెట్టారు.
ఎల్లకాలం ఇలాగే ఉండిపోవటమేనా.. సినిమా పార్టనర్ షిప్ పోయి, డెలివరీ పార్టనర్ షిప్ మిగిలిందే అని దిగులు పడుతుంటే అనుకోని సంఘటన అతని జీవితంలో మెరుపు లా మెరిసింది..
ఆరోజు కూడా ఉదయాన్నే టిఫిన్ ఆర్డర్లు డెలివరీ చేయటం కోసం కైలాస్ మౌంటెన్ అపార్ట్మెంట్ లోకి వెళ్ళగానే అంబులెన్స్ ఆగుండటం చేసి అక్కడికి వెళ్ళాడు. 404 అపార్ట్మెంట్ లో ఉండే అతన్ని గుర్తుపట్టాడు ఓబులేసు.
“ఏమయింది సర్ ఎనీ ప్రాబ్లమ్” దగ్గరకు వెళ్లి అడిగాడు.
“నా వైఫ్ డెలివరీ టైం..పెయిన్స్ వస్తున్నాయి. A+ve గ్రూప్ రక్తం కావాలి. ఓ ఫ్రెండ్ వస్తానని రాలేదు. హాస్పిటల్ వాళ్ళకు బ్లడ్ రీప్లేస్ చేయాలి. టెన్షన్ గా ఉంది “
“సర్ జీ.. మీరేమి అనుకోకపోతే నేనొస్తాను పదండి.. నాది ‘A’+ve బ్లడ్ గ్రూపే..”
“అంతకన్నానా బాస్.. ఈ అడ్రస్ కు వస్తారా.. ఎలా వస్తారు..” సందేహంగా అడిగాడు అతను.
“నా సైకిలుంది సర్.. మీ వెనకే ఉంటాను.. పదండి. ఇలా బ్లడ్ ఇవ్వటం నాకలవాటే” ధైర్యం చెప్పి కదిలాడు.
ఫుడ్ డెలివరీ యాప్ వాళ్ళ బ్లేజర్ తో బ్లడ్ ఇవ్వటానికి వచ్చిన ఓబులేసును చూస్తే ఆశ్చర్యమనిపించింది హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు వారికి. వెనకున్న కథ తెలిసిన బ్లడ్ బ్యాంకు పి ఆర్. ఓ. ఓబులేసును వీడియో లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ప్రాణం నిలబెట్టిన డెలివరీ బాయ్ అన్న ఆ వీడియో వైరల్ అయింది. చివరికది ఫుడ్ డెలివరీ యాప్ టాప్ బాస్ లకు చేరింది. మళ్లీ అక్కడనుండి కిందవాళ్ళకు ఆ వీడియో చేరగా.. అతని హానెస్టీని సంస్థ కు వాడుకోమని ఆదేశాలు జారీ అయ్యాయి.
లోకల్ మేనేజర్ లోకేెందర్ ఓబులేసును వెతికి పట్టుకొని పిలిపించాడు. ఓబులేసును కాసేపు ఇంటర్వ్యూ చేశాడు. ఓబులేసు ఎమ్.బి.ఏ. చదివాడంటే ఆశ్చర్యపడ్డాడు. సినిమా అంటే పేషన్ అని తెలిసి మరీ విస్తుబోయాడు.
ఒక్క నిమిషమాగమని పక్కకు వెళ్లి పైవాళ్ళకు ఓబులేసు గురించిన ఆశ్చర్య పోయే విషయాలు చెప్పగానే అటువైపునించి ఎగురుకుంటూ వచ్చిన ఎక్సైట్మెంట్ లోకేెందర్ చెవిలో పడింది. కంగ్రాట్స్ ఓబూ. ఓ లుక్కేసుకో .. వెన్నెల్లో పక్కేసుకో..
మరీ అలా చూడకు. ఫన్ కోసం పన్ అది. నీ సంగతి అంతా బాసులకు బాసుంది స్వీటులా అదిరిపోయే రేంజ్ లో చెప్పాను.. నీవలన మన యాప్ సబ్స్క్రయిబర్స్ పెరిగారు. ఆర్డర్లు పెరిగాయి. డెలివరీ పార్టనర్ నుంచి యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా నీకు ప్రమోషన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు.
నువు రాసుకున్న వీడియో స్క్రిప్ట్ ని బ్లాగ్ లోంచి చదివారు.. దాన్ని మన ప్రమోషనల్ వీడియో గా తీయమన్నారు.. నీకో బైక్ కొనివ్వమన్నారు.. కంగ్రాట్స్.. ఇన్ని తీపి కబుర్లతో లోకేెందర్ షేక్ హేండిస్తుంటే మొదటిసారి ఓబులేసును నిచ్చెనెక్కించిన జీవిత వైకుంఠపాళి మనసారా నవ్వింది.. పాముల నోట్లో పడకుండా సాగటం అతను నేర్చుకుంటాడనుకుంది
– సి. యస్. రాంబాబు