కులమతాలకు…..పరువు ప్రతిష్టలకి
ఆ సమాజానికి….కన్నవాళ్ళ ప్రేమకి
తలోంచి ,
నూరేళ్ళ తన ప్రేమని త్యాగం చేసి
ఓ అపరిచితుడ్ని ఆమె మనువాడింది.
ప్రతీ రాత్రి ఆమెకు కాళ రాత్రే…..
ఆమె తనువుపై
జెర్రెలు , తేళ్ళు పాకే
జగుప్సాకర కాలరాత్రి.
దిండుపై మోముని వాల్చి ,
నిప్పు కణికలులా కన్నీళ్ళు కురిసే
కటిక కాలరాత్రి.
ఆ రాత్రీ….
మదమెక్కిన ఆ పశువు ,
మందు సీసాతో ఆమెపై దుమికింది.
మనసుని మాటల కొడవలితో కోసి
ఆమె అంగంగాలని నెత్తుటిమయం చేసి
ఏరులై పారుతున్న తన కన్నీటిని
కడుపారా తాగి ,
తన దేహ దాహాన్ని తీర్చుకుంటుంది.
ఆ మరుసటి రోజునే……,
ఆ తడిసిన కళ్ళతో
తనని కట్టబెట్టిన కన్నవాళ్ళ ఇంటి తలపు తట్టింది.
ఆ కన్నీలని తుడుస్తారేమో అని…!
కానీ…,
వాళ్ళే రెండు కన్నీటి బొట్లని రాల్చి
ఆమెను తిరిగి ఆ నరకానికి సాగనంపారు
అలా ఒక్కో రాత్రి
ఒక్కో యుగంలా గడుస్తుంది…..
ఏ రాత్రిలోనూ
తాను కోరుకున్న ప్రేమ
తనని కౌగిలించుకోవట్లేదు.
అందుకే ఆ ప్రేమనంతటిని
తన కళ్ళ లోతుల్లో కన్నీరుగా దాచేసింది..
అతను తిట్టే ఆ బూతుల్లోనే
ముద్దు మాటలని వెతికి ,
అతను పెట్టే వాతల్లోనే
మోహ స్పర్శని తలచి ,
కాలాన్ని నెట్టుకొస్తుంది..
తన మెడకు ముడేసిన ఆ పలుపు తాడుకై
పూజలు చేస్తూ ,
తన పొత్తిళ్ళపై తన్నే ఆ కాలిని
పొద్దున్న మొక్కుతూ ,
పునీత స్త్రీగా పేరుగాంచుతుంది…
అంతలోనే…..
ఆ మదమెక్కిన ఆ మొగుడు ,
ఆ ఎడారి మధ్యంతరాన
తనని వదిలి పారిపోయాడు.
అతని దాహం తనివి తీరా తీరిందని..!
ఆ దిక్కుతోచని స్థితిలో ఒంటరైన
ఆ ధీనురాలు…
కాలి నడకన ఆ ఎడారిని దాటి ,
తాను ఎవరికోసమైతే తన నూరేళ్ల జీవితాన్ని త్యాగం చేసిందో
ఆ
కులమత పెద్దలు….ఆ సమాజం
దగ్గరకి
ఆశగా వెళ్ళింది.
తనని అక్కున చేర్చుకుని ప్రేమని పంచుతారేమో అని ….!
తీరా చూస్తే
వాళ్ళు మచ్చుకైనా కనిపించలేదు.
ఇక చేసేదేమీలేక…
తన దారిని గోదారిగా మార్చి ,
తన కన్నీలని
ఆ నీళ్లలో కలిపేసుకుని
తనవు చాలించింది……! ఈ కధకి బాలసారె చేసి పేరుపె ట్టండి.
– కామేష్