శ్రీదేవి.. రైలు.!
ఒక ఊరిలో ఓ ఆసామి ఉన్నాడు..అతనికి హీరోయిన్ శ్రీదేవి అంటే పిచ్చి అభిమానం..ఒక రోజు ఆమె సినిమా చూడ్డానికి పట్నానికి వెళ్లాడు..ఒక సీన్ లో శ్రీదేవి స్నానం చేయడానికి వెళుతుంటుంది..రైలు పట్టాలకు ఆవల తడికలతో కట్టిన స్నానాలగది ఉంది..
ఆ చిల్లుల నుంచి ఆమె అందాలు కనిపిస్తాయేమోనని కళ్లు బాగా పెద్దవి వేసుకుని బల్లమీద కొంచెం ముందుకు జరిగి ఆత్రంగా చూస్తున్నాడు..సరిగ్గా శ్రీదేవి చీర విప్పే సమయానికి పట్టాల మీద రైలు వచ్చేసింది..వీడేమో రైలు పట్టాలకు ఇవతల.. శ్రేదేవి అవతల ఉండిపోయారు..రైలు వెళ్లే సరికి శ్రీదేవి స్నానం కూడా అయిపోయింది.. “ఛా వెధవ రైలు సరిగ్గా ఇప్పుడే రావాలా..బంగారం లాంటి ఛాన్స్ ను మిస్ చేసేసింది”..అని తిట్టుకుంటూ ఇంటికెళ్లిపోయాడు.
మర్నాడు మళ్లీ అదే సినిమాకు వచ్చాడు..ఇప్పుడూ అదే ఆత్రం..పక్కవాడు పలకరిస్తే వాడిపై అరుపులు కేకలు..”మూసుకుని సినిమా చూడరా” అని..ఈ రోజు ఎలాగైనా శ్రీదేవిని అలా చూసేయాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉన్నాడు..ఆ సీన్ రానే వచ్చింది..మళ్లీ అదే రైలు వచ్చి అడ్డంగా పరిగెత్తుకెళ్లిపోయింది..రెండోరోజు కూడా అతని కోరిక నెరవేరలేదు.
దీనవ్వ తగ్గేదేలే..అనుకుంటూ..మూడవ రోజూ మళ్లీ వచ్చాడు అదే సినిమాకు శ్రీదేవి కోసం..ఇప్పుడూ అదే రైలు..అదే పరిస్థితి..శ్రీదేవి మళ్లీ చీర కట్టేసుకుంది..”ఈ సినిమా ఈరోజే ఆఖరంట..రేపట్నుంచి కొత్త సినిమా ఆడతారంట” అని మాట్లాడుకుంటున్నారు సినిమాకు వచ్చినవాళ్లు..వాళ్ల దగ్గరకు వెళ్లి “ఏవండీ శ్రీదేవి రేపట్నుంచి రాదా అండీ” అని అడిగాడు అమాయకంగా..”రాదయ్యా..ఏంటట ఇప్పుడు..అయినా మూడు రోజులుగా చూస్తున్నావ్ ఇదే సినిమాను..ఇంకా చాల్లేదా”..అన్నాడు పక్కనే తలుపు దగ్గర ఉన్న సినిమా టిక్కెట్లు చూసే వ్యక్తి..
“ఏంటి సరిపోయేది..మూడు రోజులు పనులన్నీ మానుకుని..మా ఊరి నుంచి సైకిల్ తొక్కుకుంటూ ఇక్కడికి వచ్చి..డబ్బులెట్టి టిక్కెట్టు కొని లోనికెళితే..సరిగ్గా శ్రీదేవి స్నానానికి వెళ్లినప్పుడే రైలు వస్తోంది..సరేలే రైలెప్పుడు సమయానికి రాదుకదా అని రెండో రోజు వస్తే..మళ్లీ అదే సమయానికి వచ్చేసింది..మూడో రోజైనా ఆలస్యం కాకపోద్దా..శ్రీదేవిని అలా చూడకపోతానా..అని వస్తే ఈరోజు కూడా ఆ రైలు వచ్చిచచ్చింది..
నేను చూడాలనుకున్నది చూడలేదు..మీరు నా దగ్గర టిక్కెట్టు డబ్బులెందుకు తీసుకున్నారు..ఆ రైలుని కాసేపు ఆపాలికదా..ఎందుకు ఆపలేదు..మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగిచ్చేయండి..లేదా రైలుని ఆపి మళ్లీ శ్రీదేవి బొమ్మ వేయండి.”అంటూ అక్కడే కూర్చున్నాడు..అతని మాటలకు షాక్ తో బిగుసుకు పోయాడు గేట్ మెన్…పగలబడి నవ్వుకున్నారు సినిమాకొచ్చినవాళ్లంతా..అతను మాత్రం చాలా సీరియస్ గా అక్కడే కూర్చున్నాడు శ్రీదేవి కోసం.!
– ది పెన్