అన్వేషి

అన్వేషి

వెతుకుతుంటాను నిరంతరం
మానవనాగరికత బాటవేసిన మనిషిని!
పరిమళమై
వ్యాపించిన మానవత్వాన్ని!
పురాతన మనుషులు వారంతా
వెక్కిరించాడొక మిత్రుడు!
మారుతున్న కాలంతో మారని మనిషికి నువ్వంటు
భృకుటి విరిచాడు!

కాల ప్రవాహానికి కదిలిపోవటమే తెలుసు
మారటం మార్చడం
మనిషి చేసే పని కదాని
నిట్టూర్చాను!
కాలాన్ని వెనక్కి తిప్పలేనట్టే
మార్పు చూపును తిప్పలేము
రెండూ సాగిపోతుంటాయి!
రెప్పలార్పుతు మనిషి మాత్రం
అవసరాన్ని ఆసరా చేసుకుని
అధికారం చెలాయిస్తాడు!

నిరీశ్వరవాదంలా నీది నిరాశావాదం
అన్నాడు మళ్ళీ మిత్రుడు!
వెనక్కిలాగే మనసును
ముందుకు నడిపించలేని మీరంతా
ముందుచూపులేనివారేనంటూ దెప్పిపొడిచాడు!
నిలువెల్లా కప్పేసిన సాంకేతికత
యాంత్రికతను గుమ్మరించేయగా
మనిషితనంతో నవనవలాడే మనిషి
కనబడలేదని
దిగులు మేఘమై కూలబడకని
వచ్చే వాతావరణ హెచ్చరిక
మనిషిని మార్చే ఋతుపవనాలను
వెంటతెస్తుందన్న ఆశ
నన్నో నిరంతర అన్వేషిని చేసిందని
చెప్పాలని ఉన్నా
చెప్పక తప్పుకున్నాను
తప్పు తెలుసుకుంటాడన్న ఆశను
నింపుకుంటూ!

– సి. యస్. రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *