ఆ మబ్బులను దాటి రా

ఆ మబ్బులను దాటి రా

నీకే కనిపిస్తున్న అబద్దాల ఊహాలోకంలో అపార్థాల కోటలు కట్టి.. బండబారిన మనసుతో మూర్ఖత్వపు సింహాసనమెక్కి.. కళ్లుండీ నిజాన్ని చూడలేని.. మనిషైనా క్షమాగుణమెరుగని ఓ మహాజ్ఞాని.. ఇది కాదు నాకు తెలిసిన నీ విలువ.. ఇప్పుడు లేదు నీలో నా మగువ.

నేస్తమా.. నేల మీద నువ్వున్నప్పుడు నేను నీకు చెలికాడినై చేయందించాను. నా మనసు నీకిచ్చి నీ కోసం రేయింబవళ్ళు పరితపించాను.. నా చేత్తో నీ జీవిత పరీక్షలు రాయించాను.. పడిగాపులను ప్రమోదంగా భావించి, నీ ప్రతి అడుగులో నేను తోడై నిలిచాను.

నీ విజయమే నాదనుకున్నాను.. నీ సంతోషంలోనే నా ఆనందాన్ని వెతికాను.. ఆఖరికి నీ లక్ష్యాన్ని చేరుకున్నావని కొండంత సంబరపడి ఈ ప్రపంచానికి నా అక్షరాలతో చాటి చెప్పాను.. కానీ ఇవేవీ నీకు గుర్తులేవు.. నీకై గడిపిన క్షణాలేవీ నీకు అక్కరలేదు.

వయసు ప్రభావమో.. నా గ్రహచారమో.. తెలిసీ తెలియక జరిగిన పలు పొరపాట్లు నన్ను నీ దృష్టిలో మోసగాడిని చేశాయి. అసలుకు కొసరు పోగేసి, అప్పటి వరకూ పొందిన ప్రేమానురాగాలను తృణప్రాయంగా వదిలేసి నన్ను సునాయాశంగా దూరం చేసేలా చేశాయి.

మోసానికీ.. పొరపాటుకీ తేడా తెలుసుకోలేని ఓ సాహిత్య మూర్తి.. పశ్చాత్తాపాన్ని మొసలి కన్నీరుగా చూసిన ఓ అక్షర పిపాసి.. నీ చదువు.. జ్ఞానం.. ఉద్యోగం.. హోదా.. ఇవేవీ ఆనాడు నేను నీకిచ్చిన విలువకు సాటిరావు.. నా ఈ ప్రేమకు అవెప్పటికీ వెలకట్టలేవు.

ప్రణయానికి అర్థం నేర్పావు.. ప్రేమ మాధుర్యాన్ని రుచి చూపించావు.. నీ సాంగత్యంతో స్వర్గ సౌఖ్యాలనందించావు.. ఇష్టమైన వంటకాలతో నా ఆకలి తీర్చావు.. నీ నవ్వుతో నన్ను మురిపించి.. ఇంక చాలు అన్నీ మరచానంటున్నావు.. నన్ను నీ నుంచి పొమ్మంటున్నావు.

మబ్బుల మాటున దాక్కొని.. నీ మనసుకు వేసిన ముసుగు తీసి ఒక్కసారి వాస్తవాన్ని చూడగలిగితే.. నా గుండెల్లో నీ స్థానమేమిటో కనిపించేది.. నీ కళ్లను కమ్మిన అపార్థాల పొరలను తొలగిస్తే నేనేమిటో తెలిసేది. కానీ ఇంక నాకా ఆశ లేదు.. నీలో ఆ నాటి మనిషీ లేదు.!

– ది పెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *