అదృశ్య శక్తి
పయనం సాగుతూనే ఉంటుంది
గమ్యం దోబూచులాడుతుంటుంది
కాలం చేజారిపోతుంటుంది
బంధనాలను తెంచుకుని చిలక ఎగిరిపోతుంది
జ్ఞాపకాలన్నింటిని దాస్తాడు
వెలికి తీయటం మర్చిపోతాడు
స్పందనలు లేక హృదయకవాటాలు
మూసుకుపోతుంటాయని మాత్రం గుర్తించడని
కన్నీటితో కడగాలనుకుంటావు
దుమ్ము ధూళితో ఇల్లు పాడుబడినట్టే
పలకరింపులులేని మనిషి
లోలోపల మరణిస్తుంటాడని
గ్రహించని సమాజం ఏం బాగు చెబుతుందంటావు
ఇది నిర్వచనాలు మారే కాలమని గుర్తించావా మిత్రమా
మారే కాలం కొత్త రియాలిటీ చెక్ తో వచ్చింది
మట్టిలో కలిసిపోయే క్షణాలు సమీపిస్తున్నా
మనుషుల మధ్య కరచాలనాలు లేకపోయినా
స్వర సందేశాలు కరువయినా
వర్చువల్ ప్రపంచమే virtue
అని కొత్త శాసనాన్ని రాసింది కదా కాలం!
ఈ మాయాప్రపంచం వరమైన మనుషులకు
ఆత్మీయ బంధాల అవసరమూ కనబడటం లేదు!
అంత బాధాలేదు
ఎందుకంటే
ప్రపంచాన్ని చుట్టేసే అదృశ్య శక్తి మనిషిప్పుడు!
– సి. యస్ .రాంబాబు