అన్వేషణ సాగింపు
కనులకు దొరకని రూపంతో
కమనీయాలకు కనువిప్పుకాదు…
కాలం స్థబ్ధత నీవెరిగిన నిబద్ధత
దాసోహం కావాలి…ప్రతిక్షణాన్ని కాలం
సంధించిన అస్త్రాలే…నీజీవితాన్ని
నడిపించిన ఆగమనాలు…ఆగమంటే
ఆగదు అందరి చావు పుట్టుకలు తెలిసిన
మర్మం పరిస్థితి వైతరణిని ఈదినంతటి
కష్టమైనా నీతో చెప్పని…నిగర్వి ప్రయాణం…
యుగ ప్రభావాలకు లొంగని
తన్మయత్వం… బహుమానంతో ఎంత
దూరమో ఆ అన్వేషణా సాగింపు…
యుగ సత్కారాలను విస్తరులో వడ్డించుకొని
నూతన ఆవిర్భావాలను కలి మాయగా
తాగుతు…లోకం వింతలు తర్పణాలైనా…
చరాచర సృష్టి స్థితిలయాలు తనలోనివే నని
అహంకారపు అడుగులు తానై బలిగొన్న
మృత ఖండాల దేహాలను లెక్కించదు…
నిరాకార రూపం నిమగ్నమై నిత్యం నీతో
నడిచే నవచైతన్యం నిర్ణయం మరువని బహుదూరాలతో అలుపని క్షణమాగదు…
ఆగిన సమయంగా తల వంచినదై ఆనాటి
పతివృతల పాదాలకు నమస్కరించెను
తప్పా…తిరిగి చూడని వీరత్వం ఆయువు
తెలియని అమరత్వం ఆయుధం లేని
రణరంగాన నిత్య హోమాలను సలుపుతు
సత్య సందేశాలను తెలుపుతున్న ఆగని
అచంచలం…
ఆగిపోతుందను కోకు…ఆపాలని
ప్రయత్నించకు నీ ఆలోచనల ఫలితం
ఫలించి ఆగితే…పరినామం మరణం లేని
మనిషిగా భూమికి భారమై మనస్సుల
మానవత్వం మసిబూసుకొన్నదై నడిచిన
నాలుగు పాదాలు ధర్మాన్ని నాశనం చేస్తు
భయ భక్తులను మరిచిన ధోరణి ప్రపంచాన
రాక్షసత్వమై శాసనాలు ఉల్లంఘనలై
దేహాలు వాంచలకు ప్రణాలికలవుతు…
వివరణ దొరకని నిర్వచనం లోకాన రెక్కలు
విప్పుకొని చూస్తుంది…గడిచే కాలాన్ని
-దేరంగుల-భైరవ