అన్న

అన్న

నా పేరు హరిత. నేను Z.P.H.S లో ఏడవ తరగతి చదువుతున్నా. నేను ప్రతిరోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్తాను. వెళ్ళే దారిలో ఒక చిన్న గుడిసె, అక్కడ ప్రతిరోజూ గొడవ జరుగుతూనే వుండేది ఎందుకిలా గొడవ పడతారు అని నా స్నేహితులను అడిగా “వాళ్ళింట్లో మొత్తం ముగ్గురున్నారు ఆ అన్న పేరు హరీష్. అతను ఇంటర్మీడియేట్ పాస్ అయ్యాడు.

వాళ్ల అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది అప్పటి నుండి మద్యం, ధూమపానం, అమ్మానాన్నల దగ్గర ఉన్న డబ్బును లాక్కొని వృథాచేయడం వంటివి చేస్తున్నాడు” అని చెప్పారు. సరేలే అని బడికి వెళ్ళాము.

డిసెంబర్ నెల కాబట్టి నూతన సంవత్సరం వస్తుంది కదా! అందరూ ఏం చేయాలని అనుకుంటున్నారు అని టీచర్ అడిగింది. కొంతమంది కొత్తబట్టలు, కొంతమంది ఊరికి, గుడికి వెళ్ళాలి అని చెప్పారు. నేను కూడా ఎదో ఒకదానికి తల ఊపాను.

అలా కాదు పిల్లలు కొత్త సంవత్సరం కాబట్టి కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు తీసుకోవాలి, మీరు ఆ నిర్ణయాలను సాధించలేక పోయినా కనీసం నిర్ణయం వైపు అడుగులు అంటే ప్రయత్నమైనా చేయాలి అపుడే మీరు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేటపుడు మీ నిర్ణయాలను కూడా చెప్పాలి అని అంటుంది.

నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమే కాలేదు. రెండుమూడు రోజులు ఆలోచించా ఏ ఆలోచనా నాకు తట్టలేదు. రోజూ మాదిరిగానే బడికి వెళ్తుండగా గొడవ పడుతున్న అన్నను చూసి నవ్వాను అతను కూడా నవ్వాడు. నేను ఏమి పెద్దగా పట్టించుకోలేదు.

బడి లోపలికి వెళ్ళగానే ఒక ఆలోచన వచ్చింది, అరే ఆ అన్నను ఎలాగైనా మార్చాలి అనుకున్న. మరుసటి రోజు వాళ్ళ గుడిసె దగ్గరికి రాగానే అతను గొడవ పడటం ఆపేశాడు. రోజూ ధూమపానం చేసే అతను నన్ను చూడగానే దాన్ని పారేశాడు.

రేపే నూతన సంవత్సరం ఆ అన్నతో ఎలాగైనా మాట్లాడి, కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం తీసుకొనేట్లు చేయాలి అని తన కోసం చాక్లెట్, అన్నా – చెల్లెలి గ్రీటింగ్ కార్డ్ కొన్నాను. పొద్దున్నే స్నానం చేసి గుడికి పోయి నా నిర్ణయం సఫలీకృతం కావాలని దేవునికి దండం పెట్టుకొని మొదటగా అన్న వాళ్ళ ఇంటికే వెళ్ళా ఎంతో ఆశగా కానీ అన్న లేడు.

సరే అని మా స్నేహితులను పలకరించి, శుభాకాంక్షలు తెలుపుకుని బడి దగ్గరికి వెళ్ళాము. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతుండగా మా ఉపాధ్యాయురాలు అడిగింది కొత్త నిర్ణయం ఏమి తీసుకొన్నారు అని. అందరం రేపు చెపుతాము అని అన్నాము.

సాయంత్రం మళ్ళీ అన్న వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళాను. అక్కడ జనమంతా గుంపులుగా చేరి ఉన్నారు, అన్న గట్టిగా అరుస్తున్నాడు. నేను వెళ్లి అన్నా అని గట్టిగా పట్టుకున్నాను, అతను ఆశ్చర్యపోయి అక్కడే కూర్చొన్నాడు అతని చేయి పట్టుకొని అతని కోసం తెచ్చిన గ్రీటింగ్ కార్డ్ ను ఇచ్చాను.

అతని కళ్ళ నుంచి నీళ్ళు తిరిగాయి. అన్నా కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం తీసుకో అని చెప్పాను, అలాగే తల్లి దేవుని మీద ఒట్టు ఇంకా ఎప్పుడూ గొడవ పడను, ధూమపానం చేయను అని చెబుతాడు. ఇక నా సంతోషానికి అవదుల్లేవు. జరిగిన విషయం అమ్మతో చెబితే అమ్మ కూడా సంతోషించింది.

– హనుమంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *