అమ్మాయి జీవితం

అమ్మాయి జీవితం

అమ్మాయి పుడితే పూర్వకాలం లో మహా లక్ష్మి అనేవారు. కాలం మారుతున్న కొద్ది అమ్మాయిలు పుట్టడం భారంగా అనుకున్నారు. తర్వాత కాలం లో ఆడపిల్ల అంటే ఆడ పిల్లే ఇడ పిల్ల కాదనే ఒక నమ్మకం లోకి వచ్ఛారు. తర్వాత కాలం లో ఆడపిల్ల అనగానే కడుపులోనే చంపడం చేశారు. ఇంకా కాలం మారుతున్న కొద్దీ ఆడపిల్లను చదివించడం, చదివించిన వారికి తగిన సంభంధాలు చూడడం భారంగా భావించారు.

అందుకే అమ్మాయిలను ఇంటి వరకే పరిమితం చేశారు. కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో ఆలోచనలు కొత్త దారులు వెతికాయి. దీనికి కారణం అమ్మాయిలను తక్కువ అంచనా వేసిన తర్వాత అమ్మాయిలు సాధించిన విజయాలు చూసిన వారు అమ్మాయిల గురించి అలోచించి వారిని చదివించడం, తర్వాత ఉద్యోగానికి పంపడం చేశారు.

వారికి స్వేచ్చని ఇస్తున్నాం అంటున్నారు. కొడుకుతో పాటు చూస్తున్నాం అని అనుకుంటూ నలుగురికీ చెప్పుకుంటున్నారు.

కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమ్మాయిని చదివిస్తున్నారు కానీ ఎలా తమ అబ్బాయి చదువుకునే బళ్ళో కాకుండా ఆడపిల్లల బళ్లో, కాలేజీలలో చదివిస్తున్నారు. తనకు తోడుగా తల్లి లేదా తండ్రి వెళ్తున్నారు. తనకు ఏదైనా అవసరం వస్తె చిన్నవాడు అయిన తమ్ముణ్ణి ఇచ్చి పంపుతున్నారు. చివరికి వీధి చివరకు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి.

అమ్మాయి అంటే ఆడదాని జీవితం అంత తండ్రి, అన్న, భర్త, కొడుకుల మధ్యలో సాగుతూనే ఉంది. ఇక వివాహం చేశాక మా అమ్మాయికి ఇంత కట్నం ఇచ్చి చేశాం, అంత కట్నం ఇచ్చాము అంటున్నారు తప్ప అత్తారింట్లో బాగుందా లేదా అనేది మాత్రం చూడడం లేదు. అయితే అమ్మాయి తన సమస్యలను తల్లి దండ్రులకు చెప్పుకున్నా సర్దుకు పొమ్మనే చెప్పడం మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు.

అమ్మాయి జీవితం ఏమి మారలేదు. చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా, రాకెట్ లోకి వెళ్ళినా కూడా ఇంట్లో అంట్లు కడగటానికి, బట్టలు ఉతకడం, పిల్లలను చూసుకోవడం, అత్తగారు, మామగారు, భర్త ఎం అన్నా నోర్మూసుకుని భరించడం, లేదా చచ్చిపోవడం మాత్రం ఎక్కడా ఆగడం లేదు.

ఎందుకంటే నాగరికత పెరిగినా, నవయుగం నడుస్తున్నా చిన్నారి నుండి ముసలి అవ్వ వరకు ఎవరికీ రక్షణ లేదు. అందువల్లే అప్పట్లో చేసిన బృణ హత్యల వల్ల అమ్మాయిలు కరువు అయ్యి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, ఆడపిల్లలు దొరకడం లేదు.

అమ్మాయిలు అమెరికా వెళ్ళినా, అంతరిక్షంలోకి వెళ్ళినా జీవితాలు ఏమి మారలేదు. మారినట్టు కనికట్టు చేస్తున్నాయి తప్ప నిజాలు మాట్లాడుకుంటే మాత్రం ఆడది ఎప్పటికీ బానిస బతుకు బ్రతుకుతుంది అనేది మాత్రం అందరూ తెలుసుకునే విషయం. తల్లి అయినా కూతురు అయినా అమ్మమ్మ అయినా తాతమ్మా అయినా, ఎవరైనా మాగాడికి అమ్మాయి జీవితం ఒక విలాస వస్తువే, అందుకే ఎన్ని యుగాలు మారినా అమ్మాయి జీవితం ఇంతే. ఇది ముమ్మాటికీ నిజం.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *