అమూర్త గానం
రోజూ చూస్తుంటానా బల్లని
అలసిన దేహాన్ని
మాసిపోయిన జ్ఞాపకాల్నీ
కడిగి ఆరేయమంటూ
ఆహ్వానించిందా బల్ల
పరికించి చూశాను
ఎంతమందికి ఆశ్రయమిచ్చిందో
ఎన్ని అనుభవాల నెమరువేతకు
నీడనిచ్చి భుజం తట్టిందో
మనతో మట్లాడుతున్నట్టే అనిపిస్తుంది
నిశ్శబ్దంగా నిశ్చలంగా
ధైర్యాన్ని కప్పుకునుంటుందేమో
ఆ అమూర్త స్వరూపిణి
నాలోని బేలతనం కొత్త ఊపిరిపోసుకుంటుంది!
ఆ బల్లను చూస్తే నాకు
తరలిపోయిన అమ్మ
తిరిగొచ్చి భుజం నిమురుతున్న అనుభూతి!
పరుగు పందెంలో ఓడిపోతున్న
ప్రతిసారీ నన్ను పునస్సమీక్షించుకోమని
చోటు చూపించే
ఆ అమూర్త స్వరూపిణిికి
రోజూ నమస్కరిస్తుంటాను!
– సి. యస్. రాంబాబు