కల
అమ్మోయ్…. నాకు ఉద్యోగం వచ్చిందంటూ అమ్మాయి అరుపు తో వంటింట్లో ఉన్న నేను బయటకు వచ్చాను. అబ్బా ఎన్ని రోజులకు మంచి శుభవార్త తెచ్చావు అంది అమ్మ మేటికలు విరుస్తూ. ఇక మనం ఈ చిన్న ఇంట్లో ఉండొద్దు. పెద్ద ఇంటికి మారాల్సింది అంటూ తనతో వచ్చిన మనుషులతో ఇంట్లో విలువైన సామాను తో పాటు కొత్త ఇంటికి మారిపోయారు సరితా వారి కుటుంబం.
ఎందుకమ్మా ఈ ఇల్లు బాగుంది కదా అని అంటున్న నారాయణ గారితో నాన్న మీరు మాట్లాడకండి ఇన్ని రోజులూ ఇరుకుగా ఉన్న ఇంట్లో ఉన్నాం. ఇప్పుడైనా కనీసం పెద్ద ఇంట్లోకి మరదాం అంటూ తండ్రి నోరు ముయించి పెద్ద ఇంట్లోకి మారిన వెంటనే పెద్ద టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్ లాంటివి అన్ని తెచ్చేసింది సరిత. తల్లి సంతోషించినా, తండ్రి వారించాడు.
అయినా సరిత వినకుండా నేను కడతాను కదా అంటూ దబాయించింది. ఒకప్పుడు ఉన్న పేదరికం అంతా పోయి హై ఫై గా బ్రతకడం, కిట్టీ పార్టీలు అంటూ కొత్త స్నేహితులు తయారయ్యారు. చూస్తుండగానే రోజులు గడిచే పోయాయి. నెల నెలా ఈ.ఏం.ఐ లు కడుతూ బాగానే ఉన్నా, కొన్నాళ్ళు అయ్యేసరికి జీతం సరిపోవడం లేదు సరితకు.
ఏం చేయాలో తెలియక ఫోన్ లో ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకుంది. అవి కూడా వెంటనే ఖర్చు పెట్టేసింది. అలా వచ్చిన డబ్బు తో దర్జాగా బ్రతుకుతున్న సమయం లోనే సరిత పనిచేసే కంపెనీ ఆర్థిక మాన్యంతో కొందరి ఉద్యోగులను తీసివేశారు అందులో సరిత కూడా ఉంది.
అప్పుడు తనకు ఎం చేయాలో తెలియక ఇంటికి వచ్చేసరికి రెండు నెలలుగా డబ్బు కట్టలేదని ఫైనాన్స్ వారు ఇంటికి వచ్చి తిట్టారు. తన ఉద్యోగం పోయిందని కాస్త సమయం ఇవ్వమని అడిగినా వారు ఇవ్వకుండా ఒక్కో వస్తువు ను తీసుకుని వెళ్లారు.
కిట్టీ పార్టీ కి వచ్చిన స్నేహితులకు ఫోన్ చేసింది సహాయం కోసం కానీ ఎవరూ తమ దగ్గర లేవని చెప్పడం తో నిరాశ లో పడిన సరిత జరిగిందీ అంతా అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది సమయానికి తండ్రి చూసి కాపాడి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు.
సరిత కాస్త సృహ లోకి రాగానే ఏడవడం మొదలు పెట్టింది. అప్పుడు తండ్రి అమ్మా మనకు ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా నాలుగు రాళ్ళు వెనకేసుకొవాలి అంతే కానీ ఆడంబరాలకు వెళ్లి నేల విడిచి సాము చేయరాదు తల్లీ…. ఇదంతా నీకు ముందే చెప్పాను కానీ నువ్వు వినలేదు ఇప్పటికైనా మించింది ఏమి లేదు మరొక ఉద్యోగం వెతుకు తప్పకుండా వస్తుంది నీ వెనక మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు.
ఇప్పుడు సరిత మళ్లీ పాత ఇంటికి మాకం మార్చింది. ఉద్యోగానికి వెళ్లి వస్తూ జీతం లో సగం దాచుకుంటూ, మిగిలిన డబ్బుతో ఇల్లు కట్టే ప్రయత్నం చేయసాగింది. కూతురీ లో వచ్చిన మార్పు చూసిన తండ్రి ఆనంద పడ్డారు.
– భవ్య చారు