అక్షరపరిమళం
విమర్శనాస్త్రాలు పదునెక్కుతుంటే
అక్షరాలు అస్త్ర సన్యాసం చేస్తానంటున్నాయి
భావాలు బతిమాలుతున్నాయి
ఏమీ చేయలేక కవి చేరగిలబడ్డాడు
నీ వంకర టింకర నడకను
సరిచేసేందుకే విమర్శ జడివానై తడేపేది
కొత్త దారి వేయాలంటే
పదసంపద పెంచుకోమని సలహా చెబుతున్నాయి భావాలు గుమిగూడుతూ
ఉప్పొంగే అలలాంటి భావాలను నియంత్రించే
మనసుకు
నను సరిచేసే బాధ్యత లేదా
చిరుబురులాడింది అక్షరం
హృదయానికి ఉద్వేగమెక్కువ
ఊరికే తొందర పెడుతుంది
మనసు రుసరుసలాడింది
హృదయానిది నదీ పారవశ్యం
తప్పు నాదంటూ తలదించుకుంది బుద్ధి
అంతా శాంతించినవేళ
మనసు కోయిల రాగమాలికయ్యింది
మెరుగు పెట్టే బుద్ధి తోడుతో
భావాలను అలంకరిస్తూ
అక్షరమిప్పుడు ఆత్మవిశ్వాసపు కోట
– సి. యస్. రాంబాబు