ఆకలి

ఆకలి

 

చేయటానికి పని లేక ఇంటి అద్దె కట్టలేక నడి రోడ్డున పడిన ఆ కుటుంబం ఒక రోజు మొత్తం మంచినీళ్లు తాగి మరుసటి రోజు కూడా భోజనం నా పిల్లలకు పెట్టలేక పోతున్నాను అని ఆ తండ్రి వేదన చూసి ఆ చిన్ని మనసు చలించి పోయింది..
పక్కింటి ఆమె వీరి బాధ చూడలేక మీకు పని ఇప్పిస్తాం… మా హోటల్ లో సెర్వ్ చేయాలి ఇందుకు గాను పొద్దున 4ఇడ్లీలు.. మధ్యాహ్నం భోజనం పెడుతూ రోజుకు 5 రూపాయలు ఇస్తాము.. కానీ మీ పదకొండు ఏళ్ళ పాపకు అని చెప్పింది.. ఆ పాప తల్లీ చాలా కోపంగా కసిరింది ఆ పక్కింటి ఆమె మీద..

ఆమె మా హోటల్ లో చిన్న పిల్లలు మాత్రమే కావాలి మీకు ఇష్టం అయితే పంపించండి లేకపోతే లేదు అని చెప్పి వెళ్ళిపోయింది… ఆ పాప ఇంట్లో చెప్పకుండా ఆ హోటలో పనికి వెళ్ళింది మరుసటి రోజు… ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో అని తలా ఓ దిక్కు వెళ్లి వెతక సాగారు…

ఆ పాప ఎక్కడ కనిపించక పోయే సరికి బయటికి వెళ్లిన ఒకొక్కరు నీరసంగా ఇంటి దారి పట్టారు.. ఇంట్లో అన్నపూర్ణ లాగా అన్నం సాంబార్ పక్కన పెట్టుకొని వీరి కోసం ఎదురుచూడ సాగింది ఆ పాప… ఏడుస్తూ ఇంటికి వస్తున్న తన తల్లికి ఈ పాప కనపడగానే పరిగెత్తు కుంటూ వచ్చి ఎక్కడికి వెళ్ళావ్ అని కోపంగా కొట్టబోయింది పక్కన ఉన్న అన్నం చూసి ఆగి ఎక్కడిది అని ప్రశ్నించగా మొత్తం విషయం తన తల్లికి చెప్పింది..

అప్పటికే రెండో రోజు అవుతోంది ఇంటిల్లపాదికి భోజనం లేక… తనకు ఆ హోటల్ వారు పెట్టిన భోజనం అలాగే పొద్దున్న ఇచ్చిన ఇడ్లీలలో రెండు ఇడ్లీలు తనకు వచ్చిన జీతం అయిన అయిదు రూపాయలతో తెచ్చిన భోజనం అది…

ఆ సమయంలో ఆ అమ్మాయి నిజంగానే ఆ ఇంటి అన్నపూర్ణ దేవి అయ్యింది… అలా ఆ కుటుంబాన్ని నెల రోజులు తన రెక్కల కష్టం తోనే పోషించింది… అంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో ఆ పాపది… తను నాకు ఇపుడు స్నేహితురాలు… తనని నేనో మాట అడిగాను ఈ విషయం నాకు చెప్పిన తరువాత…

అంత చిన్న వయసులో ఎలా వెళ్ళావు అని నేనూ అడిగితే ఆకలి అన్ని పనులు చేయిస్తుంది అండి అని చెప్పింది.. నడుచుకుంటూ వెళ్లే వారికీ సైకిల్ పై వెళ్ళాలి అని… సైకిల్ లో వెళ్లే వారికీ బైక్ పై వెళ్ళాలి అని.. బైక్ పై వెళ్లే వారికి కార్ లో వెళ్ళాలి అని ఇలా తాను ఉన్న స్థానం నుండి ముందుకు చూస్తారు… నేనూ అంతే పస్తుల నుండి ఆకలి తిరే మార్గం వైపు చూసాను ఇందులో గొప్ప ఏం లేదు అని చెప్పి నవ్వింది..

ఆ క్షణం తన నవ్వులో నాకు ఎన్నో సందేశాలు చెప్పినట్టు అనిపించింది.. మనకూ ఉన్న కష్టం చూసి ఇంత కన్నా ఇంకా ఎక్కువగా కష్ట పడే వారు ఉంటారు వారితో పోల్చుకుంటే నేనే చాలా నయం అనుకుంటే ఈ మనసుకు సద్ది చెప్పే పరిస్థితి రాదు అనిపించింది…

– కళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *