అనుకోని ప్రయాణం సమీక్ష
అనుకోని ప్రయాణం అంటే ఏదో మామూలు సినిమా నేమో అని అనుకున్నాను కానీ ఇది మనసుకు హత్తుకునే సినిమా అని మొదలైన కాసేపట్లోనే అర్థమైంది. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ఊర్లో నుంచి భువనేశ్వర్ కి వలస కార్మికులుగా వచ్చిన కొందరి జీవిత కథనే అనుకోని ప్రయాణం.
ఈ అనుకోని ప్రయాణంలో మొదటగా మనకి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు, ధన్ రాజులను చూపిస్తూ వారి జీవితంలో ఉన్న ఎత్తుపల్లాలను మనసుకు కదిలించేటట్లు చూపించారు. నరసింహారాజు, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ స్నేహితులు. ఒకే గదిలో ఉంటూ భువన కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు వాళ్లంతా ఒక కాలనీలోని వివిధ గదుల్లో నివాసం ఉంటారు అయితే రాజేంద్రప్రసాద్ కి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉండదు కానీ నరసింహ రాజుకు మాత్రం కుటుంబం ఉంటుంది ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్లుగా చూపిస్తారు.
ఆమె తన కొడుకుతో ఇప్పుడు తల్లి వద్దకు చేరింది ఆమె బాధ్యత కూడా ఇప్పుడు ఆమెతోపాటు ఆమె కొడుకు అంటే మనవడి బాధ్యత కూడా నరసింహారాజు తీసుకున్నాడు. రాజేంద్రప్రసాద్ మనస్తత్వం ఎలాంటిదంటే పెళ్లయితే అన్నీ బాధలు వస్తాయి పెళ్లి కాకపోతే సింగిల్ గా ఉంటే ఏంతో సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాడు కానీ నరసింహారాజు మాత్రం కుటుంబం అంటే బాధ్యతలే కాదు బంధాలు కూడా ఉంటాయి ఆత్మీయత అనురాగం ప్రేమ లాంటివి అన్నీ అనుభవించాలి మనిషన్నవాడు అని ఉద్దేశంతో రాజేంద్రప్రసాద్ కి పెళ్లి చేసుకోమని చెప్తూ ఉంటాడు.
వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత చాలా బాగా అనిపిస్తుంది. మందు తాగడం పూర్తవగానే ప్రతిసారి రాజేంద్రప్రసాద్ అతన్ని ఎత్తుకొని వెళ్లి పడుకోబెట్టడం అనేది మనకు ఎందుకు పెట్టారు అని అనిపిస్తుంది కానీ తర్వాత సినిమాలో అది ఎందుకనేది తెలిసిపోతుంది. మరోవైపు ఓ రోజు పొద్దున్నే ధనరాజ్ కి ఫోన్ వస్తుంది నీకు పాప పుట్టింది అని సంతోషంతో ఆ విషయాన్ని రాజేంద్రప్రసాద్, నరసింహ రాజులతో షేర్ చేసుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే కరోనా జనతా కర్ఫ్యూ అనేది మొదలవుతుంది.
అప్పుడు ఆ భవన యజమాని వాళ్లందర్నీ పంపించేయమని కాంట్రాక్టర్ కి చెప్తాడు కాంట్రాక్టర్ అందరికీ డబ్బులు సెటిల్ చేసి వాళ్ళందర్నీ పంపించే సమయంలో కొన్ని అనుకోని కారణాలవల్ల ధనరాజ్ చనిపోతాడు. ఆ విషయం రాజేంద్రప్రసాద్ నరసింహారాజులను చాలా కదిలించి వేస్తుంది. అప్పుడు నరసింహ రాజు ఇలా నేను పుట్టిన ఊరు కాకుండా వేరే ఎక్కడా చనిపోలేను నేను పుట్టిన ఊర్లో నా వారి మధ్య చనిపోవడమే నాకు ఇష్టం. నాకు చావు అంటూ వస్తే అది నేను పుట్టిన ఊర్లోనే జరగాలి అని చాలా భావోద్వేగంగా రాజేంద్ర ప్రసాద్ కి చెప్తాడు.
అయితే కాంట్రాక్టర్ చెప్పినా కూడా వీళ్ళు రెండు రోజులు భువనేశ్వర్ లోనే మిగిలిన పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఊరు బయలుదేరుతారు నీకంటూ ఎవరూ లేరు కదా నువ్వు నాతో పాటు మా ఊరికి వచ్చేయ్ అని నరసింహ రాజు రాజేంద్రప్రసాద్ తో అంటాడు నేను రాలేను రా అని రాజేంద్ర ప్రసాద్ అన్నా కూడా సరే నీ ఇష్టం అని అనడంతో రాజేంద్రప్రసాద్ నరసింహరాజు ని బస్సు ఎక్కించడానికి బస్టాండ్ కి తీసుకు వెళ్తూ మధ్యలో ఒక మద్యం షాప్ దగ్గర ఆగి ఎలాగో విడిపోతున్నాం కాబట్టి చివరిసారి మందేద్దాం అంటాడు.
అప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని తాగుతుంటారు కొంచెం ఒక పెగ్గు తాగగానే నరసింహారాజు ఎడమ వైపు ఛాతిలో నొప్పి వస్తుంది అని అంటూ అలాగే పడిపోతాడు. ఏమైంది అనుకుంటూ రాజేంద్రప్రసాద్ పక్కనే ఉన్న క్లినిక్ దగ్గరికి నరసింహ రాజును తీసుకొని వెళ్తాడు ఆ క్లినిక్ డాక్టర్ అతను చనిపోయాడు అని నిర్ధారిస్తాడు అప్పుడు రాజేంద్రప్రసాద్ పడే ఆవేదన మనల్ని ఎంతగానో కదిలించి వేస్తుంది.
అప్పటివరకు తనతో ఉన్న మిత్రుడు హఠాత్తుగా అలా చనిపోవడంతో ఏం చేయాలో తోచని రాజేంద్ర ప్రసాద్ కి తన స్నేహితుడు అన్న మాటలు గుర్తుకు వస్తాయి నా ఊరి వాళ్ళందరూ చివరిసారి నన్ను చూడాలి. నేను పుట్టిన నేల మీదనే నేను పెరిగిన ఊర్లోనే నేను చచ్చిపోవాలి అనే ఆ కోరిక తీర్చాలని రాజేంద్రప్రసాద్ నిర్ణయం తీసుకుంటాడు.
అతను అలా నిర్ణయం తీసుకోవడంతో నరసింహారాజుని ఆ కరోనా సమయంలో కర్ఫ్యూలో బయటకు ఎవరు కనిపించవద్దు అనే ఆర్డర్స్ ఉండడంతో ఎలా అతని ఊరికి చేర్చాడు. అయితే ఇలా ప్రయాణం చేసే సమయంలో అతన్ని ఎన్నో రకాలుగా తీసుకు వెళ్లడం చాలా బాధగానూ విచిత్రంగానూ అనిపిస్తుంది. టైరు సీన్ అయితే మాత్రం చాలా ఉద్వేగంగా అనిపిస్తుంది అలాగే కరోనా సమయంలో ఇలా చనిపోయిన వారిని తీసుకువెళ్ళిన వారు నిజంగా ఎంత బాధకి గురయ్యారో మనము ఈ చిత్రంలో చూడవచ్చు. ఇక తన మిత్రుని చివరి కోరికను ఎలా తీర్చాడు అనేది కథ.
ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది నరసింహారాజు నటన గురించి ఆయన గత సినిమాల్లో మంచి హీరో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల శక్తి గలవారు. ఒక శవంలా నటించాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. ఎంతోసేపు ఊపిరి ఆపుకుంటూ నటించాలి. అలాగే అతని మోసే పాత్రలో కూడా రాజేంద్రప్రసాద్ గారు నటకిరీటి అనే బిరుదును ఏమాత్రం తగ్గించలేదు అని చెప్పడంలో సందేహం లేదు.
ఈ సినిమాలో ఏ ఒక్క పాత్ర తక్కువ కాదు ఎక్కువ కాదు అన్ని తమ తమ పరిధిలో మేరకు నటించారు. కాకపోతే ఒకటి నిరాశని కలిగించింది ఏంటంటే ధనరాజ్ కుటుంబం ఏమైంది అతన్ని ఎలా తీసుకువెళ్లారు అనేది చూపించకపోవడం అనేది కాస్త నిరాశ కలిగించింది. అలాగే చివరికి హీరొయిన్ అయిన ప్రేమని, రాజేంద్రప్రసాద్ ని ఒకటి చేయకపోవడం కూడా కొంచెం నిరాశ కలిగించింది.
సినిమా చూస్తున్నంతసేపు అక్కడ అందులో మనం లీనం అయిపోతాం. ఆ భావోద్వేగాలు మనల్ని కట్టిపడేస్తాయి. మనకు మనమే అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఎంతో ఉద్వేగంగా చూస్తూ ఉంటాం. ఒక్కొక్క సంఘటన దగ్గర ఏడుపు కూడా వస్తుంటుంది. పాటలైతే చెప్పనవసరం లేదు చాలా బాగున్నాయి ఆ పాటలు వింటుంటేనే ఒక ఆవేదన మనకు వస్తూ ఉంది.
మొత్తానికి ఈ అనుకొని ప్రయాణం మంచి అనుభూతిగా మిగిలిపోతుంది. వచ్చేటప్పుడు ఏమి తీసుకురాం, పోయేటప్పుడు ఏమి తీసుకువెళ్లం, అలాగే మంచి మిత్రుడు కూడా ఉండాలి వాడి కళ్ళను చూసి వాడేం ఆలోచిస్తున్నాడో చెప్పగలిగే ఒక్క మిత్రుడు ఉన్నా చాలు అనే సందేశం మనకు ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. మాటలు, నేపథ్య సంగీతం, పాటలు చాలా బాగున్నాయి. అలాగే చిత్రీకరణ కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఇందులో ఎలాంటి తప్పులు ఉన్నాయని వేలు పెట్టి చూపించలేం.
ఒక మనిషిగా ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు తెలిసిన వ్యక్తిగా సాటి మనిషికి సాయం చేసే గుణం ఉన్న మనిషిని కాబట్టి ఈ సినిమాకి రేటింగ్ అనేది నేను ఇవ్వలేను. ఎందుకంటే ఇలాంటి సమస్యలు మనం ప్రతిరోజు వార్తల్లోనూ, టీవీలోనూ చూస్తూ ఉన్నా వాళ్ళ స్థానంలో లేము కాబట్టి సమస్య వచ్చిన వారికే ఆ బాధ విలువ తెలుస్తుంది.
కానీ ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది అని అనడంలో సందేహం లేదు. జీవితం గురించి తెలుసుకోవాలి అనుకునేవారు ఒక్కసారి ఈ సినిమా చూస్తే జీవితం అంటే ఏంటి అనేది తెలుస్తుంది.
– భవ్యచారు