ఎవరు పార్ట్ 7
“అలీ.. ఈ లేఖ ఏంటి? ఇది నీ దగ్గర ఉంది ఏంటి?”
అలీ తలుపు దగ్గరికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని చూసి, తలుపులు దగ్గరికి వేసి, నా దగ్గరికి వచ్చి
“ఈ లేఖ నారాయణ భూపతి గారికి వచ్చింది”
“నారాయణ భూపతి?”
అలీ: “అవును, మహేష్ భూపతి గారి తాత గారు, భూపతి రాజు తండ్రి గారు.”
“ఏమి రాసి ఉంది?”
అలీ: “అమ్మి అప్పగింపు ఆయుష్మణం, గడియ గాంచిన యామంతం”
“అర్ధం కావట్లేదు.”
అలీ: “దీన్ని అర్ధం చేసుకోవటానికి నాకూ వారం పైనే పట్టింది. క్లుప్తంగా నాకు అర్ధం అయ్యింది ఇది. నారాయణ భూపతి గారి దగ్గర ఎవరో నాయకుడు అప్పు తీసుకున్నాడు. అది తీర్చని కారణంగా నారాయణ భూపతి వాళ్ళ అమ్మాయిని తీస్కుని వచ్చేసాడు. ఆమెను తిరిగి ఇవ్వకపోతే ఆ అమ్మి శాపం తగులుతుందని రాసి ఉంది.”
“అయితే ఊరిలో పుకారు నిజమేనా? ఆ అడివి జాతి అమ్మాయిని నారాయణ భూపతి తీస్కుని రావటం. ఆ అమ్మాయి చనిపోతూ ఈ కుటుంబాన్ని శపించటం. అప్పటి నుండి వారసులు చనిపోవటం.”
అలీ: “ఇప్పటి వరుకు నేను సేకరించిన వివరాల ప్రకారం ఈ లేఖ అందిన రెండు రోజులకే అమ్మవారి గుడి కూలిపోయి, ఆ గుడి కట్టడానికి ఉపయోగించిన రాళ్లు కొండ పైనుండి జారి కింద వెళ్తున్న నారాయణ భూపతి మీద పడి ఆయన చనిపోయారు. అది జరిగిన 45 రోజులకి ఆయన పెద్ద కుమారుడు ముక్తానంద భూపతిని గ్రద్దలు పొడిచి చంపేశాయట, ఇంకా మొన్న భూపతి రాజు గారు.”
“గ్రద్దలు బతికి ఉన్న మనిషిని చంపటమా, విచిత్రంగా లేదూ?”
అలీ: “ఈ లేఖ వెనక చూసావా గ్రద్ద బొమ్మ, అలాగే గుడి కూలిపోవటం, భూపతి రాజు చావు అన్నీ విచిత్రాలే”
“కానీ నీకు ఈ లేఖ ఎక్కడిది?”
అలీ: “నిన్ను కలిసిన రోజు, నీ వెనకాల ఒక అతను రైలు ఎక్కాడు. అతను రైలు ఎక్కే హడావిడిలో ఈ లేఖ పారేసుకున్నాడు. అది చదివి నా కథకు బాగా పనికొస్తుంది అనిపించి ఇటు వచ్చాను. వివరాల కోసం ఊరిలో తిరుగుతున్నా కానీ అందరూ ఎవరికి నచ్చిన కథ వారు చెబుతున్నారు. అందరి కథలో కలిసింది మాత్రం శాపం.”
“ఆ జాతి నాయకుడితో గాని, మహేష్ గారితో మాట్లాడొచ్చు కదా”
అలీ: “నేనా!! లేదు, ఆ అడివి జాతి వారి దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు. మహేష్ గారిని అడిగే ధైర్యం నాకు లేదు. నువ్వు కూడా ఆ ప్రస్తావన తేవద్దు”
“ఎందుకు?”
అలీ: “భూపతి కుటుంబానికి ఈ విషయంలో బయట వారి ప్రమేయం నచ్చదు. ఇంతక ముందు అలా ఒకతను తెలుసుకుందాం అని భూపతి రాజు గారిని అడిగాడంట! అప్పటి నుండి అతను కనిపించట్లేదు అని ఊరిలో చెబుతున్నారు.”
ఇది శాపం అయితే మరి ఆ రాత్రి పూట వచ్చే పోతన మనుష్యులు ఎందుకు వస్తున్నారు? అవే ఆలోచనలు, అదే అమ్మవారి చిత్రపటం నాకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేశాయి.
********
అలీ వివరాల కోసం బాగా ప్రయ్నతిస్తున్నాడు. ఎస్టేట్ పనులతో పాటు, పుట్టినరోజు వేడుకుల ఏర్పాటులో రెండు వారాలు గడిచిపోయాయి. పనులు కలిసి చేయటం వల్ల లక్ష్మి బాగా దగ్గరయింది. భవంతికి కొత్త రంగులు, అతిధి ఆహ్వానాలు, విందు ఏర్పాట్లు అన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. కృప గారు చెప్పినట్టే అన్ని పనులు చేసాము.
కృప: “రాయుడు, భవంతి అంతా అందంగా ఉంది కానీ ఈ అతిధి గృహం మాత్రం పాలిపోయినట్టు ఉంది. దీనికి కూడా రంగులు వేస్తే బాగుంటుంది.”
“కానీ రంగులు వేసే వారు వెళ్లిపోయారు కదండీ.”
కృప: “నువ్వు, నీ స్నేహితుడు ఉన్నారు కదా” అని నవ్వి వెళ్లిపోయారు.
మర్నాడు నేను, అలీ ఇంటికి రంగులు వేయటం మొదలుపెట్టాం.
అలీ: “మహేష్ గారి పుట్టిన రోజు ఎప్పుడు?”
“ఇంకా మూడు రోజులు ఉంది. ఎందుకు?”
అలీ: “లెక్కేస్తే, అది 45వ రోజు కదా! భూపతి రాజు చనిపోయి.”
“బయపెడ్తున్నావే?”
అలీ: “ఆ శాపం, పుకారులు నిజమో కాదో నాకు తెలీదు, కానీ ఈ లెక్క ఇప్పటి వరకు తప్పలేదు.”
అంతలో లక్ష్మి అక్కడికి వచ్చింది.
లక్ష్మి: “నేను సాయం చేయనా?”
“మీకు ఎందుకండి శ్రమ?”
అలీ: “వాడు అలానే అంటాడు మీరు కాస్త చెయ్యి వేస్తే ఈ రోజు ముగింపు పలకొచ్చు.”
లక్ష్మి: “అలాగే, ఆ రంగు కాస్త ఈ డబ్బాలో పోయండి.”
“అలీ, అయితే నువ్వు బయట వెయ్యి, లోపల ఇంకా చాలా ఉంది కదా! మేము లోపల వేస్తాము.”
అలీ చూపు నాకు అర్థం అయ్యింది కానీ అమ్మాయి కోసం ఇవన్నీ తప్పవు కదా!
అలా రంగులు వేస్తూ, లక్ష్మి తో మాట్లాడుతూ సాయంత్రం అయ్యింది. అక్కడి గోడకి రంగు వేస్తున్నాము. తాను నా పక్కన నిలబడి రంగులు వేస్తుంది. ఆమెను అలా పరికిణీలో చూస్తుంటే కాలం ఆగిపోయినట్టు అయ్యింది. రంగు చుక్క కింద పడిన కాలంలో ఆమె కను రెప్పలు వేసే తాళం, కురులు చేసే నాట్యం, నుదుటి మీద నుండి కంఠం వరకు జారిన చెమట బిందువు పయనం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంత నిశ్శబ్దంలో లక్ష్మి “ఎందుకు ఆ ఆనందం?”
“ఆనందమా?”
“మీ కళ్ళలో కనిపిస్తుంది, ఏమి గుర్తుకు వచ్చింది? నాకు కూడా చెప్పండి”
“‘మీరు’ అనటం మానేస్తే చెబుతాను.”
లక్ష్మి అలక నటిస్తూ “సరే చెప్పను అంటారు, అలానే కానిద్దాం.”
కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. నేను గోడకు రంగు అడ్డముగా వేస్తుండగా నిమ్మ పండు రంగులో ఉన్న లక్ష్మి నడుము కనిపించింది. అక్కడ ఆపేసి అదే వరసలో మొదటికి వెళ్లి అక్కడ నుండి వేసుకుంటూ వస్తున్నా. మళ్ళీ ఆమె నడుము అడ్డు వచ్చింది. ఒక క్షణం ఏమి జరిగిందో తెలియలేదు, ఆమె నడుముపై రంగు రాసాను.
లక్ష్మి కోపంగా నా వైపు చూసింది.
“అది… అది… అలా జరిగిపోయింది.”
తను కూడా నా మొహంపై రంగు పూసి పరిగెట్టింది. నేను ఇంకా కాస్త రంగు తీస్కుని ఆమె వెనకాల పరిగెడుతుంటే, మహేష్ గారు “రాయుడు, ఏం చేస్తున్నావు!” ఆయనను చూసి లక్ష్మి భవంతి లోపలికి వెళ్లిపోయింది.
“రంగులు వేస్తున్నాము, సార్” అని నెమ్మదిగా చెప్పాను.
మహేష్ గారు చాలా ఆవేశంగా కనిపించారు. హడావిడిగా లోపలికి వెళ్లిపోయారు.
ఆ రోజు రాత్రి లక్ష్మిని కలుసుకోవాలనిపించి, ఆమె గది దగ్గరికి వెళ్ళాను. లక్ష్మి గదిలో మహేష్ గారు ఉన్నారు. లక్ష్మి దూరంగా తలదించుకుని నిల్చుని ఉంది. నేను బయటే ఉండిపోయాను.
మహేష్ “నా మాట విని, ఒప్పుకో, ఒప్పుకుంటే రేపటికల్లా నువ్వు రాణివి”
బయట ఏదో అలికిడి విని మహేష్ గారు వెనక్కి తిరిగారు. నేను అక్కడ ఉండటం మంచిది కాదు అని తిరిగి వచ్చేసాను. ఆడవాళ్ళంటే ఇష్టపడని మహేష్ గారు లక్ష్మి వెంటపడుతున్నారు ఏంటి? మనసులో ఉన్న మాట చెప్పకుండా ఆలస్యం చేస్తే, నా ప్రేమ, అమృతం బదులు విషం అయ్యేటట్టు ఉంది.
*********
– భరద్వాజ్ (Bj Writings)