నన్ను దోచిన వాడు
కలల కంబళి కప్పుకుని రాత్రి సంచారానికి
బయలుదేరాను
సౌధాల సౌందర్యం వివశుణ్ణి చేసింది
పచ్చని అరణ్యాల వెచ్చని ఊపిరికి
మానసవీణ మురిసి హృదయరాగాన్ని మీటింది
కొలనులన్నీ కన్నుగీటుతున్నాయి
తమలోతు చూడమని
కంబళి తొలగించి దూకానా
కలచెదిరి
ఇహలోకంలో పడ్డాను
నా కలల సామ్రాజ్యాన్ని దోచిన భానుడు
ఫక్కున నవ్వాడు భానుడు
బతుకు వస్త్రం చిరుగులకు వెలుగు అతుకులు వేయమంటావా అంటూ
కళ్ళతోనే అడుగుతుంటే
వాస్తవాన్ని కనకధారాస్తవంలా పఠించాను
తన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాను
– సి.యస్.రాంబాబు