ఎడారిలో ప్రయాణం
హాయిగా సాగుతున్న నా జీవితంలోకి
మెరుపులా వచ్చావు మైమరపింప చేసావు
కన్నవారిని తోడబుట్టిన వారిని మరచిపోయేలా
నీ ప్రేమతో నన్ను కట్టి పడేసావ్, ఆ మైకంలో నేను
నన్ను కన్న వారిని తోడబుట్టిన వారిని చుట్టాలందరినీ మరచి
నీకోసం నీ వెంట నడిచాను తీసుకువెళ్లి ఏడడుగులు నడిపించావు
కొన్నాళ్ల మన ప్రయాణంలో సరిగమలు
ఎన్నో రుచి చూపించావు….
ఆ రుచి ఫలితంగా మనమిద్దరం మనకు ఇద్దరు అంటూ
ఎగిరి గంతేసే లోపు మళ్లీ వస్తానంటూ వెళ్లావు
క్షణాలు యుగాలుగా యుగాలు రోజులుగా
రోజులు నెలలుగా నెలలు సంవత్సరాలుగా గడిచిపోతున్న
నీ జాడ కానరాకఈ కుళ్ళుబోతు సమాజంలో ప్రతి ఒక్కడి చూపును
తట్టుకుంటూ ఇద్దరు పిల్లలతో ఎంతమంది చుట్టాలున్నా
ఎవరూ దరిచేరినియక, కన్నవారు సైతం నువ్వు చచ్చావ్
అంటూ శాపనార్ధాలు పెట్టాక తిరిగి వారికి ముఖం చూపించలేక,
నా చిన్నారి పిల్లల్ని ఎలా సాకాలో తెలియక
ఈ నవ నాగరిక సమాజం సూటిపోటి మాటలతో నిందిస్తున్న
పిల్లల కోసం అన్ని భరిస్తూ కూలి పనులు చేసుకున్నా
అక్కడ ఉన్న కామాంధుల నుంచి తప్పించుకుంటూ,
ఎవరైనా ఏదైనా దారి చూపిస్తారేమోనని ఎందరినో చెయ్యి చాచి ఆర్థిస్తున్నా
ఇంత పెద్ద ప్రపంచంలో ఎవరు సాయ పడేది, ఎవరిది జాలి గుండె కాకుండా
కామంతో కళ్ళు మూసుకుపోయిన గుండె అని తెలుసాక, నిన్ను వెతికే సహనం,
ఓపికా లేక ఒంటరిగా నా జీవనం సాగిస్తున్నా రేపటి తరానికి వెలుగు రేఖలుగా
నా ఇద్దరు బిడ్డలను తయారు చేయడానికి, వాళ్లకు నా గతి పట్టకుండా ఉండడానికి
ఒక్కదాన్ని శ్రమిస్తున్న ఎడారిలో అయినా ఒక చిన్న మొక్క ఆసరా దొరుకుతుందేమో
కానీ ఈ సమాజంలో ఏ ఒక్క ఆసరా మాత్రం దొరకదని తెలిసిపోయాక ఒక బండరాయిగా మారి
బ్రతికీడుస్తున్నా బ్రతికున్న శవంలా బ్రతుకుతున్నా ….
– భవ్య చారు