అందరూ ఒక్కటవ్వాలి
ఎంత తరచి చూద్దామనుకున్నా
ఈ పొద్దు నిన్నటిలాగే అనిపించింది
సూర్యోదయం కాలేదింకా…
గతాన్ని తవ్వితే
గడపలో పడి ఉన్న వార్త పత్రిక
గణతంత్ర దినమని పలికింది
*గతం*
ఎన్నేండ్ల పోరాటం
ఎందరి త్యాగం
ఎంతటి కృషి
స్వపరిపాలన కోసం
రాసుకున్న రాజ్యాంగం
హక్కులు విధులు
ప్రతి ప్రాణికున్నాయని
పొందేందుకు
పోరాటమైనా తప్పదని
ప్రతీ జీవి
కుల వర్గ మత జాతి లింగ
ప్రాంతీయ భేదాల్లేకుండా
ఆర్థిక రాజకీయ సామాజిక
సాంస్కృతిక పరమైన
సమానతతో జీవించాలని
శపధాలు చేసుకున్నాం
కథలు కథలుగా చెప్పుకున్నాం
పాటలెన్నో పాడుకున్నాం
*వర్తమానం*
ఎంత వద్దనుకున్నా
మదిని తొలిచే ప్రశ్న
73 ఏండ్లలో దేశం
సాధించిన ఘనతేముంది?
మనిషిని ఓటర్ జేసీ
మతోన్మాదులు భూస్వాములు
నియంతలు గూండాలు దళారులు పాలకులయ్యారు
ప్రకృతి సంపదంతా
మూటల గట్టి వాటాలు పెట్టి
దేశ దేశాలు దాటిస్తూ
బహుళ జాతి కంపెనీల్లో పోస్తున్నారు
ప్రజా ఆస్తులు ప్రయివేటోనికిచ్చి
వ్యాపారం చేస్తున్నారు
దేశ భక్తి దొంగ జపం చేస్తూ
సామాన్యుల
దేశద్రోహులుగా చిత్రిస్తూ
ప్రజలకు ఉరితాళ్లు గట్టి
వేలాడేస్తున్నారు
మహిళలపై, దళిత పీడిత మైనార్టీలపై
ప్రత్యక్ష హింస కొనసాగిస్తున్నారు
యువతరం సత్తువిరిసి
నిరుద్యోగంలో పాతరేస్తున్నారు
రక్షణ న్యాయ వ్యవస్థల
పగ్గాల్లా పట్టి మదమెక్కిన
మనువాదంతో పాలిస్తున్నారు
*ఇది నేరమంటే*
ప్రశ్నించ వీల్లేకుండా
విద్యలో మూఢత్వం పోశారు
పోరాడ వీల్లేకుండా
ప్రతీ గొంతును
ఉక్కు ‘ఉపా’లా కింద
నొక్కేస్తున్నారు
నిత్య నిర్బంధానా
జీవించే హక్కును తొక్కేస్తున్నారు
రాజ్యాంగ విలువల కాలరాస్తూ
మతోన్మాదంతో రంకెలేస్తున్నారు
*భవిష్యత్ కోసం*
గతంలో రాసుకున్న స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వంతో
వర్తమానాన్ని నిర్మించాలి
కుల మతాల పాతరేసి
ప్రగతిశీలతని పాటించాలి
అసలైన ప్రజల
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
వివక్షలేని హింసలేని
స్వేచ్ఛా జీవితాల్ని నిర్మించాలి
ఆ అందమైన లక్ష్యంకోసం
అందరొక్కటవ్వాలి…
అందుకు ఒక్కడుగైనా ముందుకెయ్యాలి…
-అమృతరాజ్