అప్పగింతలు
కాలచక్రం బాటలో అలిసిపోయిన
కాలిచక్రాలు ఆగమంటుంటాయి
వెనక్కి తిరిగి చూస్తానా
తిరిగి రాని లోకాలకు తరలివెళ్ళినవారంతా
తారలై మెరుస్తుంటారు
మసకబారిన కన్నులపై జ్ఞాపకాల పుప్పొడి
కరిగిపోయే మంచుశిఖరంలా జీవితం తుది అంచుకు చేరుతుంది
కోపాలు శాపాలు లోపాలు మురిపాలు కలిసికట్టుగా నవ్వుతుంటాయి
ఏం సాధించావని తలెగరేస్తావని
తోడులా నిలిచిన కుటుంబాన్ని
మీగడలా మెసలిన మిత్రులను
నా కలలమేడకు మెట్లులా కట్టిన
అమ్మానాన్నలని తలుచుకోనందుకో
వారిలా నన్ను మలచుకోనందుకో
మాటరాక మౌనంతో సహజీవనం చేస్తున్నాను
చరమాంకంలో చెదలు పట్టక
పట్టుతప్పిన జీవితాన్ని అదుపులోకి తెస్తుంటే
మాఘమాసపు మంచులా కాలం కాసేపు ఘనీభవించింది
అప్పగింతలు చెప్పుకోమని
– సి. యస్. రాంబాబు