అబద్ధపు జీవితం
నేను నిజం.. నా జీవితం అబద్ధం
నా నవ్వు నిజం.. నా సంతోషం అబద్ధం
నా పుట్టుక నిజం.. నే గిట్టుట నిజం
నట్టనడుమ ఉన్న నా అనే నడవడిక అబద్ధం.
నా జీవితం అంతా పరులకోసం ఆలోచించి నా అనే పదానికే అర్థం లేకుండా బతికాను.
మగాడిలా పుట్టి తల్లితండ్రులను సంతోషపెట్టాను.
వాళ్ళ కలల దర్పణంలో నన్ను నేను చూసుకోవడమే మరిచిపోయాను.
చదువైతే చదవగలిగాను. కానీ అది నా ఇష్టానుసారం కాదు.
పుత్తడి బొమ్మ లాంటి అమ్మాయిని ప్రేమించాను. కానీ ఇత్తడికి పట్టినట్టు మరకలతో ఆమె మనసు స్వయం ప్రకాశాన్ని కోల్పోయి, ఇతరుల మాటలు నమ్మి నన్ను నిందించి నా ప్రేమనే అబద్ధం చేసింది.
అయినా నన్ను నేను తమాయించుకుంటూ.. జీవితంపై దృష్టి సారించాలనుకున్నాను.
కానీ అరిష్ఠం నన్ను పటిష్ఠంగా ఆలింగనం చేసుకొని నా చదువుతో…. అభిరుచితో సంబంధం లేని కొలువులో నన్ను కూర్చోబెట్టింది.
తల్లిదండ్రులు అయితే సంతోషిస్తున్నారని సరిపెట్టుకున్నాను.
గృహస్థుడిని చేయాలని ఆలోచించి నాకు ఒక మైనపు బొమ్మ లాంటి మగువతో మనువు చేసారు.
తనువు మాత్రమే మైనపు బొమ్మ ఆకారం.
అయినా నేనే తగ్గి తగువులకు అవకాశమివ్వకుండా ఆ మగువ చేతిలో కీలుబొమ్మనయ్యాను.
నా జీవిత పర్యంతం నేను ఈ బాగోతంలో బొమ్మలాట ఆడుతూనే ఉన్నాను.
నా మనసు నన్ను చూసి జాలి పడుతుంది.
నా ఆత్మ నన్ను చీదరించుకుంటుంది.
నా తనువు నన్ను చిన్న చూపు చూస్తుంది.
అయినా జీవిస్తున్నాను.
ఈ అబద్ధపు జీవితాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాను..
– శంభుని సంధ్య