పరువు లే(ఖ)క
మానవత్వపు విలువలను మృగ్యం చేస్తున్న మనువాద సిద్దాంత భావజాలాన్ని చెక్కుచెదరకుండా చేతులొడ్డి కాపాడుతున్న సనాతన సాంప్రదాయ సమాజానికి నా ఈ పరువు లే(క)ఖ…
ఒకప్పుడు పూర్వపు ఉమ్మడి కుటుంబాలలోని సభ్యులు కుటుంబ యజమాని యొక్క ఆంక్షలకు లోబడి కుటుంబ పరువు ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలగకుండా అతని ఆదేశానుసారం అణకువగా ప్రవర్తించేవారు.
రాను రాను ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయి. నా కుటుంబం, నేను అనే భావన సంకుచితమైపోయింది. ఒకప్పుడు ఇంట్లో మూల స్తంభాలుగా ఉన్న పెద్దవాళ్ల ఆజ్ఞలకు, వాళ్ళ కోరికలకు విలువ ఇవ్వడం తగ్గిపోయింది. ఒకప్పుడు పెద్ద వాళ్ల నిర్ణయాలకు తలోగ్గి వాళ్లు నిర్ణయించిన జీవిత భాగస్వామితో వివాహబంధంలో అడుగు పెట్టేవారు.
మారుతున్న పరిస్థితులలో వ్యక్తి స్వేచ్ఛావాదం పెరిగింది. తమ జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవడంలో పిల్లలు స్వేచ్ఛ తీసుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే ఏర్పడింది అసలు సమస్య.
కులాలు, మతాలు, ఆర్థిక తారతమ్యాలు విస్మరించి తల్లిదండ్రుల అభిప్రాయాలకు విరుద్ధంగా వివాహాలు చేసుకోవడంతో “పరువు” అనే మాటకు ప్రాచుర్యం ఏర్పడింది.
తమ పరువు, ప్రతిష్టలను మంట కలిపి తమ స్థాయికి తగని వారితో జతకట్టారనే నెపంతో దారుణాలకు తెగబడుతున్నారు పాతతరం మనువాద సిద్ధాంతాల పరిరక్షకులు.
వేలాది సంవత్సరాలుగా చాతుర్వర్ణ వ్యవస్థను పెంచి పోషిస్తున్న మనువాద సిద్ధాంతం ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా నిర్విఘ్నంగా కొనసాగుతుందనడానికి ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో..
ఆ వర్గానికి నాదొక సూటి ప్రశ్న ఈ పరువు అనే పదజాలం చుట్టూ ఇంత హింసను, కర్కశత్వాన్ని నిర్మించడం అవసరమా..? మనిషి ప్రాణం కన్నా కుటుంబ గౌరవం, పరువు విలువైనవా?
కుల మతాలను విస్మరించి వేరే వర్గం చేయి అందుకున్నారనే నెపంతో కత్తులు, కఠార్ల తో వెంబడించి, వేధించి అమాయక ప్రాణాలను అత్యంత దారుణంగా హరించి, అపఖ్యాతిపాలయ్యే మీరు, తరతరాల కుటుంబ మర్యాదలను కటకటాల వెనక నిలబెట్టిన మీరు మాత్రం అంతగా ఆదరిస్తున్న పరువు, ప్రతిష్టలకు ఏం పట్టం కట్టినట్లు..?? మీ ముందు తరం వారసులకు నేర నేపథ్యాన్ని ఇవ్వడం తప్ప..?? ఆలోచించండి ఒక్కసారి…
– మామిడాల శైలజ