అనుకోకుండా…

అనుకోకుండా…

శీర్షిక: అనుకోకుండా సరళా, శివుడూ, నేనూ!

పొద్దున్న లేవగానే అనుకోకుండా మా ఆవిడకి ఐ.డీ.సీ పులియోగరే తినాలనిపిస్తే, సంచీ తగిలుంచుకు బజారు కెళ్ళాను.

హుషారుగా ఛెంగుఛెంగున అడుగులేసుకుంటూ, ‘కమాన్ కమాన్ కళావతీ!’ కూని రాగాలు తీసుకుంటూ మా ఇద్దరికి సరిపడా పులియోగరై కట్టివ్వమని చెప్పి, అంగడి వాడు పొట్లాలు కట్టే లోపల చిక్కని కాఫీ తాగేస్తే ఓ పనైపొతుంది అనుకొని, కాఫీ గ్లాసుతో అంగడి బైటున్న కట్ట మీద తిష్ఠ వేసా.

‘హలో గురూజీ!’ అని పలకరింపు, అదీ తెలుగులో వినబడ్డంతో, ఎవరబ్బా అని చూస్తే, నా మాజీ సహోద్యోగి శివరాం.

‘అరే! నువ్వా శివా! అనుకోకుండా భలే కలిసాం. రా! రా! కూర్చో. కాఫీ తెస్తా ఆగు.’ అని గబ గబా ఇంకో కాఫీ కప్పు పట్టుకొచ్చి శివ చేతిలో పెట్టా.

ఇంకేంటి కబుర్లు అని నేను అడిగేంతలోనే ‘దూర్వాసుడు మొన్న పొయాడు. మీకు తెలిసిందా!’ అన్నాడు. దూర్వాసుడంటే నాకు మాజీ మేనేజరు. సాత్వికుడే.

మేనేజర్లను విలన్లు చేసే ఆనవాయితీని కొనసాగిస్తూ మేము పెట్టుకున్న ముద్దు పేరు. ఆ పేరుకీ అతగాడి వాలకానికీ అసలు సంబంధం లేదు.

‘పోతాడనే టాక్కున్నాంగా! ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. చివరకి పోయాడనమాట!’ అన్నాను వేడి వేడి కాఫీ గుటకేస్తూ.

‘పోయేవాడు కాదు. అనుకోకుండా క్లైంటుకి అవసరమొచ్చి ఆన్సైటు పిలిపించుకున్నాడు. మొన్నే జూరిక్ పోయాడు. జీతానికి మూడు రెట్లట ప్యాకేజీ!’ చెప్పాడు చావు కబురు చల్లగా…

మూడు రెట్లా! కాకి రెట్టేసినట్టు అంత సులభంగా ఎలా సంపాయిస్తారబ్బా ఇలాంటి అవకాశాలు అనుకుంటూ ఉండగా ‘పులియోగరే పార్శిల్ రెడీ!’ అన్న పిలుపు వినబడ్డంతో లోపలికి దూరా.

బైటికొచ్చేసరికి సింగిల్ ఇడ్డెను సాంబారులో ముంచిన రెండు ప్లేట్లతో కనిపించాడు శివుడు. నన్ను చూడగానే కళ్ళెగరేస్తూ ‘ఇంద. ఓ పట్టు పట్టండి.’ అని ఓ ప్లేటు నా చేతిలో పెట్టాడు.

అలా ఇడ్డెను రెండు ముక్కలు సాంబారుతో జుర్రుకోగానే ‘ఇంకో విషయం. మొన్న నేనూ సరళా పెళ్ళి చేసేసుకున్నాం.’ అన్నాడు.

నెత్తిన బాంబు పడ్డట్టై ‘అదేంటి? దూర్వాసుడికి సెట్టైపోయిందిగా తను? వాడటు పోగానే పార్టీ మారిందా? ఐనా అంత తొందరేమిటీ? నువ్వు కాస్త ఆలొచించుకొవాల్సింది!’ అన్నాను.

సరళ మాంచి కసక్కులాంటి అమ్మాయి. శివుడేం తక్కువకాదనుకోండి. ఆరడుగుల ఎత్తు, వ్యాయామంతో తీర్చి దిద్దిన శరీర సౌష్ఠవం. పవరుంది కాబట్టి దూర్వాసుడు లాగేసుకున్నాడు కానీ, సరళ లాంటి అమ్మాయిలు శివుడికో లెక్క కాదు.

‘అనుకోకుండా జరిగిపోయింది గురూజీ!’ అన్నాడు శివుడు ప్లేటులో వేడి వేడి సాంబారు జుర్రుకుంటూ. దూర్వాసుడి ఆన్సైటు అవకాశం తెలిసిన్రోజు సరళ ఆత్మహత్య చేసుకో బోయింది.

సరళకు వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయి. నాతో అప్పుడప్పుడు చెప్పుకుని బాధ పడేది. వాటన్నిటికీ దూరంగా వెళ్ళాలని నిశ్చయించుకుంది.

దూర్వాసుడిని వాడుకొని అవకాశం కొట్టెయ్యాలని చూసింది. కాని వాడే ఈవిడని వాడుకొని జూరిక్ చెక్కేసాడు.’ అన్నాడు తాపీగా, వేళ్ళకంటిన సాంబారు నాక్కుంటూ!

నేను శివుడి వంక ఆశ్చర్యంగా చూసాను. చూడ్డానికి కేర్నాట్ లాగా ఉన్నా, సరళ గురించి బానే తెలుసుకున్నాడు. ‘ఐనా, ఆ పిల్లకి అత్యాశ! వాడి ద్వారా లాభం పొందాలని చూసింది. జరిగింది శాస్తి.

అద్సరే! నీకేం పొయ్యేకాలం! దాన్ని చేసుకున్నావూ? నువ్వు చిటికేస్తే ఇంతమంది అమ్మాయిలు పడతారుగా?’ అన్నా నేను, సరళను పడేసే అవకాశం జారిపొయిందే అన్న అక్కసు దాచుకుంటూ.

చిన్నగా నవ్వాడు శివుడు. ‘గురూజీ! మీతో చిన్న పనుండి వచ్చాను. పెళ్ళవగానే సరళను రాజీనామా చెయ్యమన్నాను. చేసేసింది. అన్నీ క్లియర్. నెల్రోజుల నోటీస్.

నిన్న మీరు సరళకు చెప్పారటగా, మీ కంపెనీలో ఏదో అవకాశం గురించి. ఇవ్వాళ రాడిసన్లో క్లైంట్ మీటింగ్ తర్వాత కలవమన్నారట.

సాయంత్రం ఎనిమిదయ్యాక ఎలా వెళ్ళటం అని తలపట్టుక్కూచుంది. మీరు నాకు బాగా తెలుసు అంజెప్పి నేనే తన సీవీ మీకు ఇద్దామని ఇటు వచ్చాను. ఇంద.’ అని ఒక నాలుగు కాయితం ఠావులు చాపాడు నావైపు.

అనుకోని ఈ పరిణామానికి నేను నివ్వెర పొయాను. వాడి చిరునవ్వు చెక్కుచెదరలేదు. కానీ వాడి కళ్ళల్లో మాత్రం ‘సరళ నాది. జాగ్రత్త!’ అనే హెచ్చరిక కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

అనుకోకుండా నా చేతిలో ప్లేటు జారి కింద పడి వేడి వేడి సాంబారు నాపై ఒలికింది.

– రాజేష్ చక్రవర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *