అనురాగం
అమ్మా నేనోచ్చేసాను అంటూ లోపలికి అడుగు పెట్టిన ప్రీతి అక్కడ ఇంట్లో ఉన్న కొత్తవారిని చూసి ఆగిపోయింది. ఏంటమ్మా అలా ఆగిపోయావు. పర్లేదు రా లోపలికి వీళ్ళు మన దూరపు బంధువులే అమ్మా, అంటూ తండ్రి దశరథ్ ప్రీతి దగ్గరగా వచ్చాడు భుజం పై చేయి వేసి ఇదిగోరా నరేందర్ ఇదే నా ఒక్కగానొక్క కూతురు ప్రీతి, ఇక్కడే కాలేజీ లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది అంటూ అమల అమ్మాయిని తీసుకుని వెళ్ళు అన్నాడు. రామ్మా ప్రీతీ అంటూ తల్లి అమల ప్రీతి ని తీసుకుని లోపలికి వెళ్ళింది.
ఆ కాసేపట్లోనే ప్రీతికి అర్థమైంది అవి పెళ్లిచూపులు అని. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని డిగ్రీ అయిపోయి ఏదైనా ఉద్యోగం చేస్తాను అని తల్లితో ఎప్పుడో చెప్పింది అయినా మళ్ళీ ఇలా పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేశారో నాన్నగారు అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్లి తల్లితో ఏంటమ్మా ఇది నాకు అప్పుడే పెళ్లి వద్దని చెప్పాను కదా మీకు అయినా ఎందుకిలా చేస్తున్నారు అంటూ అడిగింది తల్లిని కోపంగా ప్రీతి.
నీ మొహం వాళ్లొచ్చింది పెళ్లి చూపులకు కాదు. ఆయన మీ నాన్నగారి చిన్ననాటి మిత్రుడు. చాలా రోజులకు వాళ్లు మన ఇంటికి వచ్చారు. నీ మొహానికి ఇప్పుడే పెళ్లి ఏంటి పెళ్లంటే మాటలు అనుకున్నావా నీ పెళ్లికి మేము ఇంకా చాలా సంపాదించాలిలే. నువ్వు చేయమన్నా ఇప్పుడు చేసే పరిస్థితిలో మేము లేము అంది విసుక్కుంటూ అమల.
తానేదో కొప్పడాలని అనుకుంటే తననే కోప్పడుతున్నారు అని అనుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది ప్రీతి. ఆ తర్వాత కాసేపటికి హాల్లోంచి మళ్లీ ప్రీతీ అంటూ పిలుపులు వినిపించాయి తాను ఫ్రెష్ అప్ అయ్యి మామూలు డ్రస్సులోకి మారిన ప్రీతి వాళ్ళ ముందుకు వచ్చింది. అమ్మ ప్రీతి మా స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు ఒకసారి నీతో చెప్పి వెళ్లాలని పిలిచారు అంతే చదువుకుంటున్నావా డిస్టర్బ్ చేశానా అంటూ అడిగాడు తండ్రి దశరథ్.
అయ్యో అదేం లేదు నాన్న పర్లేదు… నమస్తే అంకుల్ సారీ మీ గురించి ఏమీ తెలియదు ఇప్పుడే మా అమ్మగారు చెప్పారు ఎప్పుడైనా వస్తూ ఉండండి అంకుల్ అంటూ నమస్కరించింది ప్రీతి. మహాలక్ష్మిలా ఉన్నావ్ బాగా చదువుకో అమ్మా అంటూ చెప్పి అంటూ వాళ్లు వెళ్లిపోయారు.
*********
సంవత్సరం తర్వాత కొత్తగా జాబ్ లో జాయిన్ అయింది ప్రీతి. డిగ్రీ చదివేటప్పుడే క్లర్క్ పోస్టులు పడడంతో అప్లై చేసి పరీక్షలు రాసింది దాంతో లక్కీగా తనకి ఉద్యోగం వచ్చింది. తాను అనుకున్నది సాధించాలనే సంతోషం ప్రీతికి కలిగింది.
ఆరోజు సాయంత్రం ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన ప్రీతితో దశరథ్ గారు, ప్రీతి ఇలా రామ్మా నీతో మాట్లాడాలి అంటూ పిలిచారు. ఏంటి నాన్న ఏదైనా అర్జెంటా అంటూ ప్రీతి వచ్చి సోఫాలో కూర్చుంది.
అమ్మ ప్రీతీ ఇన్నాళ్లు నీ చదువు ఉద్యోగం అంటూ ఆగాను కానీ ఇప్పుడు నీ చదువు ఉద్యోగం అన్నీ వచ్చాయి నువ్వు అనుకున్నది సాధించావు ఇక నీకు పెళ్లి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది ఏమంటావమ్మా అన్నారు దశరథ్ గారు.
అదీ నాన్న అంటూ ప్రీతి నసగసాగింది. ఏంటమ్మా ఎవరైనా ప్రేమించావా ప్రేమిస్తే చెప్పు వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి చూస్తాను అన్నారు దశరథ్ గారు.
అవును నాన్న నేను డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు వినయ్ ని ప్రేమించాను తను కూడా నాతో పాటుగా పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. వారిది మంచి కుటుంబం నాన్న మీకు అడ్రస్ ఇస్తాను వెళ్లి మాట్లాడండి అంది ప్రీతి ధైర్యంగా.
ఏంటి ఎవర్నో ప్రేమించి ఇప్పుడు చెప్తున్నావా అంది తల్లి కొంచెం కోపంతో…. నువ్వు ఆగు అమల ప్రీతి చెప్తుంది కదా తను ప్రేమించిన వాడికే ఇచ్చి చేద్దాం. మంచివాడు అయితే అదే చాలు కదా మన అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు అన్నారు దశరథ్ గారు అమలని ఆపుతూ.
సరే మీరు మీరు ఒకటి అనుకున్నాక, నేను అనేది ఏముంది. కానివ్వండి అంది. అనుకున్నట్టుగా దశరథ్ గారు వెళ్లి మాట్లాడడం వాళ్లు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో ఇరు పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి ప్రీతి వినయ్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
********
వివాహం జరిగిన మరుసటి రోజు రాత్రి వాళ్ళ మొదటి రాత్రికి ఏర్పాట్లు చేసి మిగిలిన వారంతా విడిది ఇంట్లో పడుకున్నారు. అందంగా అలంకరించిన పానుపుపై తెల్లని మల్లెలతో గుబాలిస్తూ ఉండగా దేవకన్యలా అలంకరించుకున్న ప్రీతి స్వచ్ఛమైన పాలన చేతితో గ్లాసులో పట్టుకొని గదిలోకి అడుగు పెట్టింది.
ఆమెను చూసిన వినయ్ ఇన్ని రోజులు లేని సిగ్గు ఇప్పుడు వచ్చిందేంటి అన్నాడు పాల గ్లాస్ అందుకుంటూ, ప్రీతి సిగ్గుగా కళ్ళని పైకెత్తి చూస్తూ వినయ్ తో ఏంటో వినయ్ పెళ్లి అవగానే ఇలా సిగ్గు పడడం అమ్మాయిలకి సహజంగా వస్తుంది ఏమో అంది.
అమ్మాయి గారు సిగ్గును కాస్త దాచుకోండి ఇంకా ముందు ముందు పడుతూ ఉండాలి కదా అంటూ పాల గ్లాస్ తన నోటికి అందించాడు. తాను సగం తాగి మిగిలిన సగం అతనికి ఇచ్చింది ప్రీతి. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం మామూలుగా కాకుండా ఎంతో అందంగా జరిగిపోయింది. తమ అనురాగ సంగమానికి గుర్తుగా వినయ్ తన వేలికున్న ఉంగరాన్ని తీసి ప్రీతి వేలికి తొడుగుతూ ఎలాగైతేనేం ఇష్టపడిన నిన్ను కష్టపడి దక్కించుకున్నాను అన్నాడు ప్రీతిని ముంగురులు సర్దుతూ.
ఏంటి వినయ్ ఏం మాట్లాడుతున్నావ్ ఇష్టపడిన నన్ను అంటున్నావ్ కష్టపడి అంటున్నావ్ నాకేం అర్థం కావడం లేదు సరిగా చెప్పు అంది. ప్రీతి నీకు గుర్తుందా నువ్వు డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా మీ ఇంటికి మీ నాన్నగారి మిత్రుడు ఒకరు వచ్చారు అన్నాడు వినయ్. హా అవును అవును గుర్తుకొస్తుంది మా నాన్నగారి మిత్రుడు చాలా కాలం తర్వాత కలవడానికి వచ్చారని మా అమ్మగారు చెప్పారు అయితే ఇప్పుడు ఏమైంది అంటూ అడిగింది.
పిచ్చి మొహం అప్పుడే కదా నిన్ను చూసింది అన్నాడు వినయ్. ఏంటి అప్పుడు నువ్వు కూడా వచ్చావా నేను సరిగా గమనించనేలేదు అంది ప్రీతి. మీరు ఎక్కడ గమనించే స్థితిలో ఉన్నారు అమ్మాయి గారు మీ దృష్టి అంతా చదువు, ఉద్యోగం మీదే ఉంది కానీ నా దృష్టి మాత్రం నీ పైన ఉంది ఎలాగైనా నేను దక్కించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.
అందుకే నేను చదివే కాలేజీ నుండి మారి నీ కాలేజీలోకి చేరాను అలాగే నీతో మాటలు కలుపుతూ పరిచయం ప్రేమ పెంచుకున్నాను ఆ తర్వాత నీతో పాటే పరీక్షలు రాసి, నీతో పాటే ఉద్యోగం కూడా సంపాదించాను. నిన్ను దక్కించుకోవడానికి నేను ఎంత ప్రయాసపడ్డానో ఒక్క నాకే తెలుసు ఆ తర్వాత జరగాల్సిన విషయాలన్నీ జరిగాయి.
ఈ అపరంజి బొమ్మ నా జీవిత భాగస్వామి అయింది అంటూ తిరిగి ప్రీతిని గుండెలకు హత్తుకున్నాడు వినయ్. తనకోసం తన ప్రేమ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన వినయ్ తన భాగస్వామి కావడం తన అదృష్టంగా భావించిన ప్రీతి అతన్ని లతలా అల్లుకుపోయింది…
– భవ్య చారు