ఒంటరి
“నేనస్సలు వెళ్ళను. నాకసలు హాస్టల్ ఇష్టం లేదు.”అంటూ అమ్మ దగ్గర మారం చేస్తున్నాడు పదేళ్ల వినయ్.
“మరి నీకేమిష్టం?” అడిగింది తల్లి.
“మరేమో నాకు నువ్వంటే ఇష్టం. నాన్నతో బజారుకు వెళ్లడం ఇష్టం. ఇంటి పక్కన ఫ్రెండ్స్ అందరితో క్రికెట్ ఆడుకోవడం ఇష్టం. నువ్వు అన్నం తినిపిస్తే ఇష్టం. చెల్లితో గొడవ పడడం ఇష్టం. మన జూలితో (పెంపుడు కుక్క) ఆడడం అంటే ఇష్టం. ఎక్వేరియంలో చేపలతో మాట్లాడడం ఇష్టం.
నేను దగ్గరుండి నాటిన మొక్కలకు నీళ్లు పోయడం ఇష్టం. బాల్కనీలో కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఆకాశంలో చుక్కలు చూడడం ఇష్టం. అమ్మమ్మ ఊరు అంటే ఇష్టం. మరేమో ఇంకా…” అంటూ ఆలోచిస్తూ ఏవో చెప్పబోతున్న కొడుకును వారించి “అలా అంటే ఎలా చిన్నోడా! నువ్వు హాస్టల్ కి వెళ్ళను అంటే ఎలా చెప్పు? మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాం.
నువ్వు హాస్టల్ కి వెళ్లి చక్కగా చదువుకోవాలి. మంచి మార్కులు సాధించి ఐఐటీలో సీటు తెచ్చుకుని నువ్వు విదేశాలకు వెళ్తే, ఫలానా వాళ్ల పిల్లాడు విదేశాల్లో ఉన్నాడని బంధువులంతా చెప్పుకుంటుంటే ఎంత గర్వం!” అంటూ కళ్ళు విప్పార్చుకుంటూ చెప్పింది రాజి. ఏమీ అర్థం కాని వినయ్ అయోమయంగా చూస్తున్నాడు.
అది గమనించిన తండ్రి రాజేష్, వినయ్ ని దగ్గరగా తీసుకుని “చూడు విన్నూ, మీ పెద్ద అత్తయ్య కొడుకు చదువులో ఎప్పుడూ ముందంజలో ఉంటూ మంచి ర్యాంకులతో విదేశీ యూనివర్సిటీల్లో సీటు సంపాదించబట్టి, పెద్దపెద్ద కంపెనీలు అతనిని పెద్ద జీతాలతో ఆహ్వానించాయి. ఇప్పుడు చూడు మీ బావ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఎంత దర్జాగా బతుకుతున్నాడో..
వాడు పంపించే డబ్బులతో మా అక్క, బావ ఎన్ని ఫ్లాట్లు కొన్నారో, ఎంత పొలం కూడబెట్టారో… ఆస్తులతోపాటు అదనంగా పేరు ప్రతిష్ఠలు కూడా ఫ్రీగా వచ్చాయి… వాడిని పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరుల పిల్లలు క్యూలో నుంచున్నారు.
నువ్వు కూడా అంత ఎత్తుకు ఎదగాలని మా కోరిక రా! అందుకే అప్పు చేసి మరీ నిన్ను హాస్టల్ కి పంపిస్తున్నాం..” తండ్రి రాజేష్ మాటలు వింటూ మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు వినయ్.
ఇంటిదగ్గర స్నేహితులందరికీ అయిష్టంగానే వీడ్కోలు పలుకుతూ చెల్లికి తన మొక్కల బాధ్యతలప్పజెప్పి కళ్ళ నీళ్లు సుడిగుండాలవుతుండగా గుండె చెరువులో మునుగుతూ బయలుదేరాడు.
హాస్టల్ దగ్గర అమ్మని పొదివి పట్టుకుని వదలలేకపోతున్నాడు. హాస్టల్ ఆయమ్మ తనను వెనక్కి వెనక్కి లాగుతుంది. అమ్మానాన్న ఎంతో నచ్చజెప్పి తనను వదిలించుకుని వీడ్కోలు పలుకుతుంటే వెక్కిళ్లు వచ్చే ఏడుపుకి కళ్ళు ముక్కు ఏకమయ్యి తల్లిదండ్రులు లీలగా కనిపిస్తున్నారు.
తనలాగే అక్కడ ఎందరో ఏడుస్తూ కనిపించారు. ఓదార్చేవారు లేక వాళ్ళ ఏడుపు అరణ్యరోదనే అయింది. ఎప్పుడూ అమ్మ పక్కనే పడుకునే వినయ్, మొదటిసారిగా బిక్కుబిక్కుమంటూ హాస్టల్లో తన బెడ్ పై అశోకవనంలో సీతలా ఒంటరిగా శోకిస్తున్నాడు.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
“ఏంటి మావయ్య! ఆరోగ్యం ఎలా ఉంది?” ” ఏం చెప్పను రాజేష్! వయసుడిగిపోయిన వాళ్ళం. రోజురోజుకీ ఆయుష్షు తగ్గుతుంటే మందులతో ఆయువు పోసుకుంటున్న వాళ్ళం. ఇంకెన్నాళ్ళో ఈ ఒంటరి బతుకులు.
మీ అత్తయ్యకి ఒంట్లో అసలు బాగుండడం లేదు. నేనే అన్నీ దగ్గరుండి చూసుకోవలసి వస్తుంది. ఎన్ని రోజులని అమ్మాయికి భారం కాగలం? అమ్మాయిని వేరే ఇంటికి పంపించేశాక రమ్మనే హక్కు మనకెక్కడుంటుంది.
వాడేమో విదేశాలు వదిలి రాడాయే! మేమీ రోగాలతో అక్కడికి వెళ్ళలేమాయే! ఒంటరి బతుకులకు మించిన శాపం మరొకటి ఉండదేమో! వారసుడు పుట్టి ఇంచుమించు రెండేళ్ల అవుతుంది. వాడిని తనివి తీరా తాకాలని, వాడితో మీసం మెలేయించుకోవాలని మనసు తహతహలాడుతున్నా, అది తీరని కోరికలా మిగిలిపోయింది.
వాడినైనా ఒక్కసారి చంటోడిని తీసుకురమ్మని బ్రతిమలాడుతున్నా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. కన్నవారిని చూడడానికే రాలేని తీరికలేని బ్రతుకులేమిటో..” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సూర్యారావు.
ఎలా ఓదార్చాలో అర్థం కాని రాజేష్ భారంగా బయలుదేరాడు. చిన్నప్పుడు కలిసి చదువుకున్న చనువుతో మావయ్య కొడుకును మందలించాలనుకుని ఫోన్ చేశాడు.
“హలో ఆనంద్ ఎలా ఉన్నావు?” “బాగున్నాను రాజేష్ బావ! నువ్వు ఎలా ఉన్నావు? రాజి అక్క, పిల్లలు ఎలా ఉన్నారు?” “అందరూ బాగానే ఉన్నారు ఆనంద్.. ఉదయం అమ్మను చూడడానికి వెళ్లాను. అమ్మ ఆరోగ్యం బొత్తిగా బాలేదు. నాన్న చాలా బాధపడుతున్నారు. ఈ వయసులో వాళ్ళని ఒంటరిగా చూసి చాలా బాధేసింది.
వాళ్ల మనవడిని చూడలేకపోతున్నామన్న బాధ వాళ్ళని మరింత క్రుంగ తీస్తుంది రా! అసలు కంటే వడ్డీ ముద్దు అన్నారు కదా! కొడుకుని, మనవడిని కళ్ళారా చూసుకోవాలని ఆ కన్న ప్రేమ కలలు కంటోంది రా! ఆ ప్రేమపాశం ఎంతో గొప్పదిరా!
నీకు చెప్పేంత వాడిని కాకపోయినా వాళ్ళని చూస్తే మనసు తరుక్కుపోయింది. అందుకే చెప్పడానికి సాహసించాను. ఇప్పుడైనా వీలు చూసుకుని వాళ్ళ దగ్గరకు ఒకసారి రారా!” సలహా ఇచ్చాడు రాజేష్. ఆశ్చర్యపోయాడు ఆనంద్.
“ప్రేమపాశం అంటే ఏమిటో నిజంగా తెలియదు నాకు. ఊహ తెలిసినప్పుడే నన్ను హాస్టల్లో వేసి నా స్వాతంత్ర్యాన్ని కాలరాసినా, నా మంచికే అని తలొంచుకున్నాను. బాత్రూం గోడలతో కూడా నా కళ్ళలోని నీలి పరదాలు విప్పి భావాలను పంచుకునే సమయం లేక అక్షరాలతో కుస్తీ పడుతూ నాతో నేను ఒంటరి పోరాటం చేశాను.
ఈ పోటీ ప్రపంచపు పరుగు పందెంలో ఒంటరిగా పరిగెత్తుతూ ఒక్కొక్క విజయ మైలురాయిని దాటుకుంటూ ఎన్నో ఆనందాలను కోల్పోయిన విజేతను నేను. నా భావాలను అర్థం చేసుకొని నా మనసుకు దగ్గరైన నా స్నేహితురాలు గీతతో నాకు పెళ్లి చేయమని బ్రతిమలాడాను. కులాలు వేరని చెప్పారు.
“మమ్మల్ని కాదని ఆమెని చేసుకుంటే మా పరువు పోతుంది. మా పరువు పోయినప్పుడు మేం బ్రతికి ప్రయోజనం లేదు కాబట్టి మేం విషం తాగి చనిపోతాం” అని బెదిరించారు. కన్న వాళ్ళ కోసం ప్రేమ త్యాగం చేసిన నాకు ప్రేమపాశం అంటే ఏమిటో తెలియదు.
కట్నం కోసం అయినింటి పిల్లను చేసినప్పుడు, ఆమె హోదాకి తగినట్టు మసు లుకుంటూ, ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూ కళ్ళు మూసుకుని కాపురం చేశాను. అమ్మకు బాగా లేదని తెలిసినా కడుపుతో ఉన్న భార్యను ఒంటరిగా వదిలి రాలేక విలవిలలాడిన నాకు నిజంగా ప్రేమపాశం తెలియదు.
విదేశాల్లో సెటిల్ అవ్వాలని అత్తమామల ఒత్తిడి మీద గ్రీన్ కార్డ్ కు అప్లై చేసాను. రెండు సంవత్సరాల కట్టడి మధ్య సొంత గూటికి రాలేక తల్లక్రిందులవుతూ తల్లితండ్రులను తలచి తలచి తల్లడిల్లుతున్నా దేశం కాని దేశంలో ఓదార్చే దిక్కులేని ఒంటరి పక్షిని నేను.
కనీసం అమ్మానాన్నల బాధను పంచుకుని ఆప్యాయతనందించే మీరందరూ చేరువలోనే ఉన్నారు. ఆది నుంచి నేను అందరూ ఉన్న అనాధనే.. ఎవరూ దగ్గర లేని ఏకాకినే.. బావా ఒక్కసారి ఆలోచించు ఒంటరి నేనా? వాళ్ళా?” ఆనంద్ ప్రశ్న వింటుంటే తల తిరిగిపోయింది రాజేష్ కి. మారు మాట్లాడలేకపోయాడు.
“ఇవేవీ మనసులో పెట్టుకోకు బావ! రేపో మాపో నాకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది! నేను తప్పక త్వరలోనే అక్కడకు వస్తాను. అందరి ప్రేమకు ముఖం వాచిన నేను అక్కడకు రావడానికి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాను. నా గూటిలోకి రెక్కలు కట్టుకు వాలాలని మనసు తహతహలాడుతోంది. ఇక ఉంటాను బావా!” అంటూ ఆనంద్ ఫోన్ పెట్టేసినా, అతని మాటలు రాజేష్ చెవిలో మార్మోగుతున్నాయి…
బహుశా, తన అక్క కొడుకు అఖిల్ కు పెళ్లి కాకపోయినా తన పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే అని గుర్తుకు వచ్చింది. ఈ భావాలన్నీ ఒక్కసారి తనని చుట్టుముట్టి ఎన్నో ప్రశ్నలు సంధిస్తుంటే కన్నీటితో వీడ్కోలు పలికిన కొడుకు వినయ్ కళ్ళలో మెదలగా, కొడుకు ఒంటరితనాన్ని పోగొట్టాలని వడివడిగా అడుగులు వేసుకుంటూ హాస్టల్ వైపు సాగాడు…..
– సలాది భాగ్యలక్ష్మి